Kakinada Accident : కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఒకే కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు మృతి, తల్లికి తీవ్రగాయాలు
Kakinada Accident : కాకినాడ జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందగా, తల్లికి తీవ్రగాయాలయ్యాయి.
Kakinada Accident : కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందగా, తల్లికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను వైద్యం నిమిత్తం రాజమండ్రిలోని ఆసుప్రతికి తరలించారు. మృతులు, క్షతగాత్రులది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరుకు చెందిన వారు.
ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఆదివారం కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం మురారి గ్రామ శివారులో జగ్గమపేట వైపు నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు గ్రామానికి చెందిన నంగలం దుర్గ (40), ఆమెకు ముగ్గురు కుమారులు అఖిల్ (10), ఏసు (18), రాజు (18) ఉన్నారు. కుటుంబం మొత్తం కూలీ పనులపై ఆధారపడి జీవిస్తోన్నారు.
ఈ క్రమంలోనే కూలి పనులు కోసం ఇతర ప్రాంతాలు వెళ్తారు. అక్కడ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తోన్నారు. కొన్ని రోజులు ఆయా ప్రాంతాల్లో పనులు చేసుకుని స్వగ్రామానికి వచ్చి, కొన్ని రోజులు ఉండి మళ్లీ పని దొరికిన ప్రాంతానికి వెళ్తూ ఇలా పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అందులో భాగంగానే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పని కోసం వెళ్లి, పని పూర్తి అయిన తరువాత తిరిగి ద్విచక్ర వాహనంపై పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు స్వగ్రామానికి వస్తున్నారు.
ఆదివారం తెల్లవారు జామున 4 గంటల సమాయంలో కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం మురారి గ్రామ శివారులో జగ్గమపేట వైపు నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న జాతీయ రహదారిపై వర్షంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో వారంతా కింద పడ్డారు. వెంటనే రోడ్డుపై వారు చెల్లాచెదురు అయ్యారు. అయితే కిందపడిన వీరు లేచే లోపే వెనుక నుంచి వచ్చి మరో వాహనం వీరిని తొక్కుకుంటూ వెళ్లింది.
దీంతో ముగ్గురు అన్న దమ్ములు అఖిల్, ఏసు, రాజు అక్కడికక్కడే మృతి చెందారు. వారి అమ్మ నంగలం దుర్గ మాత్రం తీవ్ర గాయాలతో బయటపడింది. ఆమెను చికిత్స నిమిత్తం రాజమండ్రిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీఐ లక్ష్మణరావు, ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
రోడ్డపై పడి ఉన్న మూడు మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుప్రతికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. అనంతరం విచారణ ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని సీఐ లక్ష్మణరావు, ఎస్ఐ రామకృష్ణ పరిశీలించారు. ఘటనా స్థలానికి సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించిన తరువాతే, ఏ వాహనం వీరిని ఢీకొట్టిందని, ఈ ఘటనా ఎలా జరిగిందని అనే వివరాలు తెలుస్తాయని సీఐ లక్ష్మణరావు, ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం