MLC Case : ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ తిరస్కరణ
కారు డ్రైవర్‌ను హత్య చేసిన కాకినాడ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. మరోవైపు హత్య కేసు దర్యాప్తును సిబిఐకు అప్పగించాలంటూ మృతుడి కుటుంబ సభ్యులు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.
హత్యారోపణలు ఎదుర్కొంటున్న కాకినాడ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను స్పెషల్ కోర్టు తిరస్కరించింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను దారుణంగా హత్య చేసిన అభియోగాలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ బెయిల్ కోసం కొద్ది రోజులుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీ బెయిల్ పిటిషన్‌పై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరిగింది. నిందితుడు అనంతభాస్కర్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి దానిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పదో అదనపు కోర్టు న్యాయమూర్తి నాగేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో మృతుడి కుటుంబానికి ఇంకా ముప్పు పొంచి ఉందనే అభిప్రాయాలతో ఏకీభవించిన న్యాయస్థానం బెయిల్ పిటిషన్ రద్దు చేసింది.
ఎమ్మెల్సీని కేసులో ఇరికించారట....
కారు డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును అక్రమంగా ఇరికించారని, రాజకీయ కారణాలతో అభియోగాలు మోపారని వాదించారు. రోడ్డు ప్రమాదంలోనే డ్రైవర్ సుబ్రహ్మణ్యం మరణించాడని నిందితుడి న్యాయవాది వాదించారు. నిందితుడికి అడ్డతీగల మండలం ఎల్లవరంలో శాశ్వత నివాసం ఉందని, ఎమ్మెల్సీ పదవిలో ఉన్నందున పారిపోయే అవకాశం లేనందున బెయిల్ మంజూరు చేయాలని వాదించారు. డ్రైవర్ హత్య కేసులో ఇప్పటికే దర్యాప్తు పూర్తైనందున నిందితుడిని జైల్లో ఉంచాల్సిన అవసరం లేదని వాదించారు.
నిందితుడి తరపు వాదనలపై ఏపీ పౌరహక్కుల సంఘం న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. ముప్పాళ్ల సుబ్బారావు నేతృత్వంలో మృతుడి తల్లి నూకరత్నం తరపున పిటిషన్ దాఖలు చేశారు. సుబ్రహ్మణ్యంను దారుణంగా హింసించి చంపేశారని, ఆ తర్వాత దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని ఆరోపించారు. పక్కా ప్రణాళికతో హత్య జరిగిందని, నిందితుడిని విడుదల చేస్తే సాక్ష్యాధారాలను మాయం చేస్తారని ఆరోపించారు.
నిందితుడికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోందని, ఎమ్మెల్సీ కావడానికి ముందే తీవ్ర నేరారోపణలు ఉన్నాయని, గత చరిత్ర దృష్టిలో ఉంచుకుని బెయిల్ రద్దు చేయాలని కోరారు. ఎమ్మెల్సీ బయటకు వస్తే మృతుడి కుటంబ సభ్యులకు హానీ తలపెడతారని ఆరోపించారు. వారి వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం బెయిల్ పిటిషన్ రద్దు చేసింది.
సిబిఐ విచారణ జరిపించండి....
మరోవైపు ఎమ్మెల్సీ కారు డ్రైవర్ హత్య వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని మృతుడి తండ్రి గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. దళిత సంఘాల ప్రతినిధులతో కలిసి గవర్నర్‌ను కలిసిన మృతుడి తండ్రి ఎమ్మెల్సీ అనంతబాబు నుంచి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విచారణ మీద తమకు నమ్మకం లేదని, సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరారు. కేసును నీరుగార్చేందుకు జిల్లా ఎస్పీ మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమ కుమారుడి హత్య కేసులో నిష్పాక్షిక విచారణ దర్యాప్తు జరగాలంటే సిబిఐ విచారణకు ఆదేశించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.
టాపిక్