Kakinada Crime : కాకినాడ జిల్లాలో ఘోరం, బాలికను ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి- ఆపై వ్యభిచారం చేయాలని ఒత్తిడి
Kakinada Crime : కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. బాలికను ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకున్న యువకుడు...ఆమెను వ్యభిచారకూపంలోకి దించేందుకు ప్రయత్నించాడు. బాలిక అంగీకరించకపోవడంతో ఇబ్బందులకు గురిచేశారు. దీంతో బాలిక మానసిక పరిస్థితి క్షీణించింది.
Kakinada Crime : కాకినాడ జిల్లాలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. బాలికకు ప్రేమ పేరుతో వల వేసి, పెళ్లి చేసుకున్నాడో యువకుడు. అనంతరం ఇంటికి తీసుకెళ్లి వ్యభిచారం చేయాలని మైనర్ పై భర్త, అత్త ఒత్తిడి తీసుకొచ్చారు. దీనికి ప్రతిఘటించిన బాలికను తీవ్ర ఇబ్బందులు పెట్టారు.

బాలిక మానసికంగా కుంగిపోవడంతో విశాఖపట్నంలోని విమ్స్‌లో చికిత్స అందించారు. అప్పటికీ బాలిక పరిస్థితిలో ఎటువంటి మార్పు రాకపోయేసరికి మానసిక వైద్యశాలలో చేర్చారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే?
కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో ఎన్టీఆర్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దాపురం ఎన్టీఆర్ కాలనీకి చెందిన యువకుడు చందుకి, అనకాపల్లికి జిల్లాకు చెందిన బాలిక (17) కొంత కాలం క్రితం తుని రైల్వే స్టేషన్‌లో పరిచయం అయింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. తాను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి ఆ బాలికను నమ్మించాడు చందు.
దీంతో ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చి ప్రేమికుడితో వెళ్లింది. బాలిక తల్లిదండ్రులు ఆమె కోసం వెతికినా ఆచూకీ లభ్యం లేదు. దీంతో అనకాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో చందుతో వెళ్లిన బాలికకు అతడి కుటుంబ సభ్యులు పెళ్లి చేశారని తెలిసింది.
చందుతో పాటు బాలిక ఆచూకీని పోలీసులు కనుక్కున్నారు. వారిని అనకాపల్లి తీసుకెళ్లి ఇరు కుటుంబాల సమక్షంలో ఉంచారు. యువకుడితో బాలికకు పెళ్లి కావడంతో చేసేదేమీ లేక, బాలికను అత్తింట్లోనే ఉండాలని చెప్పారు. దీంతో బాలికను పెద్దాపురం తీసుకెళ్లారు. అయితే అప్పుడే భర్త, అత్తల అసల స్వరూపం బయటపడింది. అత్త నీలిమ డబ్బు సంపాదనే లక్ష్యంగా బాలికను వ్యభిచారం చేయాలని బలవంతం పెట్టింది. అందుకు బాలిక ప్రతిఘటించడంతో...ఇబ్బందులకు గురిచేశారు.
బలవంతంగా మందులు వాడించడంతో
రకరకాల మందులను బాలికతో బలవంతంగా మింగించడంతో.. ఆరోగ్యం క్షీణించింది. కాళ్లు చేతులు వంకర్లు తిరిగి, నోటి నుంచి మాట రాక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. పరిస్థితి దిగజారడంతో 2024 డిసెంబర్ 28న ఆమెను కాకినాడ జనరల్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయం బాలిక కుటుంబ సభ్యులకు తెలిసి...బాలికను జనవరి 10న స్వగ్రామం తీసుకెళ్లారు. అనంతరం అనకాపల్లిలోని ఆసుపత్రిలో కొన్ని రోజులు చికిత్స అందజేశారు.
అయినప్పటికీ ఆమె ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు రాకపోవడంతో జనవరి 20న విశాఖపట్నంలోని విమ్స్‌లో చేర్పించారు. బాలిక మానసిక పరిస్థితి మారకపోవడంతో విశాఖలోని మానసిక వైద్యశాలలో చేర్పించారు. దీంతో పెద్దాపురం పోలీసులు బాధిత బాలిక తల్లి నుంచి ఫిర్యాదు స్వీకరించి ఈనెల 26న కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై స్పందించిన పెద్దాపురం ఎస్ఐ వి.మౌనిక... తాము ఎటువంటి తాత్సారం చేయలేదని, నాలుగు రోజుల క్రితమే కేసు నమోదు చేశామని తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. విచారణ పూర్తి అయిన తరువాత అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు