Neet Student Death: కృష్ణా జిల్లాలో కాకినాడ జిల్లాకు చెందిన నీట్ విద్యార్థిని అనుమానాస్ప‌ద స్థితిలో మృతి ..-kakinada district neet student dies under suspicious circumstances in krishna district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Neet Student Death: కృష్ణా జిల్లాలో కాకినాడ జిల్లాకు చెందిన నీట్ విద్యార్థిని అనుమానాస్ప‌ద స్థితిలో మృతి ..

Neet Student Death: కృష్ణా జిల్లాలో కాకినాడ జిల్లాకు చెందిన నీట్ విద్యార్థిని అనుమానాస్ప‌ద స్థితిలో మృతి ..

HT Telugu Desk HT Telugu
Jan 09, 2025 01:59 PM IST

Neet Student Death: కృష్ణా జిల్లాలో కాకినాడ జిల్లాకు చెందిన నీట్ విద్యార్థిని అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందింది. ఈ విషాద వార్త విన్న తండ్రి కుప్ప‌కూలిపోయాడు. దీంతో ఆయ‌న‌ను ఆసుప‌త్రిలో చేర్పించాల్సి వ‌చ్చింది. మృతురాలి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి విద్యార్థి సంఘాల నేత‌లు ఆందోళ‌న చేప‌ట్టారు.

నీట్ విద్యార్థిని అనుమానస్పద మృతి
నీట్ విద్యార్థిని అనుమానస్పద మృతి

Neet Student Death: నీట్‌ శిక్షణ కోసం చేరిన విద్యార్ధిని అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడం తల్లిదండ్రుల్ని విషాదంలో నింపింది. త‌న కుమార్తెను డాక్ట‌ర్ని చేసి స‌మాజానికి సేవ చేసేందుకు అందించాల‌నే ఆలోచ‌న‌తో క‌ష్ట‌ప‌డి శ్రీ‌చైత‌న్య కాలేజీలో చేర్పించిన కుటుంబానికి ఈ ఘ‌ట‌న శోక‌సంద్రాన్ని మిగ‌ల్చింది. ఆ కుటుంబంలో చ‌దువుకున్న మొద‌టి వ్య‌క్తి ఆమెనే. త‌మ బ్ర‌తుకులు మార్చుతుంద‌ని ఆ కుటుంబం భావించింది. తిన్నా తిన‌క‌పోయినా కుమార్తె చ‌దువుకు త‌ల్లిదండ్రులు మొత్తం పెట్టేవారు. కానీ అంత‌లోనే అనంత‌లోకానికి చేరింది. ఆ కుటుంబ క‌ల‌లు మ‌ధ్య‌లోనే ఆగిపోయాయి.

yearly horoscope entry point

ఈ ఘ‌ట‌న కృష్ణా జిల్లాలోని పెన‌మ‌లూరు మండ‌లం పోరంకి శ్రీ చైత‌న్య కాలేజీలో చోటు చేసుకుంది. పెన‌మ‌లూరు పోలీసులు తెలిపిన వివ‌రాలు ప్రకారం కాకినాడ జిల్లా యు.కొత్త‌ప‌ల్లి మండ‌లం ఉప్పాడ‌కు చెందిన రామిశెట్టి గంగాభువ‌నేశ్వ‌రి (18) పోరంకి శ్రీ‌చైత‌న్య కాలేజీలో నీట్ లాంగ్ ట‌ర్మ్ కోచింగ్ తీసుకుంటుంది. అయితే ఆమె మంగ‌ళ‌వారం అనారోగ్యంతో తీవ్ర అస్వ‌స్థ‌తకు గురైంది. వాంతులు కావ‌డంతో ఆయ‌న చాలా నీరసంగా ఉంది. దీంతో కాలేజీ ప్ర‌తినిధులు ఆమెను మంగ‌ళ‌వారం సాయంత్రం సిక్ రూమ్‌కు పంపించారు.

అక్క‌డ ప్రాథ‌మిక వైద్యం అందించారు. అయితే తీవ్ర త‌ల‌నొప్పి ఉంద‌ని బుధ‌వారం తెల్ల‌వారుజామున 3 గంట‌ల స‌మయంలో త‌న రూమ్‌కు వ‌చ్చింది. అయితే ఆమె తీవ్ర అస్వ‌స్థ‌త‌తో పూర్తిగా నీర‌సంగా మారింది. దీంతో కాలేజీ యాజ‌మాన్యం ఉద‌యం వైద్య ప‌రీక్ష‌లు చేయించి, స‌మీపంలో ఉన్న కామినేని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే ప‌రీక్షించిన వైద్యులు, ఆమె కొద్ది నిమిషాల ముందే మృతి చెందిన‌ట్లు ధ్రువీక‌రించారు.

ఉప్పాడ‌లో ఉన్న ఆమె తండ్రి యోగి వేమ‌న కుమార్తె మ‌ర‌ణ‌వార్త విని అక్క‌డిక‌క్క‌డే గుండె పోటుతో కుప్ప‌కూలిపోయాడు. దీంతో వెంట‌నే కుటుంబ స‌భ్యులు ఆయ‌న‌ను స్థానిక ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కుమార్తె మ‌ర‌ణం వార్త తెలియ‌డంతో కుప్ప‌కూలిన తండ్రి ఆసుప‌త్రిలో ఉండ‌టంతో త‌ల్లి గోవింద‌మ్మ‌ కొంత మంది కుటుంబ స‌భ్యుల‌ను తీసుకుని కాలేజీకి చేరుకున్నారు. త‌న కుమార్తెకు స‌కాలంలో వైద్యం అందించ‌లేద‌ని, ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌లేద‌ని, త‌మ‌కు కూడా ఎటువంటి స‌మాచారం ఇవ్వ‌లేద‌ని త‌ల్లి గోవింద‌మ్మ‌, బంధువులు కాలేజీ యాజ‌మాన్యంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విద్యార్థిని మ‌ర‌ణంపై స‌మాచారం అందుకున్న విద్యార్థి సంఘాల నేత‌లు కాలేజీ వ‌ద్ద‌కు చేరుకున్నారు. మృతురాలి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి కాలేజీ వ‌ద్ద ఆందోళ‌న చేప‌ట్టారు.

దీంతో ఆందోళ‌న‌పై స‌మాచారం అందుకున్న పెన‌మ‌లూరు పోలీసులు కాలేజీ వ‌ద్ద‌కు చేరుకున్నారు. ఆందోళ‌న చేస్తున్న వారితో పోలీసులు మాట్లాడారు. కాలేజీ యాజ‌మాన్యం నిర్ల‌క్ష్యం కార‌ణంగానే త‌న కుమార్తె మృతి చెందింద‌ని త‌ల్లి గోవింద‌మ్మ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అనంత‌రం విద్యార్థిని మృత దేహాన్ని స్వ‌గ్రామానికి త‌ర‌లించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంటి మ‌హాల‌క్ష్మిగా భావించిన‌ ఆ కుటుంబం, ఆమె మ‌ర‌ణ వార్త తెలియ‌డంతో తీవ్ర విషాదంలోకి వెళ్లింది. మృతురాలి త‌ల్లి, త‌మ్ముళ్లు రోద‌న‌లు మిన్నంటాయి. బంధువులు క‌న్నీరు మున్నీరుతో విల‌పించారు. దీంతో ఉప్పాడ‌లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner