Kakinada Crime : కాకినాడ జిల్లాలో దారుణం- చాక్లెట్లు, డ‌బ్బులు ఆశ‌చూపి ఇద్దరు చిన్నారుల‌పై లైంగిక దాడి-kakinada district horror two children assaulted with chocolate and money lure ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kakinada Crime : కాకినాడ జిల్లాలో దారుణం- చాక్లెట్లు, డ‌బ్బులు ఆశ‌చూపి ఇద్దరు చిన్నారుల‌పై లైంగిక దాడి

Kakinada Crime : కాకినాడ జిల్లాలో దారుణం- చాక్లెట్లు, డ‌బ్బులు ఆశ‌చూపి ఇద్దరు చిన్నారుల‌పై లైంగిక దాడి

HT Telugu Desk HT Telugu

Kakinada Crime : కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు చిన్నారులపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారులకు చాక్లెట్లు, డ‌బ్బులు ఆశ చూపి తన జ్యువెలరీ షాప్‌ లోప‌లికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. చిన్నారులు కడుపు నొప్పి అని బాధపడడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

కాకినాడ జిల్లాలో దారుణం- చాక్లెట్లు, డ‌బ్బులు ఆశ‌చూపి ఇద్దరు చిన్నారుల‌పై లైంగిక దాడి

Kakinada Crime : కాకినాడ జిల్లాలో ఘోర‌మైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారుల‌పై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విష‌యం తెలుసుకున్న చిన్నారుల త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యులు, స్థానికులు ఆ దుర్మార్గుడికి దేహ‌శుద్ధి చేశారు. అనంత‌రం పోలీసులకు అప్పగించారు. అయితే ఈ ఘ‌ట‌న‌లో పోలీసుల చ‌ర్యల‌ు అనుమానాలకు తావిస్తోంది.

ఈ ఘ‌ట‌న కాకినాడ జిల్లా పెద్దాపురం ప‌ట్టణంలోని ఓ ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్రకారం కామేశ్వర‌రావు (55 ఏళ్ల) బంగారం ఆభ‌ర‌ణాల‌ త‌యారీ షాప్ నిర్వహిస్తున్నాడు. ఆయ‌న భార్య ఐదు నెల‌ల క్రితం మృతి చెందింది. అదే వీధిలో నివాసం ఉంటున్నపేద కుటుంబాల‌కు చెందిన ఇద్దరు చిన్నారుల‌పై కామేశ్వరరావు లైంగిక దాడులకు పాల్పడ్డాడు. ఇద్దరిలో ఒక బాలికకు 7 ఏళ్లు కాగా, రెండో బాలిక‌కు 10 ఏళ్ల వ‌య‌స్సు ఉంటుంది. వారిద్దరూ స్థానిక ప్రభుత్వ పాఠ‌శాల‌లో రెండో త‌ర‌గ‌తి, ఐదో త‌ర‌గ‌తి చదువుతున్నారు.

రెండో త‌ర‌గ‌తి చ‌దివే చిన్నారికి తండ్రి లేడు, ఏడో త‌ర‌గ‌తి చ‌దివే చిన్నారి త‌ల్లి మాన‌సిక వ్యాధితో బాధ‌ప‌డుతోంది. కూలీ నాలీ చేసుకునే కుటుంబాల‌కు చెందిన ఈ చిన్నారుల‌పై దుర్మార్గుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బంగారం షాప్ మార్గంలో చిన్నారుల‌ను పిలిచి చాక్లెట్లు, డ‌బ్బులు ఆశ చూపి షాప్‌లోప‌లకి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. అంతేకాకుండా ఆ చిన్నారుల‌తో పాడుప‌నులు చేయించాడు. అనంత‌రం ఆ చిన్నారుల‌కు రూ.20 ఇచ్చాడు. రెండు రోజులుగా ఇలానే పాడు ప‌నులు చేశాడ‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు.

తీవ్ర కడుపు నొప్పి రావడంతో

అయితే చిన్నారులు తీవ్ర క‌డుపు నొప్పితో బాధ‌ప‌డుతుంటే, వారిని ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. దీంతో డాక్టర్ ప‌రీక్షలు నిర్వహించి వారికి ప్రైవేట్ పార్ట్స్‌పై గాయాలు అయ్యాయ‌ని తెలిపారు. దీంతో చిన్నారులను కుటుంబ సభ్యులు ఆరా తీశారు. ఏం జరిగిందని ప్రశ్నించారు. అప్పుడు ఆ చిన్నారులు జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించారు.

దీంతో చిన్నారుల కుటుంబ స‌భ్యులు, బంధువులు కామేశ్వరరావుకు దేహ‌శుద్ధి చేశారు. వీరికి స్థానికులు కూడా తోడైన చిత‌క‌బాదారు. అనంత‌రం పోలీసుల‌కు అప్ప‌గించారు. అయితే పోలీసులు త‌మ‌కు ఎటువంటి ఫిర్యాదు రాలేద‌ని, అందుకే కేసు న‌మోదు చేయ‌లేద‌ని అంటున్నారు. పోలీసుల చర్యలు అనుమానాల‌కు తావిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. అయితే వాస్తవానికి ఇలాంటి ఘ‌ట‌న‌ల్లో పోలీసులు బాధిత చిన్నారుల‌ను ప్రభుత్వ ఆసుప‌త్రికి తీసుకెళ్లి వైద్య ప‌రీక్షలు నిర్వహిస్తారు. కానీ ఈ ఘ‌ట‌న‌లో పోలీసులు చిన్నారుల‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ఎటువంటి వైద్య ప‌రీక్షలు నిర్వహించ‌లేదు. ఇదే ప‌లు అనుమానాల‌కు తావిస్తుంది. మ‌రోవైపు రాజీ ప్రయత్నాలు జ‌రిగాయ‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఏడేళ్ల బాలిక అమ్మమ్మ మాట్లాడుతూ త‌న మన‌వరాలి త‌ల్లిని కామేశ్వర‌రావు చెల్లి చెల్లి అని పిలిచేవాడ‌ని, ఆమె కుమార్తెను కూడా మేన‌కోడ‌లు అని పిలిచేవాడ‌ని అన్నారు. కానీ అణ్యంపుణ్యం తెలియ‌ని చిన్నారుల‌ను పాడు చేశాడ‌ని క‌న్నీరు మున్నీరై విల‌పించారు. తన మనవరాలు అన్నం తినలేకపోయిందని అన్నారు. అతడు ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ‌డం దారుణ‌మ‌ని, ఆ దుర్మార్గుడికి స‌రైనా శిక్ష ప‌డాల‌ని స్థానికులు డిమాండ్ చేశారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

HT Telugu Desk

సంబంధిత కథనం