Kadiri Sub Registrar : టీ కొట్టులో రిజిస్ట్రేషన్ దస్త్రాలపై సంతకాలు.. ఈ ఆఫీసర్ స్టైలే వేరు!
Kadiri Sub Registrar : ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా రిజిస్ట్రేషన్ల గురించే చర్చ జరుగుతోంది. అందుకు కారణం ఛార్జీలు పెరగడమే. భారం పెరగకుండా చాలామంది జనవరి చివరలో రిజిస్ట్రేషన్లు పెట్టుకున్నారు. ఈ సమయంలో కదిరి రిజిస్ట్రార్ తీరు చర్చనీయాంశంగా మారింది. ఆయన టీ షాపులోనే దస్త్రాలపై సంతకాలు చేశారు.
క్రయ, విక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులు.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చేయాల్సి ఉంటుంది. కానీ ఓ అధికారి మాత్రం టీ కొట్టునే రిజిస్ట్రార్ ఆఫీసుగా మార్చుకున్నారు. రిజిస్ట్రేషన్ దస్త్రాలపై అక్కడే సంతకాలు పెట్టేశారు. ఆ అధికారి టీ దుకాణంలోనే ఫైల్స్‌పై సంతకాలు చేయడం.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

హోటల్లోకి తెప్పించుకొని..
సత్యసాయి జిల్లా కదిరి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసులు.. ప్రజలకు సంబంధించిన దస్తావేజులను పట్టణ శివారులోని ఒక టీ హోటల్లోకి తెప్పించుకున్నారు. అక్కడే సంతకాలు చేయడం విమర్శలకు దారి తీసింది. శుక్రవారం ఆయన సెలవులో ఉన్నారు. భూముల మార్కెట్ విలువ పెరిగిన దృష్ట్యా.. క్రయ విక్రయాల కోసం ప్రజలు సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వచ్చారు. సుమారు 130కి పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి.
వీడియో వైరల్..
ప్రజల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన సెలవులో ఉంటూనే.. దళారీల ద్వారా బయటకు దస్త్రాలను తెప్పించుకొని రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయన టీ షాపులో సంతకాలు చేసిన వీడియోలు వైరల్ కావడంతో.. మరుసటి రోజు ఆఫీసుకు వచ్చిన ఆయన మధ్యాహ్నమే వెళ్లిపోయారు. ఆయన వ్యవహార శైలి ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది.
భారీగా ఆదాయం..
రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువను ప్రభుత్వం సవరించింది. శనివారం నుంచి కొత్త విలువలు, ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. అయితే పాత ధరల ప్రకారమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న ఉద్దేశంతో.. క్రయ విక్రయదారులు నాలుగైదు రోజులుగా కార్యాలయాలకు తరలివచ్చారు. జనవరి 31వ తేదీన ఒక్కరోజే.. అనంతపురం జిల్లా నుంచి రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.5.19 కోట్లు ఆదాయం వచ్చింది.
ఫిబ్రవరి 1 నుంచి..
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపుపై చర్చ జరుగుతుంది. జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయనే ప్రచారం కూడా జరిగింది. అయితే దీనిపై రెవెన్యూ మంత్రి అనగాని స్పష్టత ఇస్తూ.. ఫిబ్రవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమలవుతాయని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా సగటున 0 నుంచి 20 శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుదల ఉండనుంది. కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు 0 శాతం మాత్రమే ఉంటాయి.
గ్రోత్ కారిడార్ల ఏరియాలో..
విజయవాడ, విశాఖపట్నం తోపాటు కోనసీమ, ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి. మరికొన్ని చోట్ల ఛార్జీలను తగ్గించారు. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇక్కడ పాత ఛార్జీలే ఉండనున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ గ్రోత్ కారిడార్లు ఉన్నాయో అక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి.