YS Sharmila : థ్యాంక్యూ సర్ -రాహుల్ గాంధీకి వైఎస్ షర్మిల ట్వీట్
YS Sharmila : వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి థ్యాంక్యూ చెప్పారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ నివాళులర్పించారు. దీనిపై షర్మిల కృతజ్ఞతలు తెలిపారు.
YS Sharmila : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాళులర్పించారు. "కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు నా నివాళులు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దార్శనికత కలిగిన నాయకుడు. వైఎస్ఆర్ చిరస్మరణీయ నేత" అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌పై వైఎస్సార్ కుమార్తె, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షరాలు వైఎస్ షర్మిల స్పందించారు. ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. "దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలను స్మరించుకుంటూ మీ ఆప్యాయతతో కూడిన మాటలకు ధన్యవాదాలు. మీ నాయకత్వంలో ఈ దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నమ్మి తెలుగు ప్రజల సేవలో మరణించిన నిబద్ధత కలిగిన కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ వైఎస్ఆర్. ఆయన సంక్షేమం నమూనా నేటికీ దేశవ్యాప్తంగా ప్రాధాన్యమైన పాలనా నమూనాగా ఉంది. డాక్టర్ వైఎస్ఆర్ మీ గుండెల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ధన్యవాదాలు సర్" అని షర్మిల రాహుల్ గాంధీకి థ్యాంక్యూ చెప్పారు.
ట్రెండింగ్ వార్తలు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంత గొప్ప నాయకుడో ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదని, ఆయన సేవలు చిరస్మరణీయమని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్ఆర్ 74వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద విజయమ్మ, షర్మిల, కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అక్కడి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి, కూతురు అంజలి, దివంగత జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత వైఎస్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.