YS Sharmila : వైఎస్ఆర్ పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చడం, కాంగ్రెస్ తెలిసి చేసిన తప్పు కాదు- వైఎస్ షర్మిల
YS Sharmila : వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చిన అంశాన్ని సోనియా గాంధీ వద్ద ప్రస్తావించానని వైఎస్ షర్మిల అన్నారు. వాళ్లు తెలియక చేసిన పొరపాటే అది అన్నారు. ఈ విషయంపై వాళ్లు రియలైజేషన్ కు వచ్చారన్నారు.
YS Sharmila : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే దిశగా చర్చలు సాగుతున్న సమయంలో... ఈ విషయాన్ని బలపర్చేలా షర్మిల మాట్లాడారు. శనివారం కడప జిల్లా వైఎస్ఆర్ ఘాట్ వద్ద తండ్రి వైఎస్ఆర్ కు నివాళులు అర్పించిన ఆమె...మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చింది సోనియా గాంధీ అని మా వాళ్లే నన్ను ప్రశ్నించారన్నారు. వైఎస్సార్ విగ్రహం సాక్షిగా ఒక విషయం చెప్పాలన్న ఆమె... తాను ఈ విషయం చెప్పకపోతే వైఎస్సార్ అభిమానులకు అసలు విషయం తెలియదన్నారు. వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్ చేర్చిన అంశం సోనియా దగ్గర ప్రస్తావనకు తెచ్చానన్నారు.
ఎఫ్ఐఆర్ లో వైఎస్ఆర్ పేరుపై షర్మిల స్పందన
"రాజీవ్ గాంధీ చనిపోయాక కూడా సీబీఐ ఛార్జ్ షీట్ లో ఆయన పేరు చేర్చారని సోనియా చెప్పారు. ఆ బాధ ఏంటో మాకు తెలుసు అని ఆమె అన్నారు. మాకు తెలిసి తెలిసి అలాంటి అవమానం మేము ఎలా చేస్తామని సోనియా అన్నారు. వైఎస్సార్ పై మాకు అపారమైన గౌరవం ఉందన్నారు. వైఎస్సార్ కుటుంబానికి ద్రోహం ఎలా చేస్తామని చెప్పారు. వైఎస్సార్ లేని లోటు మాకు ఈ రోజు కూడా తెలుస్తుందన్నారు. నాకు అర్థమైంది ఏమిటి అంటే..వాళ్లు తెలియక చేసిన పొరపాటే అది. వైఎస్ఆర్ పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చడం కాంగ్రెస్ తెలిసి చేసిన తప్పు కాదు. వైఎస్సార్ ను సోనియా, రాహుల్ అపారంగా గౌరవం ఇస్తున్నారు. నేను నిర్ధారణకు వచ్చిన తర్వాతే సోనియాతో ,రాహుల్ తో చర్చలు జరిపాను. వాళ్లు రియలైజేషన్ కి వచ్చారు. అర్థం చేసుకోవాల్సిన భాధ్యత నాది. పాలేరులో పోటీ అంశం త్వరలో వెల్లడిస్తాను" - వైఎస్ షర్మిల
ప్రతీ కార్యకర్త కోసం నిలబడతా
రాజకీయాలంటే వండినట్లు, తిన్నట్లు కాదని వైఎస్ షర్మిల అన్నారు. ఈ రెండు సంవత్సరాలు తనతో నడిచిన ప్రతీ కార్యకర్త కోసం నిలబడతానని, వాళ్లను నిలబెడతానన్నారు. వైఎస్ఆర్ మన వద్ద నుంచి వెళ్లిపోయి 14 ఏళ్లు గడిచిపోయిందని వైఎస్ షర్మిల అన్నారు. అయినప్పటికీ ఆయన తెలుగు ప్రజల గుండెల్లో బ్రతికే ఉన్నారన్నారు. అద్భుతైన పథకాలు ప్రతి ఇంటికి అందించడంలో కోట్ల మంది గుండెల్లో వైఎస్ఆర్ బతికే ఉన్నారన్నారు. వైఎస్ఆర్ రైతు పక్షపాతిగా నిలిచారని గుర్తుచేసుకున్నారు. ఉచిత విద్యుత్ ఆలోచన చేసి రైతుల కష్టాలను తీర్చారన్నారు. రుణమాఫీ చేసిన ఘనత కూడా వైఎస్ఆర్ కే దక్కుతుందని షర్మిల అన్నారు.