కరోనా దృష్ట్యా కడపలో టీడీపీ మహానాడు వాయిదా వేయండి, జాయింట్ కలెక్టర్ కు వైసీపీ విజ్ఞప్తి-kadapa ysr congress appeals to joint collector for mahanadu postponement ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  కరోనా దృష్ట్యా కడపలో టీడీపీ మహానాడు వాయిదా వేయండి, జాయింట్ కలెక్టర్ కు వైసీపీ విజ్ఞప్తి

కరోనా దృష్ట్యా కడపలో టీడీపీ మహానాడు వాయిదా వేయండి, జాయింట్ కలెక్టర్ కు వైసీపీ విజ్ఞప్తి

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో...మహానాడు సభను వాయిదా వేయాలని వైసీపీ నేతలు...కడప జాయింట్ కలెక్టర్ ను కోరారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున జరిగే సభలు, సమావేశాలు వాయిదా వేసుకోవాలని కోరారు.

కరోనా దృష్ట్యా కడపలో టీడీపీ మహానాడు వాయిదా వేయండి, జాయింట్ కలెక్టర్ కు వైసీపీ విజ్ఞప్తి

రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో... కడపలో జరగనున్న మహానాడు సభను వాయిదా వేసేందుకు చర్యలు తీసుకోవాలని వైసీపీ కోరుతున్నారు. ఈ మేరకు వైసీపీ నేతలు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ బాషా ఇవాళ కడప కలెక్టరేట్‌ లో జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ప్రజారోగ్యం దృష్ట్యా

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున జరిగే సభలు, సమావేశాలు ఈ పరిస్థితుల్లో ప్రజలకు ప్రమాదకరమవుతాయని వైసీపీ నేతలు అభిప్రాయపడ్డారు. ఈ మహానాడు సందర్భంగా కరోనా వ్యాపించే అవకాశం ఉన్నందున వాయిదా వేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కరోనా మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు.

మహానాడుకు భారీ ఏర్పాట్లు

అయితే ఈసారి చరిత్రలో నిలిచిపోయే మహానాడు నిర్వహిస్తామని టీడీపీ చెబుతోంది. ఈ మేరకు నాయకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 27, 28, 29న కడప సమీపంలోని కమలాపురం నియోజకవర్గం చింతకొమ్మదిన్నె మండలం పబ్బపురం సమీపంలో 150 ఎకరాల్లో మహానాడు సభ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ సభ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణంలో తూర్పున సీఎం తాత్కాలిక కార్యాలయం, సీఎం కార్యదర్శులు, ఇతర అధికారుల వసతి కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభ వేదిక, భోజనశాల, జనరేటర్లు, విద్యుత్ సరఫరా ఏర్పాటు పనులు ముమ్మరంగా చేస్తున్నారు. మహానాడు కోసం ఏర్పాటు చేసిన వివిధ కమిటీలు సభ ఏర్పాట్లు సమావేశాలు నిర్వహిస్తున్నాయి.

ఐజీ (ఆపరేషన్స్) సీహెచ్ శ్రీకాంత్, కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఇటీవల మహానాడు ఏర్పాట్లను పరిశీలించారు. వీరితో పాటు వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, నంద్యాల, అనంతపురం ఎస్పీలు, గుంతకల్ రైల్వే ఎస్పీ....వేదిక, పార్కింగ్ ప్రాంతాలు, ప్రధాన వేదిక, ఫుడ్ కోర్టుల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

మహానాడు ప్రారంభం నుంచి ముగింపు వరకు అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతో ఉండాలని కోరారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు.

3 మెగావాట్ల విద్యుత్

మహానాడు కార్యక్రమానికి దాదాపు 3 మెగావాట్ల విద్యుత్ అవసరమని విద్యుత్ అధికారులు అంచనా వేశారు. సీఎం చంద్రబాబు హాజరయ్యే కార్యక్రమం కావడంతో, జనరేటర్లకు ఏదైనా సమస్య ఎదురైతే విద్యుత్ సరఫరాకు కృష్ణాపురం, కడప నగరం-1 విద్యుత్ సబ్‌స్టేషన్ల ఫీడర్ల నుంచి లైన్లు ఏర్పాటు చేస్తున్నారు.

జనరేటర్ల నుంచి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే ఏపీఎస్పీడీసీఎల్ విద్యుత్‌ను ఉపయోగించే అవకాశం ఉంది.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం