Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం గండికోట రిజర్వాయర్ ను సందర్శించారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టు వద్ద నిలిచిన పనులను పరిశీలించారు. ఈ ప్రాజెక్టుల పరిశీలన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... పాత ప్రాజెక్టులను పూర్తి చేయలేని సీఎం జగన్, కొత్త ప్రాజెక్టుల పేరుతో రూ.12 వేల కోట్ల దోపిడీకి సిద్ధమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డికి మాత్రం రూ. 600 కోట్ల బిల్లులను ఇచ్చారని తెలిపారు. పాత ప్రాజెక్టులు రద్దుచేసి.. 23 ప్రాజెక్టులతో రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకం పేరుతో వైసీపీ ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందన్నారు. గత నాలుగేళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. నెలకోసారి దిల్లీ టూర్ కు వెళ్లే సీఎం జగన్... ఈ ప్రాజెక్టులకు కేఆర్ఎంబీ, ఎన్‌జీటీ, సీడబ్ల్యూసీ అనుమతులు తేలేకపోయారని విమర్శించారు.
కడప జిల్లాలకు నీళ్లు ఇచ్చిన ఘనత టీడీపీదని చంద్రబాబు స్పష్టం చేశారు. తన మనుషులకు కాంట్రాక్టులు ఇప్పించుకుని సీఎం జగన్ రూ. 5 వేల కోట్లు దోపిడీకి శ్రీకారం చుట్టారని చంద్రబాబు ఆరోపించారు. అవుకు టన్నెల్ ద్వారా నీళ్లు రాకపోతే గండికోటకు నీళ్లు రావన్నారు. ఇసుక మాఫియా వల్ల అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిందని ఆరోపించారు. అవుకు తోటపల్లికి ఐదేళ్ల వరకూ టెండర్లు పిలవొద్దని సీఎం జగన్ ఆదేశించారని ఆరోపించారు. పెద్దిరెడ్డి కోసం అవసరంలేని ప్రాజెక్టులు చేస్తున్నారని, ఈ ప్రాజెక్టుల్లో మంత్రులే కాంట్రాక్టర్లని మండిపడ్డారు. సీఎం జగన్ అసమర్ధత వల్ల ప్రాజెక్టులు, ఆస్తులు, ప్రాణాలు పోయాయని విమర్శించారు. కడప జిల్లా యువత కోసం స్టీల్ ప్లాంట్ కు ఫౌండేషన్ వేస్తే... సీఎం జగన్ ఆ స్థలం వదిలిపెట్టి మరో చోట శంకుస్థాపన చేశారన్నారు. కర్నూలు ఎయిర్ పోర్టును తాను ప్రారంభిస్తే... దాన్ని కొట్టివేసి జగన్ తన పేరు వేసుకున్నారని ధ్వజమెత్తారు. జగన్ తీరు ఎవరికో పుట్టిన బిడ్డకు నేనే తండ్రి అన్నట్లుగా ఉందని విమర్శించారు.
తాను ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంటే ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు సినిమాల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆగస్టు నెల వచ్చినా శ్రీశైలంలో మోటార్లు ఇంకా ఆన్ కాలేదన్నారు. సొంత కంపెనీలకు డబ్బులు దోచిపెట్టేందుకు మంత్రులనే కాంట్రాక్టర్లుగా మార్చి ప్రాజెక్టులు ఇస్తున్నారని ఆరోపించారు. పోలవరం పూర్తి చేసి ఆ నీటిని బనకచర్లకు వరకు తెచ్చి ఉంటే రాయలసీమకు నీటి సమస్య ఉండేది కాదన్నారు. పోలవరం పనులకు నాడు గిన్నిస్ రికార్డులు వస్తే సీఎం జగన్ హయాంలో విమర్శలు వస్తున్నాయన్నారు. పోలవరం నిర్వాసితులు వరద ముంపునకు గురైతే కనీసం వారికి తిండి కూడా పెట్టలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే పోలవరం ముంపు మండలాలను ప్రత్యేక జిల్లాగా ప్రకటిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గోదావరి, కృష్ణా, పెన్నా నదులు అనుసంధానం చేస్తే రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసుకోవచ్చని చంద్రబాబు తెలిపారు. రాయలసీమను కృష్ణదేవరాయలు తర్వాత తెలుగుదేశమే ఆదుకుందన్నారు. టీడీపీ అధికారంలో ఉంటే రాయలసీమకు నీటిఎద్దడి ఎదురయ్యేది కాదని తెలిపారు. బాంబులకే భయపడలేదు నీకు భయపడుతానా అని చంద్రబాబు అన్నారు.