Kadapa Crime : కడప జిల్లాలో విషాదం, పెళ్లైన ఏడు నెలలకే నవ వధువు ఆత్మహత్య
Kadapa Crime : కడప జిల్లా విషాదం చోటుచేసుకుంది. పెళ్లైన ఏడు నెలలకే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేధింపులు తాళలేక ఆమె ఈ దారుణానికి పాల్పడింది. భర్త అక్రమ సంబంధాన్ని ప్రశ్నించినందుకు... భార్యను మానసికంగా వేధించినట్లు తెలుస్తోంది.
కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వేరొక మహిళతో భర్త వివాహేతర సంబంధం పెట్టుకుని, ఆమెతో ఫోన్‌లో తరచూ మాట్లాడాన్ని సహించలేక భార్య నిలదీసింది. దీంతో అప్పటి నుంచి కక్ష పెట్టుకున్న భర్త, భార్యను వేధించడం ప్రారంభించాడు. భర్త వేధింపులు తాళలేక పెళ్లైన ఏడు నెలలకే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవులు జరగడంతో జీవితంపై విసిగిపోయిన ఆ నవ వధువు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
ఈ ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో మంగళవారం జరిగింది. కడపలోని ఎర్రముక్కపల్లెకు చెందిన బొమ్మిశెట్టి విజయకుమార్‌తో ప్రొద్దుటూరు సూపర్ బజార్ రోడ్డుకు చెందిన పల్లా కీర్తి (27)కి ఏడు నెలల కిందట వివాహం జరిగింది. విజయకుమార్ హైదరాబాద్‌లోని ఒక కాంట్రాక్టర్ వద్ద గుమాస్తాగా పనిచేస్తున్నాడు. పెళ్లి అయిన తరువాత నూతన దంపతులు హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. భర్త మరో మహిళతో ఫోన్‌లో మాట్లాడుతుండటంతో భార్యకు అనుమానం వచ్చింది. విజయ్ కుమార్‌కు ఆమెతో పెళ్లికాకముందే మరో మహిళతో వివాహేతర సంబంధం ఉండేంది.
దీంతో నవదంపతుల మధ్య తరచూ గొడవులు జరుగుతున్నాయి. వివాహేత సంబంధంపై భర్తను భార్య నిలదీసింది. దీంతో అప్పటి నుంచి భార్య కీర్తిని వేధించేవాడు. భార్య తల్లిదండ్రులను అనరాని మాటలు అనేవాడు. పెట్టుపొతలు, కట్నకానుకులు గురించి వేధించేవాడు. దీంతో చేసేదేమీ లేక కీర్తి మనసులోనే దిగమింగుకునేది. అయితే ఇటీవలి వేధింపులు ఎక్కువ అయ్యాయి. నాలుగు రోజుల కిందట ప్రొద్దుటూరులోని పుట్టింటికి వచ్చిన కీర్తి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి బాధపడింది.
కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా బాధపడ్డారు. ఈ నేపథ్యంలో ఇంట్లోని ఇనుప పైపునకు చీరకట్టి ఉరి వేసుకుని కీర్తి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గదికి వెళ్లి చూడగా అప్పటికే ఆమె మృతి చెందింది. తల్లి వెంకట నరసమ్మ ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు త్రీటౌన్ ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపారు.
కుటుంబ గొడవలతో మహిళ ఆత్మహత్య
కుటుంబ గొడవలతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం దండువారిపల్లికి చెందిన ఉజ్జినప్పకు అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామానికి చెందిన శ్రీలక్ష్మి (33)తో 14 ఏళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. ఎస్కేయూలో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తూ కుటుంబాన్ని ఉజ్జినప్ప పోషిస్తున్నాడు. అయితే కొంతకాలంగా దంపతుల మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. మంగళవారం ఉదయం కూడా భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. అనంతరం భర్త డ్యూటీకి వెళ్లిపోయాడు. దీంతో కాసేపటికే కుమార్తెను స్కూల్‌కు పంపిసే, శ్రీలక్ష్మి తలుపులు వేసుకుని ఇంట్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
సాయంత్రం ఇంటికి వచ్చిన భర్త ఎంత పిలిచినప్పటికీ తలుపు తీయలేదు. దీంతో భర్త ఉజ్జినప్పకు అనుమానం వచ్చి కిటికీ తీసి లోపలికి చూశాడు. అప్పటికే ఉరికి వేలాడుతున్న భార్యను గమనించిన భర్త, చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు బద్ధలు కొట్టి లోపలకు ప్రవేశించారు. ఉరి వేసుకున్న భార్య శ్రీలక్ష్మిని దింపి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై శ్రీలక్ష్మి తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇటుకలపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
జగదీశ్వరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం