YS Viveka Murder Case : కేసు సమాచారం సీబీఐ వాళ్లే వైఎస్ సునీతకు ఇస్తున్నారు... అవినాశ్ రెడ్డి-kadapa mp avinash reddy expresses doubts on cbi investigation in viveka murder case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Kadapa Mp Avinash Reddy Expresses Doubts On Cbi Investigation In Viveka Murder Case

YS Viveka Murder Case : కేసు సమాచారం సీబీఐ వాళ్లే వైఎస్ సునీతకు ఇస్తున్నారు... అవినాశ్ రెడ్డి

HT Telugu Desk HT Telugu
Mar 10, 2023 07:40 PM IST

YS Viveka Murder Case : వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని సోమవారం వరకు అరెస్టు చేయవద్దని తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ఇప్పటి వరకు జరిగిన విచారణ ఫైళ్లను కోర్టుకి ఇవ్వాలంది. మరోవైపు.. ఈ కేసులో సీబీఐ అధికారులు కోర్టులని సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని అవినాశ్ రెడ్డి ఆరోపించారు.

సీబీఐపై అవినాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సీబీఐపై అవినాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

YS Viveka Murder Case : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి... సీబీఐ అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. అవినాశ్ రెడ్డికి కాస్త ఊరట కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది. సోమవారం వరకు అరెస్టు చేయవద్దని సీబీఐని ఆదేశించింది. అలాగే కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర దర్యాప్తు బృందానికి ఆర్డర్ జారీ చేసింది. విచారణలో భాగంగా ఇప్పటి వరకు ఫైల్ చేసిన ఆడియో, వీడియో రికార్డులని న్యాయస్థానానికి ఇవ్వాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసిన కోర్టు... మంగళవారం రోజు సీబీఐ విచారణకు మాత్రం అవినాశ్ రెడ్డి హాజరుకావాలని ఆదేశించింది.

ట్రెండింగ్ వార్తలు

జనవరి 28, ఫిబ్రవరి 4న అవినాశ్ రెడ్డిని విచారించిన సీబీఐ... మార్చి 10న మరోసారి విచారణకు రావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తనపై తీవ్ర చర్యలు తీసుకోకుండా సీబీఐకి ఆదేశాలివ్వాలని అభ్యర్థిస్తూ... అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం... తీవ్ర చర్యలంటే ఏంటని... అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారా ? అని ప్రశ్నించింది. కోర్టుకి బదులిచ్చిన అవినాశ్ రెడ్డి తరపు న్యాయవాది.. విచారణ సందర్భంగా చెప్పినది చెప్పినట్టు సీబీఐ అధికారులు వాంగ్మూలం నమోదు చేస్తున్నారనే నమ్మకం తమకు లేదని తెలిపారు. ఇప్పటికే రెండుసార్లు జరిపిన విచారణపై తమకు అనుమానాలు ఉన్నాయని... ఆ స్టేట్ మెంట్లను పరిగణలోకి తీసుకోవద్దని కోరారు.

రెండుసార్లు విచారణ ముగిసిన అనంతరం అవినాశ్ రెడ్డి నుంచి సంతకాలు తీసుకోలేదని ఆయన తరపు న్యాయవాది కోర్టుకి తెలిపారు. వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు ఎడిట్ చేస్తారేమో అన్న అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇకపై జరిగే ప్రతి విచారణను వీడియో రికార్డింగ్ చేసేలా సీబీఐని ఆదేశించాలని అభ్యర్థించారు. విచారణకు పూర్తిగా సహకరిస్తామని.. అరెస్టు వంటి చర్యలు తీసుకోకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం... వీడియో రికార్డింగ్ ఏ దశలో ఉందో తెలిపాలని సీబీఐని ఆదేశించింది. కేసుకి సంబంధించిన పూర్తి ఫైళ్లను ను సోమవారం సమర్పించాలని... అప్పటి వరకు అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయవద్దని ఆదేశించింది.

మరో వైపు అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ లో వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత రెడ్డి ఇంప్లీడ్ అయ్యారు. తనపై వ్యక్తిగతంగా కూడా ఆరోపణలు చేసినందున తమ వాదనలు వినాలని కోర్టును ఆభ్యర్థించారు.

సీబీఐ విచారణ ఏకపక్షంగా జరుగుతోంది : అవినాశ్

కాగా... వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి.. మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో అధికారులు ఆయనను మరోసారి ప్రశ్నించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన అవినాశ్ రెడ్డి... వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ తప్పుదోవపడుతుందని అన్నారు. తాను ఏ తప్పు చేయలేదని... తప్పుడు సాక్ష్యాలతో ఇబ్బందులకి గురి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. విచారణ సందర్భంగా కేవలం ల్యాప్ టాప్ తెస్తున్నారని .. అందులో ఆడియో, వీడియో రికార్డింగ్ చేస్తున్నారో లేదో తనకు తెలియదన్నారు. అందుకే విచారణను పూర్తిగా వీడియో రికార్డింగ్ చేయాలని కోరుతూ కోర్టుని ఆశ్రయించానని చెప్పారు. సీబీఐ విచారణ ఏకపక్షంగా జరుగుతోందనే అనుమానం వ్యక్తం చేసిన ఆయన... విచారణకు సంబంధించిన సమాచారాన్ని సీబీఐ వాళ్లే వైఎస్ సునీతారెడ్డికి అందిస్తున్నారని వ్యాఖ్యానించారు. సీబీఐ అధికారులు కోర్టుని సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.

వివేకా హత్య కేసులో రెండో పెళ్లి అనేది కూడా కీలకమైన అంశమని... ఆ దిశగా కూడా సీబీఐ విచారణ జరిపించాలని అవినాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఓ ముస్లిం మహిళను వైఎస్ వివేకా 2010లో రెండో పెళ్లి చేసుకున్నారని.. వారికి ఓ కుమారుడు జన్మించాడని పేర్కొన్నారు. ఈ రెండో పెళ్లి కారణంగానే... వివేకానంద రెడ్డి కుటుంబంలో విభేదాలు వచ్చాయని చెప్పారు. ఆర్థిక లావాదేవీల విషయంలోను మనస్ఫర్ధలు తలెత్తాయని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే తనపేరుమీద ఉన్న ఆస్తులను రెండో భార్య పేరు మీద రాయాలని వివేకా భావించారని తెలిపారు. ఈ ఆస్తులపై జరిగిన గొడవల వల్లే వివేకానంద రెడ్డి హత్య జరిగిందని అవినాశ్ రెడ్డి ఆరోపించారు. అందుకే... ఈ కేసులో రెండో పెళ్లి కూడా కీలక అంశమని, సీబీఐ ఆ దిశగా విచారణ చేయాలని కోరారు.

IPL_Entry_Point