ఏపీలో కడప మేయర్‌తో పాటు మాచర్ల మునిసిపల్ ఛైర్మన్ పై అవినీతి ఆరోపణలతో వేటు పడింది. కడప మేయర్‌పై వివరణ కోరిన 24 గంటల్లోనే పదవి నుంచి తప్పిస్తూ మునిసిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. కడప కార్పొరేషన్‌లో జరిగిన అవినీతి వ్యవహారాలపై మేయర్ వివరణ కోరుతూ పురపాలక శాఖ కార్యదర్శి వివరణ కోరారు. మేయర్ విచారణకు హజరైన 24 గంటల్లోనే పదవి నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కడప మేయర్ సురేష్‌బాబును మేయర్ పదవి నుంచి తప్పిస్తూ ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. సురేశ్ బాబు తన కుటుంబ సభ్యులకు చెందిన సంస్థలతో కార్పొరేషన్ నిధులను కట్టబెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి.
అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేసింది. దీంతో పాటు కడప కార్పొరేషన్‌లో పట్టు కోసం టీడీపీ-వైసీపీల మధ్య పోటీ నడుస్తోంది. అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో పదవీ నుంచి తప్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కడప మేయర్ సురేశ్ బాబుపై ఎమ్మెల్యే మాధవి రెడ్డి చేసిన ఆరోపణలతో రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణ జరిపించింది. మేయర్ కుటుంబ సభ్యు లకు చెందిన వర్ధిని కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు కార్పొరేషన్ పరిధిలో 10 పనులు కేటాయించారు. వీటిలో 7 పనులు పూర్తి చేశారు. మేయర్ అధికారాన్ని అడ్డు పెట్టుకుని పనులు కేటాయించారని విజిలెన్స్ నివేదిక పేర్కొంది.
దీంతో మేయర్‌కు నోటీసులు జారీ చేయడంతో విచారణకు హాజరైన సురేశ్‌బాబు పనులు తాను కేటాయించలేదని, ఆ సంస్థ తన భార్య,కుమారుడి పేరుతో ఉందని వివరణ ఇచ్చుకున్నారు. ఈ వ్యవహారంపై మేయర్ హైకోర్టును ఆశ్రయించడంతో ఆయన వాదనలు వినాలని కోర్టు ఆదేశించింది.
మంగళవారం విచారణకు హాజరైన మేయర్ తన వాదనలకు ఆధారాలను చూపలేకపోయారు. దీంతో పదవి నుంచి తప్పిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రెండు వారాల తర్వాత ఈ ఉత్వర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో న్యాయపోరాటం చేస్తానని మేయర్ సురేశ్ ప్రకటించారు.
వైపీపీ అధికారంలో ఉన్న సమయంలో పల్నాడు జిల్లాలో పర్యటనకు వచ్చిన టీడీపీ నేతలపై హత్యాయత్నంతో కలకలం సృష్టించిన మాచర్ల మునిసిపల్ ఛైర్మన్ తురకా కిషోర్‌పై కూడా వేటు పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తురకా కిషోర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
మునిసిపల్ సర్వ సభ్య సమావేశాలకు వరుసగా 15సార్లు గైర్హాజరు కావడంతో మున్సిపల్ చట్టం ప్రకారం వేటు వేసినట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడైన కిశోర్ 2023 ఆగస్టు నుంచి సరైన అనుమతులు లేకుండా సర్వసభ్య సమావేశాలకు హాజరు కావడంలేదు. పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కిషోర్‌పై చర్యలు తీసుకోవాలని పోలీ సులు మున్సిపాల్టీకి సూచించారు. ఈ నేపథ్యంలో చైర్మన్ పదవి నుంచి ఎందుకు తొలగించకూడదో లిఖితపూర్వకంగా తెలియజేయాలని మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. నోటీసులకు స్పందించక పోవడంతో ఆయనపై వేటు పడింది.