Vontimitta Accident : కడప జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు త గాయపడ్డారు. ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి వైపు నుంచి అతి వేగంగా వచ్చిన స్కార్పియో వాహనం, ఆర్టీసీ బస్సు, పోలీసు రక్షక్ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్కార్పియోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులది నంద్యాల జిల్లా కేంద్రం హౌసింగ్ బోర్డు కాలనీగా పోలీసులు గుర్తించారు.
పోలీసు వాహనంలో ఉన్న కానిస్టేబుల్ రఘునాథరెడ్డితోపాటు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కడప రిమ్స్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో స్కార్పియో వాహనం నుజ్జునుజ్జయింది. మితివీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. రాజంపేట, ఒంటిమిట్టకు చెందిన పోలీసులు ప్రమాదస్థలిని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
తెలుగు రాష్ట్రాల్లో రోడ్లు రక్తమోడాయి. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద స్కార్పియో వాహనం ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. నెల్లూరు జిల్లా రాపూరులోని తిక్కనవాటిక పార్కు వద్ద కారు ఢీకొట్టడంతో వడ్డు ఎండబెట్టుకుంటున్న ఇద్దరు రైతులు మృతి చెందారు. తెలంగాణలోని జనగామ జిల్లా రాఘవపూర్ వద్ద లారీని కారు ఢీకొనడంతో కారు డ్రైవర్ సహా ఇద్దరు మహిళలు చనిపోయారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో తీవ్ర విషాదం జరిగింది. కారు డోర్లు లాక్ పడటంతో అందులో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ఊపిరాడక చనిపోయారు. బంధువుల వివాహానికి వచ్చిన అక్కచెల్లెళ్ల పిల్లలు తన్మయశ్రీ (5), అభినయశ్రీ (4).. ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారులోకి వెళ్లారు. కారు డోర్లు లాక్ అయ్యాయి. దీన్ని ఎవరూ గమనించలేదు. దీంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.
పిల్లలు ఎంతసేపటికీ కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు.. వారి కోసం వెతికారు. చివరకు కారులో అపస్మారక స్థితిలో ఉన్న పిల్లలను గుర్తించారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ లాభం లేకపోయింది. అప్పటికే చిన్నారులు మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు డోర్లు ఎలా లాక్ అయ్యాయి.. ఇతర కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
సంబంధిత కథనం