Jyothula Nehru: వాలంటీర్లు వద్దు, పారిశుధ్య కార్మికుల్ని గ్రామాలకు ఇవ్వాలన్న జ్యోతుల నెహ్రూ
Jyothula Nehru: .టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వలంటీర్లు మాకు అవసరం లేదు...కాపలా కుక్కల్లా టీడీపీ, ఎన్‌డీఏ కార్యకర్తలున్నారని చెప్పారు.

Jyothula Nehru: "వలంటీర్లు మాకు అవసరం లేదు. కాపలా కుక్కల్లా టీడీపీ, ఎన్‌డీఏ కార్యకర్తలు ఉన్నారు. వలంటీర్ల స్థానంలో పారిశుధ్య కార్మికులను నియమించాలని జ్యోతుల అభిప్రాయపడ్డారు. వలంటీర్లు కూడా పారిశుధ్య కార్మికులుగా ఉంటామంటే, వారిని కూడా తీసుకుంటామని" అని టీడీపీ సీనియర్ నేత, కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 ఆగస్టు 15న వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు, పట్టణాల్లో ప్రతి 75-100 ఇళ్లకు ఒక వలంటీర్ చొప్పున రాష్ట్రంలో 2.65 లక్షల మంది వలంటీర్లలతో గ్రామ, వార్డు వలంటీర్ వ్యవస్థను అమలు చేసింది. ఒక్కొ వలంటీర్ తమ సేవలను అందించినందుకు గానూ నెలకు రూ.5 వేలు వేతనం ఇచ్చేంది. వలంటీర్లు తమ పరిధిలోని ఇళ్లకు అన్ని సంక్షేమ పథకాలు అందజేసేవారు. తెల్లవారి నుంచే ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇచ్చేవారు.
అయితే వలంటీర్లపై అప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారు. వలంటీర్లు మానవ అక్రమ రవాణా పాల్పడుతున్నారని, ఇంట్లో మగవారు లేనప్పుడు ఇంటికెళ్లి తలుపులు కొడుతున్నారని, అలాగే మహిళలను, ఒంటిరి మహిళలను ట్రాప్ చేస్తున్నారని, గోనె సంచులు మోచేసే ఉద్యోగమంటూ విమర్శలు చేశారు. దీంతో టీడీపీ, జనసేన నేతల కూడా రెచ్చిపోయి వలంటీర్ వ్యవస్థపై ఆరోపణలు, విమర్శలు చేశారు.
ఎన్నికల సమయంలో మాత్రం చంద్రబాబు వలంటీర్లపై తన స్వరం మార్చారు. రాష్ట్రంలో 2.65 లక్షల వలంటీర్లంటే, ఆ వలంటీర్ల కుటుంబాల ఓట్లు దాదాపు పది లక్షలు ఉంటాయి. కనుకనే ఆ ఓట్లు తమకు పడేటట్లు, వలంటీర్ల జీతం నెలకు రూ.5 వేలనుంచి రూ.10 వేలకు పెంచుతామని ఉగాది రోజున ప్రకటించారు. అయితే అప్పటికే వలంటీర్లు ఎన్నికల విధుల్లో ఉండ కూడదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది.
బలవంతపు రాజీనామాలు…
ఎన్నికల విధుల్లో వాలంటీర్లు ఉండకూడదన్న నిర్ణయంతో వైసీపీ నేతలు వలంటీర్లను రాజీనామాలు చేయించారు. బలవంతంగా ఒత్తిడి తెచ్చి మరి రాజీనామాలు చేయించారు. అలా రాష్ట్రంలో దాదాపు 1.08 లక్షల మంది వలంటీర్లు రాజీనామాలు చేశారు. అయితే ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ, అధిక సంఖ్యలో వలంటీర్లు రాజీనామాలు చేయలేదు. ఆ రాజీనామాలు చేసిన వలంటీర్లు ఎన్నికల్లో వైసీపీ తరపున పని చేశారు.
అయితే అప్పట్లో వలంటీర్ల రాజీనామాలు ఆమోదించొద్దని హైకోర్టులో కేసు వేశారు. ఇలా ఎన్నికల సమయంలో వలంటీర్లపైనే పెద్ద చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్షాలు పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. కొంత మంది టీడీపీ నేతలు తమ ప్రభుత్వం వస్తే, వలంటీర్లను తీసేస్తామని చేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియోలు బయటపడ్డాయి.
ఏది ఏమైనా ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించింది. అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వలంటీర్ల కొనసాగింపుపై చర్చ జరుగుతుంది. నెలకు రూ.10 వేతనంతో వలంటీర్ల సేవలను కొనసాగిస్తారా? లేదా? అనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే మొదటి ఐదు సంతాలకాల్లోనైనా, మొదటి మంత్రి వర్గ సమావేశంలోనైనా వలంటీర్ల వ్యవస్థపై ప్రస్తావన లేదు.
ఈ లోగా వలంటీర్ల వ్యవస్థ రద్దు చేయాలని హైకోర్టులో కేసు దాఖలు చేశారు. వలంటీర్ల నియామకంలో రిజర్వేషన్లు అమలు చేయలేదని, అలాగే వలంటీర్లంతా వైసీపీకి చెందిన వారని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు రావల్సి ఉంది.
వలంటీర్లంతా వైసీపీ వారే అయితే, వైసీపీ నేతలు ఒత్తిడి తెచ్చినప్పటికీ రాజీనామా చేయకుండా, వైసీపీని ధిక్కరించి ఉన్న వలంటీర్లే అధికంగా ఉన్నారు. ఈ అంశాన్ని గమనంలోకి పెట్టుకొని వ్యాఖ్యలు చేయాల్సి ఉంటుంది. అయితే అధికారంలోకి రాగానే రాష్ట్ర మంత్రి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి బాధ్యతలు తీసుకున్న సమయంలో రాజీనామా చేసిన వలంటీర్లను తీసుకోమని, రాజీనామా చేయని వలంటీర్లను తీసుకుంటామని ప్రకటన చేశారు.
పారిశుధ్య కార్మికులు కావాలి…
"వలంటీర్లకు ఇచ్చే నెలకు రూ.10 వేలును, గ్రామ పంచాయితీ వైశాల్యాన్ని బట్టీ గ్రామానికి ఐదుగురు నుంచి 15 మంది వరకు పారశుద్ధ కార్మికులను వేసినట్లు అయితే, దుర్ఘంధం నుంచి బయటపడతాం. పరిశుభ్రమైన గ్రామాలుగా తయారు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని జ్యోతుల నెహ్రూ అభిప్రాయపడ్డారు.
దానికి ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. సచివాలయ సిబ్బంది ఉన్నారని, గ్రామాల్లో వారితో సర్వీస్ చేయించుకోవచ్చన్నారు. వారికి కాపాలకుక్కల్లా పని చేయడానికి తెలుగుదేశం, ఎన్‌డీఏ కార్యకర్తలు ఉన్నారు. తప్పు జరగకుండా కాసుకోవడానికి వారున్నారని ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అన్నారు. ఇదే విషయాన్ని మా లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్‌లోగాని, అసెంబ్లీలోనైనా ఇది నేను చెప్పదలుచుకున్నాను. అడగదలుచుకున్నాను. ఒత్తిడి తేదలుచుకున్నాను" అని అన్నారు.
ప్రజా ధనం దుర్వినియోగం
"ప్రజల నుంచి వసూలు చేసే రెవెన్యూ వసూళ్లు ద్వారా వచ్చిన ప్రభుత్వ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయకుండా, మన స్వార్థం కోసం చేసుకుండా ఉండాలి. మాకు వైసీపీ కర్మ పట్టలేదు. వాలంటీర్లను కార్యకర్తలుగా వాడుకోవాల్సిన పని లేదు. నిస్వార్థంగా 45 ఏళ్ల పాటు పని చేస్తున్న కార్యకర్తలు, నాయకులు టీడీపీకి ఉన్నారు. వాళ్లకు మేము డబ్బులు ఇవ్వక్కర్లేదన్నారు.
మా పార్టీ పని వరకు వాళ్లు నిస్వార్థంగా పని చేస్తారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం ఏలాగూ ఖర్చు పెడగామనుకుంటున్నారు కనుక, ఆ రూ.10 వేలు పారిశుధ్య కార్మికులకు ఇచ్చి, వాళ్లకు పని చెప్పినట్లు అవుతుంది. వలంటీర్లలో ఎవరైనా పారిశుద్ధ్య కార్మికులుగా ఉంటామంటే వారికే ఇస్తాం. అలా చేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి నా సూచన" అన్నారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)