తనను వేధించిన వారిని 'దేవుడు క్షమించడు, మరచిపోడు' అని మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకట రమణ మంగళవారం ఇండోర్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అభ్యర్థనలను సుప్రీం కోర్టు కొలిజియం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి చెందిన దుప్పల వెంకట రమణ ఇండోర్‌లో పదవీ విరమణ వీడ్కోలు సభలో కొలిజియంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
పదవీ విరమణ వీడ్కోలు సభలో మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. 2023లో ఏపీ హైకోర్టు నుంచి దుప్పల వెంకట రమణను మధ్యప్రదేశ్‌కు బదిలీ చేశారు. పదవీ విరమణ సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై కొలిజియం తీరుపై పరోక్షంగా తప్పు పట్టారు.
ఎలాంటి కారణం లేకుండా తనను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేశారని, బదిలీపై ఆప్షన్లు అడిగారని తన భార్యకు మెరుగైన చికిత్స పొందడానికి కర్ణాటక రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరినా పట్టించుకోలేదని జస్టిస్ రమణ వివరించారు.
తన భార్య పారాక్సిస్మల్ నాన్-ఎపిలెప్టిక్ మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారని, కోవిడ్ -19 తర్వాత తీవ్రమైన మెదడు సమస్యలను ఎదుర్కొన్నారని వీడ్కోలు సభలో వివరించారు. తన విన్నపాన్ని, అభ్యర్థనలను సుప్రీంకోర్టు కొలిజియం పట్టించుకోలేదని.. ఆ తర్వాత కూడా బదిలీ కోసం సుప్రీం కోర్టుకు పలుమార్లు విన్నవించినా ఎలాంటి ఫలితం దక్కలేదన్నారు.
తనను వేధించేందుకే 2023లో ఆంధ్ర ప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేశారని జస్టిస్ వెంకట రమణ వాపోయారు. మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్‌లో పనిచేస్తున్న జస్టిస్ వెంకటరమణ జూన్ 2న పదవీ విరమణ చేయనున్నారు. కోర్టుకు వేసవి సెలవులు కావడంతో చివరి పనిదిన మైన మంగళవారం వీడ్కోలు సభను ఏర్పాటు చేశారు.
ఏపీ నుంచి తనను ఎలాంటి కారణం లేకుండానే బదిలీ చేశారని, తాను కోరిన చోటుకు బదిలీ చేయడానికి కూడా కొలిజియం అంగీకరించలేదని చెప్పారు. తన విజ్ఞాపన పత్రాలను సుప్రీంకోర్టు కొలిజియం పరిగణనలోకి తీసుకోలేదని విచారం వ్యక్తం చేశారు.
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయ మూర్తిగా 2023 నవంబరు 1న బాధ్యతలు స్వీకరించానని, కోవిడ్ తర్వాత తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య వైద్యం కోసం మంచి వైద్యసేవలు అందుబాటులో ఉన్న చోటుకు బదిలీచేయాలని 2024 జులై 19, ఆగస్టు 28వ తేదీల్లో కొలీజియంకు వినతిపత్రాలు పంపినట్టు చెప్పారు. వాటిని పరిగణనలోకి తీసుకోవడంకానీ, తిరస్కరించడంకానీ చేయలేదన్నారు.
తనను వేధించే ఉద్దేశంతోనే బదిలీ చేసినా అది జరగలేదని మధ్యప్రదేశ్ వచ్చాక ఇక్కడి జబల్పుర్, ఇండోర్ బెంచ్‌లలో సహచర న్యాయమూర్తులు, న్యాయవాదుల నుంచి ప్రేమ, సహకారం లభించాయని చెప్పారు. తనను హైకోర్టు న్యాయమూర్తి పదవికి ఎంపిక చేసినందుకు జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్, జస్టిస్ ఆజయ్మాణికావ్ ఖాన్విల్కర్ కొలీజియంకు కృతజ్ఞతలు చెప్పారు.
తనను వేధించాలనే దురుద్దేశంతోనే ఏపీ నుంచి బదిలీ జరిగిందని జస్టిస్ రమణ అభిప్రాయపడ్డారు. స్పష్టమైన కారణాలతో సొంత రాష్ట్రం నుంచి బదిలీ కావడంతో నేను బాధపడ్డాను' అని కనిపించని శక్తులను పరోక్షంగా ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించారు. వారి అహంకారాన్ని సంతృప్తి పరచడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పుడు వారంతా రిటైర్ అయ్యారని.. దేవుడు క్షమించడు, మరచిపోడు. వారు కూడా మరో రకంగా ఇబ్బంది పడతారన్నారు
1994లో జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తాను చాలా దూరం వచ్చానని జస్టిస్ రమణ పేర్కొన్నారు. తన జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని, కష్టపడి పనిచేయడం తప్ప విజయానికి షార్ట్ కట్ లు లేవని గ్రహించానని చెప్పారు. నా కెరీర్ లో పోరాటం మరియు చేదు అనుభవాలతో కూడిన ప్రయాణం తన కార్యకలాపాలను వైవిధ్యపరచడానికి నాకు సహాయపడిందన్నారు. న్యాయసేవలో చేరిన నాటి నుంచి న్యాయవ్యవస్థలో ఈ స్థానానికి చేరుకునే వరకు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్టు చెప్పారు.
శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం చిన్న బొడ్డేపల్లిలో జన్మించిన జస్టిస్ వెంకటరమణ 2022 ఆగస్టు 4 నుంచి 2023 అక్టో బురు చివరి వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో 2014-19 మధ్య కాలంలో ఏపీ లా సెక్రటరీగా పనిచేశారు. అంతకు ముందు విజయవాడ కోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు.
సంబంధిత కథనం