Anil Chandra Punetha: ఐదున్నరేళ్ల తర్వాత అనిల్ చంద్ర పునేటాకు పదవి… విజిలెన్స్ కమిషనర్‌గా నియామకం
Anil Chandra Punetha: ఐదున్నరేళ్ల క్రితం అనూహ్య పరిస్థితుల్లో చీఫ్ సెక్రటరీ పదవి కోల్పోయిన 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేటాకు కీలక బాధ్యతలు దక్కాయి. 2019 ఎన్నికల సమయంలో ఈసీ ఆదేశాలతో చీఫ్ సెక్రటరీ పదవి కోల్పోయిన పునేఠాను ఏపీ విజిలెన్స్ కమిషనర్‌గా నియమించింది.
Anil Chandra Punetha: అనిల్ చంద్ర పునేటా 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన పునేటా 2019 ఎన్నికల సమయంలో ఏపీ చీఫ్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎన్నికల కోడ్ వెలువడిన తర్వాత సీఎస్ పేరుతో వెలువడిన ఉత్తర్వులు ఆయన పదవికి ఎసరు తెచ్చాయి. ఏపీ హైకోర్టులో వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ల నేపథ్యంలో అనూహ్యంగా ఆయనను ఎన్నికల సంఘం పదవి నుంచి తప్పించింది.
2019 మార్చిలో ఎన్నికల సంఘం పరిధిలోకి ఎవరెవరు వస్తారు అనే విషయం మీద వివాదం తలెత్తింది. వైసీపీ ఫిర్యాదు మీద ఈసీ ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడంపై అప్పటి ప్రభుత్వం హై కోర్టును ఆశ్రయించింది. ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య తలెత్తిన వివాదంలో అప్పటి ప్రతిపక్ష వైసీపీ కూడా ఇంప్లీడ్ అయ్యింది.
ఎన్నికల సంఘం పరిధిలోకి వచ్చే అధికారుల జాబితా నుంచి నిఘా విభాగం అధిపతి ఏబీ వెంకటేశ్వర రావును మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేట పేరిట ఉత్తర్వులు జారీ చేయడం చివరకు ఆయనకు చుట్టుకుంది.
2019లో ఎన్నికల హడావుడి మొదలయ్యాక అధికార, ప్రతిపక్షాలు నిత్యం కాలికి బలపం కట్టుకుని కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర సీఈఓ కార్యాలయానికి వరుస పెట్టి ఫిర్యాదు చేసేవారు. రాష్ట్రంలో శ్రీకాకుళం, కడప, ప్రకాశం జిల్లాల్లో ఎస్పీలతో పాటు, ఇంటెలిజెన్స్ డీజీ మీద వైసీపీ నేతలు పలు మార్లు ఫిర్యాదులు చేయడంతో వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఏబీకి మినహాయింపు ఇవ్వడంతో…
దీంతో ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ జీవో 716 విడుదల అయ్యింది. ఆ తర్వాత నిఘా విభాగ అధిపతి ఏబీ వెంకటేశ్వర రావుని మినహాయిస్తూ జీవో 720 విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక ఎన్నికల సంఘ పరిధిలోకి వచ్చే అధికారుల జాబితా నుంచి నిఘా అధిపతిని మినహాయిస్తూ సీఎస్ పేరిట జీవో 721 విడుదల జారీ అయ్యింది. ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం తరపున వాదించిన న్యాయవాది ప్రకాష్ రెడ్డి., 2018లో జరిగిన నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల సంఘం పరిధిలో ఉన్న డీజీ ఇంటెలిజెన్స్., సార్వత్రిక ఎన్నికల సమయానికి ఎలా రాకుండా పోతారని ప్రశ్నించడంతో అప్పటి అడ్వకేట్ జనరల్ న్యాయ స్థానానికి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.
సుదీర్ఘ వాదనల తర్వాత జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ సత్యనారాయణ ధర్మాసనం కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. దీంతో ఏబీ వెంకటేశ్వర రావుని బదిలీ చేస్తూ జీవో 750 విడుదల అయ్యింది. అప్పటికే కడప, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలపై ఈసి బదిలీ వేటు వేసింది.
అనిల్ చంద్ర పునేటకు తెలియకుండానే....
సార్వత్రిక ఎన్నికల వేళ అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేట అవమానకర పరిస్థితుల్లో పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఆయనపై వేటు పడింది. కోర్టులో విచారణ సందర్భంగా జీవో నంబర్ 721 జారీ చేయడం తెలిసిన వెంటనే సీఎస్ పునేటా జరగబోయే పరిణామాలు ఊహించారు.
జీవో 721 తన ప్రమేయం లేకుండానే జారీ అయ్యిందని అప్పట్లో వివరించారు. జీవో 721 జారీలో తన ప్రమేయం లేకుండానే వచ్చిందని చెప్పినా ఎవరు నమ్మరని వాపోయారు. ఆ తర్వాత అనిల్ చంద్ర పునేట ఏపీ నుంచి నిష్క్రమణ ఏ హడావుడి లేకుండా ముగిసిపోయింది. పదవీ విరమణ తర్వాత ఆయన ఉత్తరాఖండ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా పనిచేశారు. తాజాగా ఆయన్ని ఏపీ విజిలెన్స్ కమిషనర్‌గా నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు.