Junior NTR Tweet : హెల్త్ యూనివర్సిటీ పేరు మారిస్తే ఎన్టీఆర్ స్థాయి తగ్గదు
NTR Health University Name Change : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై వివాదం కొనసాగుతూనే ఉంది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు సైతం ఈ విషయంపై స్పందిస్తున్నారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ(NTR Health University) పేరు మార్పుపై ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీలోని కొంతమంది కూడా ఈ విషయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు(NTR Family) సైతం ఈ విషయం స్పందించారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) ఈ విషయంపై తనదైన శైలిలో ట్వీట్ చేశారు.
'NTR, YSR ఇద్దరు విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం YSR స్థాయిని పెంచదు. NTR స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి(University) పేరు మార్చడం ద్వారా NTR సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు.' అని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
NTR Son Comments : ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును తొలగించడాన్ని నందమూరి కుటుంబ సభ్యులు ఖండించారు. విశ్వవిద్యాలయం పేరు మార్పుపై ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ స్పందించారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరునే కొనసాగించాలన్నారు. అన్ని వైద్య కళాశాలలు ఒకే పాలసీతో నడవాలనే భావనతో 1986లో ఆరోగ్య వర్సిటీని ఎన్టీఆర్ స్థాపించారని చెప్పారు. ఎన్టీఆర్ పేరును తొలగించడమంటే యావత్ తెలుగు జాతిని అవమానించినట్లేనని వ్యాఖ్యానించారు.
'అన్ని పార్టీలకు, ప్రాంతాలకు, కులాలకు చెందిన యుగపురుషుడు నందమూరి తారక రామారావు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడిన ఎన్టీఆర్ పేరు మార్చడం దురదృష్టకరం. వైద్య విశ్వవిద్యాలయాన్ని ఎన్టీఆర్ పేరుమీదనే కొనసాగించాలి' అని రామకృష్ణ డిమాండ్ చేశారు.
జగన్ ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మహానేత అయిన ఎన్టీఆర్ పేరు మార్చటం సరికాదని అంటున్నారు. ఇక టీడీపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు. ఇక ఎన్టీఆర్ కుటుంబం కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించింది. మరోవైపు బీజేపీ, జనసేనతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా సర్కార్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇదే విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు.
హెల్త్ వర్శిటీకి మళ్లీ ఎన్టీఆర్ పేరు పెట్టే వరకు పోరాటం టీడీపీ అధినేత చంద్రబాబు నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక పేరు మారుస్తామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ పేరు తొలగించడం దారుణమన్న ఆయన.. సీఎం జగన్ నీచబుద్ధి బయట పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. తాను తలచుకుంటే కడప జిల్లాకు, ఉద్యాన విశ్వవిద్యాలయానికి ఆ పేరు ఉండేదా..? అని ప్రశ్నించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు జగన్‌లా ఏనాడూ ఆలోచించలేదన్న ఆయన.. మహానుభావుల పేర్లు తొలగించడం ఏమిటి? అని చంద్రబాబు తీవ్రంగా ధ్వజమెత్తారు. అసలు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి వైఎస్‌ఆర్‌కు ఏం సంబంధం? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రభుత్వం పిచ్చి ఆలోచనలు మానుకుని విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరును యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.