Journalists Arrest : అమలాపురంలో బెదిరింపులకు దిగిన విలేకరుల అరెస్ట్….-journalist arrested for blackmailing rice transport owner ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Journalists Arrest : అమలాపురంలో బెదిరింపులకు దిగిన విలేకరుల అరెస్ట్….

Journalists Arrest : అమలాపురంలో బెదిరింపులకు దిగిన విలేకరుల అరెస్ట్….

HT Telugu Desk HT Telugu
Jul 24, 2022 10:35 AM IST

జాతీయ రహదారులపై బియ్యం రవాణా చేస్తున్న లారీని అడ్డగించి అక్రమ కేసులు బనాయిస్తామంటూ బెదిరింపులకు దిగిన లోకల్ మీడియా ప్రతినిధుల్ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. మీడియా ముసుగులో దందాలకు పాల్పడుతున్న ముఠా కొన్నాళ్లుగా హైవేలపై ప్రయాణించే వాహనాల నుంచి నగదు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. నిందితులు మీడియా కార్డుల్ని అడ్డు పెట్టుకుని కొన్నాళ్లుగా దందాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.

<p>మీడియా ముసుగులో వసూళ్లకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్</p>
మీడియా ముసుగులో వసూళ్లకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్ (HT_PRINT)

హైవేపై వాహనాలను అడ్డగించి డబ్బులు వసూలు చేస్తున్నారనే అభియోగాలపై ఆరుగురు లోకల్‌ మీడియా ప్రతినిధులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రావులపాలెం వద్ద జాతీయ రహదారిపై బియ్యం లారీని అడ్డగించిన ముఠా డ్రైవర్‌ను బెదిరించి లక్షల్లో డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. లారీ యజమానికి ఫోన్లు చేసి బెదిరించిన కేసులో ఆరుగురు విలేకరులను అరెస్టు చేసినట్టు అమలాపురం డీఎస్పీ వై.మాధవరెడ్డి తెలిపారు.

జులై 14 తెల్లవారుజామున స్థానిక అరటి మార్కెట్‌ యార్డు సమీపంలో తణుకు నుంచి రావులపాలెం వస్తున్న బియ్యం లోడు లారీని కొత్తపేట నియోజకవర్గానికి చెందిన ఏడుగురు విలేకరులు ఆపారు. లారీ డ్రైవర్‌ను కిందకు దింపి బిల్లులు చూపించాలని బెదిరించారు. డ్రైవర్‌ బిల్లులు చూపించినా ‌ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన బియ్యమని కేసు పెడతామని బెదిరించారు. ఓనర్‌కు ఫోన్‌ చేయకపోతే కేసు పెట్టి జైలుకు పంపుతామని బెదరగొట్టారు. ఆ తర్వాత ఫోన్‌లో రైస్‌మిల్లు గుమస్తాతో మాట్లాడి రెండు లక్షలు ఇస్తేనే లారీని వదులుతామని లేకపోతే సీజ్‌ చేస్తామని తేల్చి చెప్పారు. దీంతో గుమస్తా తన యజమానికి సమాచారం అందించాడు.

అన్ని అనుమతులుు ఉన్న బియ్యం తరలింపును అడ్డుకోవడంతో అనుమానించిన రైలు మిల్లు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరుకు చెందిన సరుకు యజమాని కె.గంగాధరరెడ్డి రావులపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో ఏడుగురు స్థానిక మీడియా ప్రతినిధుల పాత్రను గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు.

నిందితులలో తిరుపతికి పశ్చిమవాహిని పత్రికకకు చెందిన ఆకొండి వీర వెంకటసత్య సూర్య నారాయణమూర్తి , ఆర్టీఐ యాక్ట్‌ ఛానల్‌కు చెందిన చిర్రా నాగరాజు , అనంతవాయిస్‌ పత్రికకు చెందిన అయినవిల్లి విజయబాబు, యూట్యూబ్‌ ఛానల్‌కు చెందిన ఉందుర్తి రవికుమార్‌, జైజనని పత్రికకు చెందిన పలివెల రాజు, గోదావరి పత్రికకు చెందిన ఉమ్మిడిశెట్టి వెంకటేశ్వరరావు లను అరెస్టు చేసి వారి నుంచి నాలుగు మోటారు సైకిళ్లు, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ముద్దాయి వి10 ఛానల్‌కు చెందిన హెచ్‌ రాజేంద్రప్రసాద్‌ పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకోవడానికి ఒక టీమ్‌ను ఏర్పాటు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. ముద్దాయిలను కొత్తపేట జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ వద్ద హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. మీడియా ముసుగులో దందాలకు పాల్పడే వారి సమాచారం పోలీసులకు ఇవ్వాలని అధికారులు సూచించారు.

Whats_app_banner