Indrakeeladri Theft: బెజవాడ ఇంద్రకీలాద్రిపై భారీ చోరీ.. కారులో ఆభరణాలు మాయం, కొండపై పనిచేయని సీసీ కెమెరాలు..-jewelry missing from car in vijayawada indrakeeladri cctv cameras on the hill ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Indrakeeladri Theft: బెజవాడ ఇంద్రకీలాద్రిపై భారీ చోరీ.. కారులో ఆభరణాలు మాయం, కొండపై పనిచేయని సీసీ కెమెరాలు..

Indrakeeladri Theft: బెజవాడ ఇంద్రకీలాద్రిపై భారీ చోరీ.. కారులో ఆభరణాలు మాయం, కొండపై పనిచేయని సీసీ కెమెరాలు..

Sarath Chandra.B HT Telugu

Indrakeeladri Theft: బెజవాడ ఇంద్రకీలాద్రిపై భారీ చోరీ జరిగింది. హైదరాబాద్‌ నుంచి అమలాపురం వెళుతూ దారిలో అమ్మవారి దర్శనం కోసం కారులో వచ్చిన భక్తులు నిలువు దోపిడీకి గురయ్యారు. కారులో ఉంచి 25 కాసుల ఆభరణాలు మాయం అయ్యాయి. కొండపై సీసీ కెమెరాలు పనిచేయక పోవడంతో చోరీ ఎలా జరిగిందో అంతు చిక్కడం లేదు.

దుర్గ గుడిపై ఆభరణాలు చోరీకి గురైన కారు

Indrakeeladri Theft: బెజవాడ ఇంద్రకీలాద్రిపై హైదరాబాద్‌కు చెందిన భక్తులు నిలువుదోపిడీకి గురయ్యారు. కారులో ఉంచిన 272 గ్రాముల బంగారం చోరీకి గురైంది. ఘాట్‌ రోడ్డు ఓంకారం టర్నింగ్ పాయింట్ వద్ద కారులో ఉంచిన 25 కాసుల బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. హైదరాబాద్ నుంచి అమలాపురంలో జరిగే పెళ్లికి వెళ్తూ అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు దర్శనం పూర్తి చేసుకుని వచ్చేసరికి నగలు మాయం అయ్యాయి.

దుర్గగుడిలో అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తుల నగలు చోరీకి గురైన ఘటనపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. ఈ క్రమంలో కొండపై సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వెలుగు చూసింది.

కారులో ఉన్న లగేజీ ఎలా ఉన్నది అలాగే ఉండగా ఆభరణాలు ఉన్న బ్యాగ్‌ మాత్రం మాయమైంది. మొత్తం 272 గ్రాముల బంగారం చోరీకి గురైన ఘటనపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ రాజేంద్ర నగర్‌ ప్రాంతానికి చెందిన స్థిరాస్తి వ్యాపారి అచంట దుర్గారావు మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి అమలాపురంలో జరగనున్న పెళ్లికి హాజరయ్యేం దుకు కారులో వచ్చారు.

అమలాపురం వెళ్లే దారిలో దుర్గమ్మను దర్శనం చేసుకుందామని ఘాట్ రోడ్డు మీదుగా కొండపైకి వచ్చారు. ఘాట్‌ రోడ్డు ఓంకారం మలుపు వద్ద కారును పార్కింగ్ చేసి దర్శనానికి వెళ్లారు. వారు క్యూ లైన్లలోకి వెళ్లిన సమయం అమ్మవారికి నివేదన చేసే సమయం కావడంతో దర్శనం నిలిపేశారు. దీంతో వారంతా క్యూలైన్లలో రెండు గంటల పాటు ఉండి పోవాల్సి వచ్చింది.

కారు ఎక్కువ సేపు పార్క్ చేసి ఉండటంతో గుర్తు తెలి యని వ్యక్తి డోర్ అద్దం కూడా పగల కొట్ట కుండా తలుపులు తెరిచి కారు లోపల ఉన్న బంగారు ఆభరణా లను అపహరించాడు. చోరీకి గురైన ఆభరణాల విలువ సుమారు రూ.25 లక్షలు ఉంటుందని బాధిత కుటుంబం సభ్యులు చెబు తున్నారు. కారు డోర్‌ తాళం వేయడం మరిచిపోవడంతో చోరీ జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

పని చేయని సీసీటీవీలు..

దుర్గగుడి ప్రాంగణంలో భారీ చోరీ జరిగినట్టు సమాచారం అందడంతో పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రైం డీసీపీ తిరుమలేశ్వరరెడ్డి, ఏడీసీపీ రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్షేత్రస్థాయిలో వేలి ముద్రలను క్లూస్ సిబ్బంది సేకరించారు. ఈ క్రమంలో దుర్గ గుడిపై భద్రతా వైఫల్యాలు వెలుగు చూశాయి.

పనిచేయని సీసీ కెమెరాలు

టీటీడీ తర్వాత ఏపీలో అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చే దుర్గగుడిపై భద్రతా వైఫల్యం వెలుగు చూసింది. ఘాట్‌ రోడ్డులో ఉన్న సీసీ కెమెరాలు పనిచేయని విషయం వెలుగు చేసింది. వీటి నిర్వహణకు భారీగా ఖర్చు చేస్తున్నా ఉపయోగం మాత్రం లేకుండా పోయింది.

ఘాట్‌ రోడ్డు ఓంకార మలుపు వద్ద సీసీ కెమెరాలు గత కొంతకాలంగా పని చేయడం లేదని పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాలను పర్యవేక్షిం చేందుకు గతంలో ప్రత్యేకంగా సిబ్బంది ఉండేవారు. వన్‌టౌన్‌ పోలీసులు, దేవస్థానం సెక్యూరిటీ, ఎస్‌పిఎఫ్‌ ఉద్యోగులు సమన్వయంతో సీసీ కెమెరాలను పర్యవేక్షించేవారు. ఆలయ పరిసరాల పర్యవేక్షణ బాధ్యత తమది కాదంటే తమది కాదని ఎవరికి వారు తప్పుకోవడంతో ఈ పరిస్థితి వచ్చింది.

దుర్గగుడిలో జరిగే ప్రతి ఉత్సవంలో పెత్తనం చేసే పోలీసులు ఆలయ భద్రత విషయాన్ని మాత్రం విస్మరించడం విమర్శలకు దారి తీస్తోంది. ఆలయ వ్యవహారాల్లో వేలు పెడుతూ అసలు బాధ్యతలు మాత్రం గాలికొదిలేశారనే ఆరోపణలు విజయవాడ పోలీసులపై ఉన్నాయి.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం