'మురళీ...నీ హీరో పవన్ సార్ వచ్చారు, లేచి సెల్యూట్ చెయ్యి'-కన్నీళ్లు పెట్టిస్తోన్న జవాన్ తండ్రి మాటలు-jawan murali naik martyred in india pak war final rytes completed mural father last words emotional ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  'మురళీ...నీ హీరో పవన్ సార్ వచ్చారు, లేచి సెల్యూట్ చెయ్యి'-కన్నీళ్లు పెట్టిస్తోన్న జవాన్ తండ్రి మాటలు

'మురళీ...నీ హీరో పవన్ సార్ వచ్చారు, లేచి సెల్యూట్ చెయ్యి'-కన్నీళ్లు పెట్టిస్తోన్న జవాన్ తండ్రి మాటలు

అమర జవాన్ మురళీ నాయక్ కు సైనిక లాంఛనాలతో, వేలాది మంది అశ్రు నివాళుల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. జై జవాన్, వందేమాతరం, భారత్ మాతాకా జై అంటూ వేల గొంతుకలు నినాదాలు చేస్తుంటే...ఆ వీరుడు అమరపురికి తరలివెళ్లాడు. పవన్ కల్యాణ్ నివాళులర్పించిన సమయంలో మురళీ తండ్రి మాటాలు అక్కడున్న వారి గుండెల్ని పిండేశాయి.

'మురళీ...నీ హీరో పవన్ సార్ వచ్చారు, లేచి సెల్యూట్ చెయ్యి'-కన్నీళ్లు పెట్టిస్తోన్న జవాన్ తండ్రి మాటలు

అమర జవాన్ మురళీ నాయక్‌కు సైనిక లాంఛనాలతో, వేలాది మంది అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. జై జవాన్, భారత మాతాకీ జై నినాదాలతో వీర జవాన్‌‌కు జనం తుది వీడ్కోలు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్....ఇతర మంత్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు నివాళులర్పించారు. వీర జవాన్‌ మురళీ నాయక్ పాడె మోసి మంత్రి నారా లోకేష్ కడసారి వీడ్కోలు పలికారు.

అశ్రు నివాళులు

ఆపరేషన్ సిందూర్ లో భాగంగా కశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్ భౌతికకాయానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు.

శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండల కళ్లితండాలోని మురళీ నాయక్ నివాసానికి వెళ్లి మంత్రులు మంత్రులు నారా లోకేశ్, వంగలపూటి అనిత, సత్యకుమార్ యాదవ్, సవిత, అనగాని సత్య ప్రసాద్, పలువురు ఎమ్మెల్యేలతో కలసి అశ్రునయనాలతో నివాళులు అర్పించారు.

నీ హీరో పవన్ సార్ వచ్చారు మురళీ

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్...వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్చారు. ఈ సమయంలో మురళీ నాయక్ తండ్రి రాంనాయక్..." మురళీ...నీ హీరో పవన్ సార్ వచ్చారు. లేచి ఒకసారి సెల్యూట్ చేయరా" అంటూ పలికిన మాటాలు అక్కడున్న వారి గుండెల్ని మెలిపెట్టాయి.

మురళీకి పవన్ కల్యాణ్ అంటే ఎంతో ఇష్టమని, తరచూ ఆయన పాటలకు డ్యాన్స్ చేస్తుండే వాడని గ్రామస్థులు అంటున్నారు.

వందల వాహనాలతో స్వచ్ఛందంగా ర్యాలీ

భారత్-పాకిస్థాన్ యుద్ధంతో అమరుడైన జవాన్ మురళీ నాయక్ మృతదేహం శనివారం సాయంత్రం బెంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో సత్యసాయి జిల్లాలోని ఆయన స్వగ్రామానికి తరలించారు. ఏపీ సరిహద్దు నుంచి వందల వాహనాలతో భారీ ర్యాలీగా తీసుకొచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా ఆర్మీ వాహనం వెంబడి తరలివచ్చారు. అడుగడుగునా ప్రజలు మురళీ భౌతిక కాయానికి అశ్రునివాళులు అర్పించారు.

"దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన శ్రీ సత్యసాయి జిల్లా కళ్లితండాకు చెందిన వీరజవాన్ మురళీ నాయక్ భౌతికకాయానికి అశ్రునివాళులు అర్పించాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేశాను. అగ్నివీర్ మురళీ నాయక్ ఋణం తీరనిది. జైహింద్"- మంత్రి నారా లోకేశ్

జవాన్ కుటుంబానికి అండగా ప్రభుత్వం

అమర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడింది. రూ.50 లక్షల పరిహారంతో పాటు, 5 ఎకరాల భూమి, 300 గజాల ఇంటి స్థలం, మురళీనాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. సొంత నిధుల నుంచి మరో రూ. 25 లక్షల సాయం ప్రకటించారు పవన్ కల్యాణ్.

వీరుడా వెళ్లిరా!

భారత్-పాక్ యుద్ధంలో అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్ కు అంతిమ వీడ్కోలు పలికేందుకు వేల మంది స్వచ్ఛందంగా తరలివచ్చారు. జై జవాన్ అంటూ, వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. కోట్లు సంపాదించినా...ఇలా వీర మరణం రాదని, వేల మంది తరలివచ్చి నివాళులర్పించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం