Janasena Ippatam : ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత….. పవన్ కళ్యాణ్‌ ఆగ్రహం-janasena suppoerters houses demolished in ippatam village ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Janasena Suppoerters Houses Demolished In Ippatam Village

Janasena Ippatam : ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత….. పవన్ కళ్యాణ్‌ ఆగ్రహం

HT Telugu Desk HT Telugu
Nov 04, 2022 02:25 PM IST

Janasena Ippatam జనసేన పార్టీ బహిరంగ సభను నిర్వహించుకోడానికి పొలాలను ఇచ్చిన ఇప్పటం గ్రామంపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. శుక్రవారం ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణ పేరుతో జనసేన మద్దతుదారుల ఇళ్లను కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటం గ్రామాభివృద్ధి కోసం గతంలో పవన్ రూ.50లక్షల రుపాయల విరాళాన్ని ప్రకటించారు.

ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేత
ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేత

Janasena Ippatam ఇప్పటం గ్రామంలో లో ఇళ్ల కూల్చివేతపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతల ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని హెచ్చరించారు. వాళ్లకు ఓటేయనివారు శత్రువులన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందని దుయ్యబట్టారు. మనవారు కానివారిని ‘తొక్కి నార తీయండి’ అనేలా ఏపీలో పాలన సాగుతోందని విమర్శించారు. వాళ్లకు ఓటేసిన 49.95 శాతం మందే పాలకులం అన్నట్లుగా ఉందని పవన్‌ ఆరోపించారు. ఇప్పటంలో రహదారి విస్తరణ పేరుతో జరుగుతోంది అరాచకమని మండిపడ్డారు. ఇప్పటికే 70 అడుగుల రోడ్దు ఉంటే ఇంకా విస్తరణేంటని ప్రశ్నించారు. రహదారి విస్తరణ వంకతో ఇళ్లు తొలగిస్తున్నారని, కూల్చివేత నోటీసులపై గ్రామస్థులు ఇప్పటికే కోర్టుకు వెళ్లారని, ఆగమేఘాల మీద ఇళ్ల కూల్చివేత చేపట్టారని ఆరోపించారు.

ట్రెండింగ్ వార్తలు

ఇప్పటం గ్రామంలో వైసీపీ, జనసేనల మధ్య నెలకొన్న వివాదాం తారా స్థాయికి చేరుకుంది. కొద్ది నెలల క్రితం ఇప్పటం గ్రామంలోని పొలాల్లో పవన్ కళ్యాణ్‌ బహిరంగ సభ నిర్వహించారు. ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగకుండా స్థానికులు తమ పొలాలను సభకు ఇచ్చారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే ఆర్కే వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని రైతులు అనుమానిస్తున్నారు. ఇటీవల నాదెండ్ల మనోహర్‌ పర్యటన సందర్భంగా గ్రామంలో విద్యుత్ నిలిపివేశారు. గ్రామానికి పవన్ ప్రకటించిన రూ.50లక్షల అభివృద్ధి నిధులు సిఆర్డీఏకు అప్పగించాలని అధికారులు ఒత్తిడి చేశారు. తాజాగా రోడ్డు విస్తరణ ప్రారంభించడం కక్ష సాధింపేనని పవన్ కళ్యాణ్‌ ఆరోపించారు.

తమకు అనుకూలంగా ఓటు వేసినవారే మనవాళ్ళు.. ఓటు వేయనివారు శత్రువులు.. వారి పీచమణిచి వేద్దామనే పాలన చేస్తే రాక్షస రాజ్యమే ఆవిష్కృతమతుందని పవన్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పాలన నూటికి నూరుశాతం మనవారు కాని వారిని 'తొక్కి నార తీయండి ' అనే విధంగా కొనసాగుతోందన్నారు. పాలకులు తమకు ఓటు వేసిన 49.95 శాతం ఓటర్లకు మాత్రమే పాలకులం అని భావిస్తున్నట్లు వారి చర్యలు చూస్తే అర్ధమవుతోందని, ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో అరాచకం సాగుతోందన్నారు.

మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామవాసులు జనసేన మద్దతుదారులు కావడమే వై.సి.పి. ప్రజాప్రతినిధుల ఆగ్రహానికి కారణం అయ్యిందని ఆరోపించారు. గత మార్చి 14వ తేదీన జనసేన ఆవిర్భావ సభకు చోటిచ్చి సహకరించడమే స్థానిక ప్రజాప్రతినిధి ఆగ్రహానికి కారణమన్నారు. అమరావతిలోనే ఆవిర్భావ సభ జరపాలని నిర్ణయించి సభాస్థలి కోసం అన్వేషిస్తున్న తరుణంలో సభకు చోటు ఎక్కడా దొరకకుండా అధికార పార్టీ నేతలు బెదిరింపులు, హెచ్చరికలకు పాల్పడ్డారని, ఇప్పటంవాసులు సభ తమ గ్రామంలో జరుపుకోండని ధైర్యంగా ముందుకు రావడమే నేటి కూల్చివేతలు కారణమని పవన్ ఆరోపించారు.

మార్చి 14న సభ జరిగిన తరువాత ఏప్రిల్ నెలలో రోడ్డు విస్తరణ అంటూ నోటీసులు ఇచ్చారని, ఊరు ప్రధాన రహదారికి కాస్త పక్కాగా రాకపోకలకు దూరంగా ఉంటూ ప్రశాంతంగా ఉండే గ్రామం అని, గ్రామం మీదుగా వాహనాల రాకపోకలు ఉండవని, ఇప్పటికే ఊరిలో 70 అడుగుల రోడ్డు ఉంటే దానిని ఇప్పుడు 120 అడుగుల రోడ్డు విస్తరించి గ్రామానికి అదనపు హంగులు తెచ్చేయాలని స్థానిక ప్రజా ప్రతినిధి గారు ఉవ్విళ్లురుతున్నారని మండిపడ్డారు. ఆయన ఉత్సాహానికి కేవలం కక్ష సాధింపు కారణమని ఆరోపించారు.

రోడ్డు విస్తరణ వంకతో తమకు ఓటేయని వారి ఇళ్ల తొలగింపు చేపట్టారని. శుక్రవారం ఉదయం నుంచి పోలీస్ బలగాల సాయంతో జె.సి.బి.లతో నిర్ధాక్షిణ్యంగా కూల్చి వేస్తున్నారని ఆరోపించారు. నిజానికి ప్రధాన రహదారి నుంచి ఈ గ్రామానికి వెళ్లే అప్రోచ్ రోడ్డు మాత్రం 15 అడుగులు మాత్రమే ఉందని, కూల్చివేత నోటీసులపై ఊరివారందరూ హైకోర్టును ఆశ్రయించడంతో ఆగమేఘాలమీద ఈ రోజు కూల్చివేతలు చేపట్టారని మండిపడ్డారు. రోడ్డు పక్కనే మంచినీటి ట్యాంక్ ఉంది. దానిని అలానే ఉంచి ట్యాంక్ పక్కన ఉన్న ఇంటిని కూడా కూలగొట్టారని పవన్ చెప్పారు.

ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన జన సైనికులు, వీర మహిళలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని, దుర్మార్గానికి అండగా నిలబడ్డారని పవన్ ఆరోపించారు. ఇప్పటం గ్రామస్తుల ప్రజా పోరాటానికి, న్యాయ పోరాటానికి జనసేన అండగా నిలబడుతుందనిప్రకటించారు. ఇటువంటి దుష్ట చర్యలపై అలుపెరగని పోరాటం చేస్తామని, కూల్చివేతలతో పాలన ప్రారంభించిన ప్రభుత్వం కూలిపోయే రోజు ఎంతో దూరం లేదన్నారు.

IPL_Entry_Point