Kiran Royal : కిరణ్ రాయల్ వ్యవహారంపై జనసేన యాక్షన్, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు-janasena responded on tirupati kiran royal order stay away from party activities ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kiran Royal : కిరణ్ రాయల్ వ్యవహారంపై జనసేన యాక్షన్, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు

Kiran Royal : కిరణ్ రాయల్ వ్యవహారంపై జనసేన యాక్షన్, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు

Bandaru Satyaprasad HT Telugu
Updated Feb 09, 2025 08:54 PM IST

Kiran Royal : కిరణ్ రాయల్ పై వస్తున్న వ్యక్తిగత ఆరోపణలపై జనసేన స్పందించింది. ఈ ఆరోపణలపై క్షుణ్ణమైన విచారణ జరిపి నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కిరణ్ రాయల్ ను ఆదేశించింది.

 కిరణ్ రాయల్ వ్యవహారంపై జనసేన యాక్షన్, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు
కిరణ్ రాయల్ వ్యవహారంపై జనసేన యాక్షన్, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు

Kiran Royal : తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ పై గత కొన్ని రోజులుగా పలు ఆరోపణలు వచ్చాయి. కిరణ్ రాయల్ పై వ్యక్తిగత ఆరోపణల నేపథ్యంలో జనసేన అధిష్టానం స్పందించింది. ఈ ఆరోపణలపై క్షుణ్ణమైన విచారణ జరిపి నిర్ణయం తీసుకునే వరకు కిరణ్ రాయల్ ను పార్టీ కార్యక్రమాల నుంచి దూరం ఉండాలని జనసేన పార్టీ ఆదేశించింది.

గత కొన్ని రోజులుగా కిరణ్ రాయల్ మీద మీడియాలో చోటు చేసుకున్న ఆరోపణలపై క్షుణ్ణమైన పరిశీలన చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ కాన్ ప్లిక్ట్ కమిటీని ఆదేశించారు. అందువల్ల పార్టీ ఆదేశాలు వెలువడే వరకు జనసేన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి సారించాలని, సమాజానికి ప్రయోజనంలేని వ్యక్తిగతమైన విషయాలను పక్కకు పెట్టాలని జన సైనికులు, వీర మహిళలు, నాయకులకు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, చట్టం తన పని తాను చేస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు జనసేన కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది.

పోలీసులకు కిరణ్ రాయల్ ఫిర్యాదు

గతంలో వైసీపీ నేత రోజా ఫిర్యాదుతో కేసులు పెట్టి తనను అరెస్టు చేసి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారని కిరణ్ రాయల్ తెలిపారు. ఆ ఫోన్లలో ఉన్న సమాచారాన్ని చోరీ చేశారని, ఆ డేటాతో ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. మహిళను అడ్డం పెట్టుకుని చేస్తున్న రాజకీయానికి భయపడేది లేదని కిరణ్ రాయల్ అన్నారు.

వైసీపీ మహిళా విభాగం ఆందోళన

తిరుపతిలో జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ ఇంటి వద్ద వైసీపీ మహిళా విభాగం ఆందోళన చేసింది. కిరణ్ రాయల్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆడవాళ్ల జీవితాలతో పరాచకాలు ఆడుతున్న కిరణ్ రాయల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

అసలేం జరిగింది?

కిరణ్ రాయల్‌ను న‌మ్మి మోసం పోయాన‌ని తిరుప‌తికి బైరాగ‌ప‌ట్టడుగుకు చెందిన ఓ మ‌హిళ వీడియోలో పేర్కొంది. అప్పులు చేసి ప‌లుసార్లు రూ.1.20 కోట్ల వరకు కిరణ్ రాయల్‌కు అప్పు ఇచ్చాన‌ని తెలిపింది. అలాగే 25 స‌వ‌ర్ల బంగారం కూడా ఇచ్చాన‌ని పేర్కొంది. అయితే కూట‌మి ప్రభుత్వం వ‌చ్చిన వెంట‌నే ఇచ్చినదానికి రెండింత‌లు ఇస్తాన‌ని చెప్పాడ‌ని పేర్కొంది. త‌న పిల్లల‌ను చంపుతాన‌ని బెదిరించి, కేవ‌లం రూ.30 లక్షలకు చెక్కులు బాండ్లు రాయించారని మ‌హిళ తెలిపింది. త‌న వ‌ద్ద ఉన్న వీడియో రికార్డు తీసుకున్నాడ‌ని, అయితే త‌న వ‌ద్ద అన్ని ఆధారాలు ఉన్నాయ‌ని పేర్కొంది. అప్పులు ఎక్కువైపోయాయ‌ని, పిల్లల‌కు స‌మాధానం చెప్పలేక‌పోతున్నాన‌ని, ఇక బ‌త‌క‌లేన‌ని తెలిపింది.

కిరణ్ రాయల్ వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తాను చనిపోయిన తరువాత అయినా ఆ డబ్బులు తన పిల్లలకు చెందాలని కోరింది. అయితే కిర‌ణ్ రాయ‌ల్‌ను త‌న‌కు రావ‌ల్సిన డ‌బ్బులు అడిగితే, ఆయ‌న త‌న‌పై బెదిరింపుల‌కు దిగాడ‌ని తెలిపింది. అందుకే వీడియో విడుద‌ల చేసి ఆత్మహ‌త్యకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. ఈ వీడియో శ‌నివారం సామాజిక మాధ్యమాల్లోకి వ‌చ్చింది. మహిళా ఆత్మహత్యాయత్నం చేసుకుని వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Whats_app_banner