Janasena : జాబ్ క్యాలెండర్ మర్చిపోయారు…జనసేన
Janasena జాబ్ క్యాాలెండర్ సంగతి మర్చిపోయిన రాష్ట్రప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను తొలగించడం దుర్మార్గమని జనసేన మండిపడింది. ప్రభుత్వ పెద్దల సూచనలు, సలహాలు లేకుండా అధికారులు ఉద్యోగాలు తొలగించే ఆదేశాలు ఎలా ఇస్తారని జనసేన పిఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.
Janasena ఏపీలో జాబ్ క్యాలెండర్ సంగతి మరిచిపోయి ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కూడా తొలగిస్తే ఎలా అని జనసేన పార్టీ ప్రశ్నించింది. ప్రభుత్వ పెద్దల సూచనలు.. సలహాలు లేకుండా అధికారులు ఆ ఆదేశాలు ఇస్తారా అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. డి- ఫ్యాక్టో సీఎం సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు నమ్మశక్యంగా లేవన్నారు.
ఏటా జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తామని, రెండున్నర లక్షల ప్రభుత్వఉద్యోగాలు భర్తీ చేస్తాం అంటూ హామీలు ఇచ్చిన వైసీపీ ఇప్పుడు యువతను మోసం చేసిందని జనసేన పార్టీ ఆరోపించింది. మూడున్నరేళ్ల కాలంలో ఒకసారి జాబ్ క్యాలెండర్ ఇచ్చి అందులో కూడా అరకొర ఖాళీలు చూపించి వాటిని కూడా భర్తీ చేయలేదని విమర్శించారు.
జాబ్ క్యాలెండర్ విషయాన్ని మర్చిపోయి... ఇప్పుడు ఏళ్ల తరబడి కొద్దిపాటి జీతానికి పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించడాన్ని ముఖ్యమంత్రి ఏ విధంగా సమర్థించుకుంటారన్నారు. అలాంటి ఆదేశాలు గురించి తమకు తెలియవని, అధికారులు ఇచ్చారు అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవన్నారు. రెండున్నర లక్షల ఉద్యోగాలు వస్తాయని చూస్తున్న యువతకు రెండున్నర లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారనే విషయం ఆశనిపాతంగా మారిందన్నారు. చి
న్నపాటి ఉద్యోగాలకే రక్షణ ఇవ్వలేని ప్రభుత్వం తమకు ఉద్యోగాలు ఏమిస్తుందనే ఆందోళనలో ఉన్నారని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వరు, ఉపాధి ఇచ్చే పరిశ్రమలను ప్రోత్సహించరు, ఉన్న పరిశ్రమలు తమ కొత్త ప్రాజెక్టులను, అనుబంధ యూనిట్లను కూడా రాష్ట్రంలో నెలకొల్పేందుకు సుముఖంగా లేవన్నారు. పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయి అంటే వైసీపీ పాలన ఏ విధంగా ఉందో అందరికీ అర్థమవుతోందని విమర్శించారు. ప్రభుత్వ పెద్దల సూచనలు, సలహాలు లేకుండా అధికారులు ఆదేశాలు ఇస్తారు అంటే ఎవరు నమ్మరన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో డి-ఫ్యాక్టోలు, సలహాదారులు కాకుండా నేరుగా ముఖ్యమంత్రే వివరణ ఇవ్వాలన్నారు.
పుంగనూరులో దాడిపై ఆగ్రహం….
చిత్తూరు జిల్లా పుంగనూరులో పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్ ఇంటిపై దాడి వ్యవహారం వైఎస్సార్సీపీ ఆలోచనా విధానాన్ని మరోసారి బయటపెట్టిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో రైతు సభ నిర్వహించాలనుకోవడమే రామచంద్ర యాదవ్ చేసిన నేరమా అని నాదెండ్ల నిలదీశారు. రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడిని ఖండిస్తున్నట్లు చెప్పారు. ''ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తారు.. ఎదిరించి నిలబడితే ఆస్తులు ధ్వంసం చేస్తారా అని ప్రశ్నించారు.
ప్రతిపక్ష పార్టీలు సభలు, సమావేశాలు పెట్టుకోవడమే నిషిద్ధమా అన్నారు. రామచంద్ర ఇంటిపై వైకాపా మూకలు దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని, ఇది ముమ్మాటికీ వైసీపీ వికృత రాజకీయంలో భాగమేనన్నారు. ప్రశ్నించేవారు లేకుండా చేసుకునే కుట్రలో భాగంగానే ఇలా దాడులకు పాల్పడుతున్నారని, ప్రజాస్వామ్యం ప్రసాదించిన విలువలు, వాక్ స్వాతంత్ర్యంపై జరిగిన దాడిగానే జనసేన భావిస్తోందన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా అందరూ దాడిని ఖండించాలని నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు.