Janasena Nadendla : ప్రధానితో భేటీ వివరాలు బయటకు చెప్పక్కర్లేదు….నాదెండ్ల మనోహర్-janasena nadendla manohar says no need to disclose about pm meeting with pawankalyan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Janasena Nadendla Manohar Says No Need To Disclose About Pm Meeting With Pawankalyan

Janasena Nadendla : ప్రధానితో భేటీ వివరాలు బయటకు చెప్పక్కర్లేదు….నాదెండ్ల మనోహర్

HT Telugu Desk HT Telugu
Nov 19, 2022 05:42 AM IST

Janasena Nadendla ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన సమావేశాన్ని గౌరవిస్తామని, సమావేశ వివరాలు బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని, పుకార్లకు సమాధానం చెప్పక్కర్లేదని జనసేన పిఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసమే జనసేన ఆలోచిస్నతోందని, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పార్టీలన్ని ఏకం కావాలని పిలుపునిచ్చారు. సొంత జిల్లా ప్రజలకు న్యాయం చేయని ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏం చేస్తారని నాదెండ్ల ఎద్దేవా చేశారు.

జనసేన పిఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌
జనసేన పిఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌

Janasena Nadendla ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో పవన్ కళ్యాణ్ సమావేశాన్ని జనసేన పార్టీ గౌరవిస్తుందని, ఆ సమావేశంలో చర్చించిన విషయాలను బహిర్గతం చేయాలనే ఆలోచన లేదని, సమావేశంపై వస్తున్న రకరకాల భాష్యాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మోదీ, పవన్ కళ్యాణ్ సమావేశంలో అంశాలుగా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లు గురించి స్పందించాల్సిన అవసరం లేదన్నారు. అన్నమయ్య డ్యాం జల విలయానికి ఏడాది అయిన నేపథ్యంలో ఆ ప్రాంతాలలో శనివారం పర్యటించి బాధిత ప్రజలను కలువనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

"ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ ఆలోచన ఉంటుందని. రాష్ట్రం, రాష్ట్ర ప్రజల మంచి కోసం ఏం చేస్తే బాగుంటుంది అన్న కోణంలోనే ప్రధానితో సమావేశం జరిగిందని, పదవుల కోసం పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఆలోచించరని, ప్రజల కోసం వారి భవిష్యత్తు కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ ఆలోచించి మాత్రమే ఏ మాట అయినా మాట్లాడుతారన్నారు. వైసీపీ వల్ల రాష్ట్రానికి జరిగే నష్టం, భవిష్యత్తులో అనుసరించాల్సిన విషయాలు గురించి చర్చ జరిగిందని, కొన్ని అంశాలు ఎన్నికల సమయంలో రాజకీయంగాను చర్చకు వస్తాయన్నారు. వాటికి రకరకాల భాష్యాలు చెప్పి, అన్ని విషయాలు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. నరేంద్ర మోదీతో జరిగిన సమావేశం విషయంలో సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి అంశానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

ఓట్లను చీలనివ్వం….

వైసీపీ విముక్త ఆంధ్ర ప్రదేశ్ కోసం కచ్చితంగా అన్ని పక్షాలు కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రానికి వైసీపీ వల్ల ఎంత నష్టమో ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తామన్నారు. కచ్చితంగా జనసేన పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరుతామని, పవన్ కళ్యాణ్ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ కు ఎంత అవసరమో తెలియజెప్పేలా క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తామన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న దానిపై ఓ ప్రణాళిక ప్రకారం ఎన్నికల్లో ముందుకు వెళ్తామన్నారు.

పెడనలో జనసేన కార్యకర్తలపై దాడి….

జగనన్న ఇళ్ల నిర్మాణంలో చతికిలపడిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి శ్రీ జోగి రమేష్ నియోజకవర్గమైన పెడనలో వై.సి.పి. కార్యకర్తలు గూండాలు మాదిరి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గురువారం రాత్రి జనసేన కార్యకర్తలు మంత్రి వైఫల్యాలను ఎత్తి చూపుతూ ముద్రించిన పోస్టర్లను అతికిస్తుండగా మంత్రి అనుచరులు దౌర్జన్యం చేశారని, వారి నుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్ లోనికి వెళ్లగా పోలీసులు చూస్తుండగానే, మంత్రి అనుచరులు నలుగురు జన సైనికులను దుర్మార్గంగా కొట్టిన విషయాన్ని పార్టీ కార్యాలయం దృష్టికి జిల్లా నాయకులు తీసుకు వచ్చారు. దాడికి పాల్పడినవాళ్ళు పోలీసులు చూస్తుండగానే దర్జాగా వెళ్లిపోయారని, పోలీసులు మాత్రం పోస్టర్లు అతికించిన నలుగురు జన సైనికులపైనా, వారి కోసం వెళ్ళిన స్థానిక జనసేన నాయకుడు ఎడ్లపల్లి రామ్ సుధీర్ మీద కేసులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

దాడి విషయం తెలుసుకున్న జనసేన నాయకులు, కార్యకర్తలు పెడన పోలీస్ స్టేషన్‌కు తరలి రావడంతో, చివరకు దాడి చేసిన వారిపై కూడా కేసు నమోదు చేయడానికి పోలీస్ అధికారులు అంగీకారం తెలిపారన్నారు. మంత్రి ఆధ‌్వర్యంలో మడ అడవుల ధ్వంసం చేసి తీరాన్ని కొల్లగొట్టడం నిజం కాదా? అని ప్రశ్నించడంతో పాటు ఇసుక, మట్టి దోపిడీ మాటేమిటని? ఈ వాస్తవాలను ప్రశ్నించడంతోపాటు- గృహ నిర్మాణ శాఖ మంత్రి నియోజక వర్గంలోనే 'పేదలందరికీ ఇళ్లు' పనులు ముందుకు వెళ్లడం లేదని జనసేన బయటపెట్టడంతో మంత్రి బాధ్యతగా స్పందించాల్సింది పోయి దాడులు చేయడం ఏమిటని ప్రశ్నించారు.

22వ తేదీ నుంచి విజయనగరం జిల్లాలో

జనసేన పార్టీ నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలలో భాగంగా ఉమ్మడి విజయనగరం జిల్లా సమావేశాలు ఈ నెల 22వ తేదీ నుంచి మొదలు కానున్నాయి. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమీక్షలు నిర్వహిస్తారు. విజయనగరంలో ఈ సమావేశాలు ఉంటాయి. 22వ తేదీ నుంచి వారం రోజులపాటు అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఈ సమావేశాలు చేపట్టేందుకు షెడ్యూల్ సిద్ధం చేశారు. పార్టీ ముఖ్య నాయకులు, వీర మహిళలు, క్రియాశీలక సభ్యత్వ నమోదు చేపట్టిన వాలంటీర్లు, పార్టీ విభాగాల సభ్యులు పాల్గొంటారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, క్షేత్రస్థాయిలో సమస్యలపై పోరాటం, జిల్లా స్థాయిలో దీర్ఘకాలికంగా ఉన్న ప్రజా సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులు, కార్యకర్తల సంక్షేమం తదితర అంశాలపై చర్చిస్తారు.

IPL_Entry_Point

టాపిక్