Janasena : డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ స్పందించవద్దు, జనసేన అధిష్టానం కీలక ఆదేశాలు-janasena high command orders party leader not to respond on deputy cm position ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Janasena : డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ స్పందించవద్దు, జనసేన అధిష్టానం కీలక ఆదేశాలు

Janasena : డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ స్పందించవద్దు, జనసేన అధిష్టానం కీలక ఆదేశాలు

Bandaru Satyaprasad HT Telugu
Jan 21, 2025 06:10 PM IST

Janasena : ఏపీలో డిప్యూటీ సీఎం అంశంగా తీవ్రంగా చర్చ జరుగుతోంది. టీడీపీ, జనసేన నేతలు డిప్యూటీ సీఎం, సీఎం పదవులపై బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధిష్టానం స్పందించింది. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడొద్దని కీలక ఆదేశాలు జారీ చేసింది.

డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ స్పందించవద్దు, జనసేన అధిష్టానం కీలక ఆదేశాలు
డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ స్పందించవద్దు, జనసేన అధిష్టానం కీలక ఆదేశాలు

Janasena : ఏపీ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం అంశం తీవ్ర కలకలం రేపుతోంది. టీడీపీ, జనసేన నేతలు ఒక్కొక్కరిగా తమ అభిప్రాయాలు చెబుతుండడంతో ఇరు పార్టీల అధిష్టానాలు అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే టీడీపీ ఈ అంశంపై స్పందించొద్దని పార్టీ నేతలను ఆదేశించింది. తాజాగా జనసేన అధిష్టానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉప ముఖ్యమంత్రి అంశంపై ఎవరూ మాట్లాడొద్దని పార్టీ శ్రేణులను స్పష్టం చేసింది. డిప్యూటీ సీఎం విషయంలో మీడియా ముందు గానీ, సోషల్ మీడియాలో గానీ ఎవరూ స్పందించొద్దని మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.

yearly horoscope entry point

జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్ ఈ విషయాన్ని వాట్సాప్‌ స్టేటస్ గా పెట్టారు. జనసేన గ్రూపుల్లో పార్టీ అధిష్టానం ఆదేశాలంటూ ఈ మెసేజ్ వైరల్‌ అవుతోంది. డిప్యూటీ సీఎం పదవిపై ఎవరూ మాట్లాడోద్దని పార్టీ శ్రేణులకు టీడీపీ అధిష్టానం ఆదేశించిన రోజు తర్వాత జనసేన స్పందించింది. డిప్యూటీ సీఎం అంశంపై జనసేన నుంచి పలువురు స్పందిస్తుండడంతో ఆ పార్టీ అధిష్టానం కీలక ఆదేశాలు జారీచేసింది.

లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలని సీఎం చంద్రబాబు మైదుకూరు పర్యటన కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మాజీ మంత్రి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు మద్దతు తెలిపారు. దీంతో జనసేన నేతలు స్పందిస్తూ.. పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయని వీడియోలు పెట్టారు. విషయం మరింత ముదురుతుండడంతో ఇరుపార్టీల అధిష్టానాలు స్పందించాయి. డిప్యూటీ సీఎం అంశంపై స్పందించవద్దని సూచించాయి.

మంత్రి వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు అసంతృప్తి

ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా టీడీపీ భవిష్యత్, కాబోయే సీఎం లోకేశ్ అంటూ దావోస్ పర్యటన మంత్రి టీజీ భరత్ మాట్లాడారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారని సమాచారం. అనవసరమైన విషయాలు మాట్లాడొద్దని, బాధ్యతగా వ్యవహరించాలని సూచించినట్లు తెలుస్తోంది. మంత్రి టీజీ భరత్ భవిష్యత్ సీఎం అంటూ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మంత్రి హోదాలో బాధ్యతగా మాట్లాడాలని, ఎప్పుడు, ఏం మాట్లాడాలో తెలుసుకుంటే మంచిదని మందలించారట. మనం ఎక్కడికి, ఎందుకొచ్చాం. మీరు ఏం మాట్లాడుతున్నారని సున్నితంగా హెచ్చరించారట. పెట్టుబడుల కోసం దావోస్ కు వచ్చామని, ఇక్కడ ఇలాంటి వ్యాఖ్యలు అవసరమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట.

మంత్రి నారా లోకేశ్ కు డిప్యూటీ సీఎం హోదా కల్పించాలని టీడీపీ నేతల నుంచి వస్తోన్న డిమాండ్లపై పార్టీ అధిష్ఠానం కీలక ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడొద్దని పార్టీ నేతలను ఆదేశించింది. ఈ అంశంపై ఎవరూ మీడియా ముందు బహిరంగ ప్రకటనలు చేయొద్దని సూచించింది. ఏ నిర్ణయమైనా కూటమి నేతలు కూర్చొని మాట్లాడుకుంటారని ప్రకటించింది. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని ప్రకటనలో పేర్కొంది.

Whats_app_banner

సంబంధిత కథనం