Political Analysis: జనసేనాని వ్యూహాలకు ‘ఓ లెక్కుంది’-janasena chief pawan kalyan strategical moves towards new government formation in ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Janasena Chief Pawan Kalyan Strategical Moves Towards New Government Formation In Ap

Political Analysis: జనసేనాని వ్యూహాలకు ‘ఓ లెక్కుంది’

HT Telugu Desk HT Telugu
May 15, 2023 03:10 PM IST

‘జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వివిధ వేదికల నుండి ‘వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ విముక్తి ఆంధ్రప్రదేశ్‌’ ధ్యేయంగా పొత్తులు అనివార్యమని నొక్కివక్కానిస్తున్నారు. జనసేన పార్టీ నాయకులను, కార్యకర్తలను మానసికంగా సిద్ధం చేస్తున్నారు..’ - పీపుల్స్ పల్స్ రీసెర్చర్ జి.మురళీకృష్ణ విశ్లేషణాత్మక వ్యాసం.

జనసేనాని వ్యూహాత్మక అడుగులు
జనసేనాని వ్యూహాత్మక అడుగులు

త్యాగాలకు అడ్వాన్స్‌ గ్యారంటీలు ఉండవంటారు. ఇది అక్షరాల సత్యం. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలను పరిశీలిస్తే ప్రతిపక్షాలు తెలుగుదేశం, జనసేన తమ ఉమ్మడి రాజకీయ శత్రువైన వైఎస్‌ఆర్‌సిపిని గద్దె దింపడానికి త్యాగాలకు సిద్ధపడాల్సిందే. అందుకు ఆయా పార్టీ అధినేతలు తమ పార్టీ నాయకులను, కార్యకర్తలను మానసికంగా సిద్ధం చేయాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ గత సంవత్సరకాలంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే ఏకైక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే వివిధ వేదికల నుండి ‘వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ విముక్తి ఆంధ్రప్రదేశ్‌’ ధ్యేయంగా పొత్తులు అనివార్యమని జనసేన అధినేత నొక్కివక్కానిస్తున్నారు. జనసేన పార్టీ నాయకులను, కార్యకర్తలను మానసికంగా సిద్ధం చేస్తున్నారు.

రాజకీయ వ్యూహాలు, ప్రతి వ్యూహాల్లో పొత్తులు కూడా భాగమే. ‘‘గమ్యం చేరాలంటే గుర్రమే ఎక్కి పోవాలని ఏమిలేదు. ఏదీ లేనప్పుడు గాడిద దొరికినా దాని మీద ప్రయాణం చేసి గమ్యం చేరవచ్చు’’ అని మాన్యవర్‌ కాన్షీరామ్‌ చెప్పింది దీనికీ వర్తిస్తుంది. కాన్షీరామ్‌ సిద్ధాంతాలకు ఆకర్షితుడైన పవన్‌ కల్యాణ్‌ కూడా అలాంటి అడుగులే వేస్తున్నట్టు అర్థమవుతుంది.

శత్రువును ఎదుర్కోవడానికి బలం చాలనప్పుడు ఇతరులతో చేతులు కలపాల్సిందే. తమ వైపు సరైన బలం లేకుండా యుద్ధానికి దిగితే సైన్యం బలవుతుంది. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితిని గుర్తించిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఈ సారి త్రిముఖ పోటీలో జనసేనను బలి ఇవ్వకూడదని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ‘‘శత్రువుకు అవకాశాలివ్వకుండా శత్రువును వ్యతిరేకించే వారితో జతకట్టి ప్రత్యర్థులను మట్టికరిపించడమే వివేకవంతుల విధానం. అందుకు సగౌరవంగా... వచ్చే ఎన్నికల్లో పొత్తులతో పోటీ చేస్తాం..’’ అని మంగళగిరిలో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ మండల, డివిజన్‌ అధ్యక్షుల సమావేశంలో ఆయన మరోసారి ఆంధ్ర ప్రజలకు స్పష్టమైన సంకేతాలు పంపించారు.

గతేడాది పార్టీ ఆవిర్భావ సభ నుంచి పవన్‌ వ్యూహాత్మకంగా, స్థిరత్వంతో కూడిన ఆలోచన శైలితో ముందుకు సాగుతున్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో అర్థం చేసుకొని క్షేత్ర స్థాయి పరిస్థితులకు దగ్గరగా ఆయన వ్యవహరిస్తున్నారు. రాబోయే ఎన్నికలకు మానసికంగా జనసేన పార్టీ నాయకులను, క్యాడర్‌ని సిద్ధం చేస్తున్నారు.

కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేయమని బీజేపీ కోరినా, అక్కడి పరిస్థితులను అంచనా వేసి ఆ మైలను తనకు అంటుకోకుండా పవన్‌ జాగ్రత్త పడ్డారు. సరిగ్గా కర్ణాటక ఫలితాల ముందురోజే వ్యూహాత్మకంగా పార్టీ మండల, డివిజన్‌ అధ్యక్షుల సమావేశం నిర్వహించి పార్టీ క్షేత్రస్థాయి నాయకులకు ‘‘దిశా-దశా’’ నిర్థేశించారు. ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి నుండి నివేదికలు తెప్పించుకుని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ బలం, బలహీనతలపై ఒక అంచనాకు వస్తూ దానికనుగుణంగా అడుగులు ముందుకు వేస్తున్నారు.

పట్టున్న ప్రాంతాలపైనే

కర్ణాటకలో జేడీ(ఎస్‌), హైదరాబాద్‌లో ఎంఐఎం ఫోకస్‌ చేస్తున్నట్టుగా జనసేన కూడా ముందుగా తనకు పట్టున్న ప్రాంతలపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించింది. ‘‘గత ఎన్నికల్లో జనసేనకు 7 శాతం వరకు ఓట్లు పడ్డాయని గణాంకాలు చెప్తున్నాయి. ఇప్పుడు జనసేన బలం గణనీయంగా పెరిగింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో, ఉభయ గోదావరిలో, ఉత్తరాంధ్రలో జనసేన ఓట్ల శాతం సుమారు 30 నుంచి 35 శాతం వరకు ఉంటుందని భావిస్తున్నాం. మిగతా ప్రాంతాల్లో కాస్త అటు ఇటుగా 18 శాతంగా ఉంటుంది. ఇదే బలంతో మనం అధికారంలోకి రాగలమా? లేక మరోసారి ఇలాగే మిగిలిపోదామా? అని ఆలోచించుకోవాలి’’ అంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ క్షేత్రస్థాయి పరిస్థితులను పార్టీ నాయకులకు, క్యాడర్‌కి స్పష్టంగా వివరించారు.

దీన్ని బట్టి చూస్తే, జనసేనాని వచ్చే ఎన్నికల్లో స్ట్రయిక్‌ రేట్‌ పెంచుకోవాలని చూస్తున్నారని అర్థమౌతోంది. ఎన్ని సీట్లలో పోటీ చేశామన్నది కాకుండా, పోటీచేసిన సీట్లల్లో ఎన్ని సీట్లు గెలుస్తామన్న దానిపై ఆయన ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఇది జనసేనానిలో వచ్చిన రాజకీయ పరిణితికి నిదర్శనం. ఎక్కువ సీట్లు పోటీచేసి ఓడిపోయేదానికన్నా పోటీచేసిన ప్రతీ సీట్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పట్టుదలతో ఆయనున్నారు. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులపై స్వతంత్ర సంస్థలతో సర్వేలు నిర్వహిస్తూ ఆయా నియోజకవర్గాలపై దృష్టిపెట్టినట్లు స్పష్టమౌతోంది. అందులో భాగంగానే మండల, డివిజన్‌ స్థాయి అధ్యక్షుల సమావేశంలో 40 అసెంబ్లీ స్థానాల్లో తమకు బలమున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

జనసేన బలహీన పార్టీ కాదు ...

జనసేనపార్టీ మండల, డివిజన్‌ స్థాయి అధ్యక్ష సమావేశంలో జనసేన అధినేత ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశంకు, బిజెపికి 2019 ఎన్నికలతో పోలిస్తే క్షేత్రస్థాయిలో జనసేనపార్టీ బలపడిందని, ఓట్లశాతం కూడా పెరిగిందని గట్టి సందేశాన్నే వారికి పంపారు. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా, అరాచక వైఎస్‌ఆర్‌సిపి పాలన నుండి రాష్ట్రానికి విముక్తి కలిగించాలనే ఏకైక లక్ష్యంతో పొత్తులకు మొగ్గు చూపుతున్నాం తప్ప అది తమ బలహీనత కాదని, తాను బలహీనుడిని కాదనీ, గత్యంతరం లేక పొత్తు పెట్టుకోవడం లేదనే సందేశాన్ని కూడా ఈ సమావేశం ద్వారా బీజేపీ, టీడీపీలకు పంపించారు. తాము లేకుంటే ఆ పార్టీలకు గత్యంతరం లేదని, ఆత్మగౌరవం విషయంలో తాను రాజీపడబోనని కూడా పరోక్షంగా వారిని హెచ్చరించారు.

పొత్తులు కచ్చితంగా ఒక పార్టీ నిర్మాణానికి, అత్యున్నత స్థాయికి ఎదగడానికి ఉపయోగపడతాయని చెప్తూ టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రస్తానాన్ని ఉదాహరణగా చెప్పారు. 2004లో కాంగ్రెస్‌తో, 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న టీఆర్‌ఎస్‌ 2014లో ఏకంగా అధికారంలోకి వచ్చి దేశ రాజకీయాల్లోనూ తమదైన ముద్ర వేస్తోంది. జనసేనాని కూడా ఇదే ప్రేరణతో పొత్తుల ద్వారా రాబోయే 25 ఏళ్లు రాజకీయాల్లో ఉండటానికి పునాది వేసుకోవడానికి వస్తున్నట్లు కూడా కార్యకర్తలకు స్పష్టంగా తెలియజేశారు. పొత్తులతో ఒక పార్టీ ఎదుగుతుందని వారికి గుర్తు చేశారు. దీనికోసం క్షేత్ర స్థాయిలో చురుకుగా పని చేయాలని జనసైనికులకు, పార్టీ వీర మహిళలకు పవన్‌ సూచించడం ద్వారా పొత్తులకు మానసికంగా సిద్ధపడాలని వారికి సందేశం పంపారు.

కామన్‌ మినీమమ్‌ ప్రోగ్రామ్‌

పదవుల కోసం రాజీపడనని, రాష్ట్ర శ్రేయస్సు కోసం మాత్రమే రాజీపడతానని చెప్తూ, చీకటి ఒప్పందాలు చేసుకోనని పవన్‌ పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. కామన్‌ మినీమమ్‌ ప్రోగ్రాం ద్వారా రాష్ట్ర సంక్షేమం కోసం ఒక ఎజెండా రూపకల్పన చేస్తామన్నారు. ‘‘కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రామ్‌’’లో జనసేన ముద్ర ఉండేవిధంగా మేధావులతో, అనేక ప్రజాసంఘాలతో ఇప్పటికే చర్చలు మొదలుపెట్టారు. ‘‘కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాం’’ వల్ల అనేక రాష్ట్రాల్లో ప్రజలకు మేలు జరిగిందని జనసేనాని గట్టిగా నమ్ముతున్నారు. ఇలాంటి ప్రోగ్రాం ద్వారానే 2004లో యూపీఏ-1 ప్రభుత్వానికి మద్దతిచ్చిన సీపీఎం దేశానికి ఉపయోగపడే ఎన్నో చట్టాలు, పథకాలు తీసుకొచ్చి మేలు చేసింది. ఈ ప్రభుత్వంలో కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాం వల్ల ఆ ఐదేళ్లలో మునుపెన్నడూ లేనివిధంగా దేశం అభివృద్ధి చెందింది. అలాగే, టీడీపీతో కలిసి జనసేన కూడా ప్రజలకు ఉపయోగపడే పథకాలను తీసుకురావాలని తద్వారా జనసేన పార్టీకి గట్టి పునాదిని వేయాలని పవన్‌ కల్యాణ్‌ భావిస్తున్నారు.

కామన్‌ పొలిటికల్‌ ప్రోగ్రాం

పొత్తు అంటే ఏదో శాసన సభ, లోక్‌సభ ఎన్నికల వరకే కుదుర్చుకుని, ఆ తర్వాత పెటాకులు చేసుకోవడం కొన్ని దశాబ్దాలుగా దేశ వ్యాప్తంగా జరుగుతున్నదే. ఇలాంటి పొత్తుల వల్ల చిన్న పార్టీలకు నష్టం జరుగుతుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేసేవాళ్లు గెలిస్తే ఉంటారు, ఓడిపోతే పార్టీ మారతారు. వీరి వల్ల పార్టీ బలోపేతం కాదు. అందుకే, ‘‘కామన్‌ పొలిటికల్‌ ప్రొగ్రాం’’ ని జనసేనాని తెర మీదకు తీసుకొచ్చారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు, శాసనమండలి సభ్యత్వాలు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ కార్పోరేషన్ల చైర్మన్‌ పదవులు, వివిధ దేవాలయాలకు ట్రస్ట్‌బోర్డ్‌ మెంబర్ల వరకు జనసేనకు పొత్తులో తగిన ప్రాధాన్యత ఉండేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. తద్వారా క్షేత్ర స్థాయిలో కార్యకర్తలకు ఇలా సముచిత స్థానాలు ఇవ్వడం వల్ల పార్టీ బలోపేతం అవుతుంది. పార్టీ ద్వారా తమకూ ఏదో ఒక పదవి లభిస్తుందనే ఉత్సాహంతో కార్యకర్తలు రాబోయే 20 ఏళ్లు పార్టీ కోసం శక్తివంచన లేకుండా విశ్వసనీయతతో పని చేస్తారు. ఆ దిశగా జనసేనాని ఆలోచిస్తున్నారు.

కాపు నాయకులకు హెచ్చరికలు

ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని కొంతమంది స్వయం ప్రకటిత కాపు నాయకులు ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఈ ఉచిత సలహాలను పట్టించుకొని ఆవేశపడొద్దని కూడా నాయకులకు, కార్యకర్తలకు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. మనం ఒకటి డిమాండ్‌ చేయాలంటే ముందు మనం బలంగా ఉండాలని, జనసేనకు గౌరవం తెచ్చే వ్యూహం తాను చూసుకుంటాననీ, కాగితపు పులులను పట్టించుకోకుండా క్షేత్ర స్థాయిలో మెరుగైన ఫలితాల కోసం కృషి చేయండని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఓటు బ్యాంక్‌ చేజారకుండా గ్రామ కమిటీలు, బూత్‌ కమిటీలు వేయాలని చెప్పారు.

నిజానికి ఇలాంటి సలహాలు ఇచ్చే స్వయం ప్రకటిత కాపు నాయకులకు కాపు ప్రజల మద్దతే లేదు. వీరికి పది శాతం మంది మద్దతు ఉంటే, పవన్‌ కళ్యాణ్‌కు 90 శాతం మద్దతు ఉంది. ఇది జగమెరిగిన సత్యం. తనను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలనుకునే నాయకులను నమ్మవద్దని జనసేనాని ప్రకటన ద్వారా గట్టి సందేశాన్నే పంపారు. ఎన్నికలకు ఇంకా సంవత్సర కాలం ఉందనగానే ఆ సామాజికవర్గానికి స్పష్టమైన సందేశం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఆయన ఆ ప్రకటన చేసినట్లు అర్థమౌతోంది. ఎన్నికల సమయంలో ఎటువంటి గందరగోళం లేకుండా కాపు సామాజికవర్గాన్ని మానసికంగా సిద్ధం చేస్తున్నారు.

‘నన్ను తిట్టడానికి చిన్న చిన్న బుడతలను పంపిస్తూ బూతులు తిట్టిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ బుడతల్లో ఎవరినో ఒకరిని సీఎం అభ్యర్థిగా ప్రకటించండి. అప్పుడు మాట్లాడదాం’ అని పవన్‌ చాలా హుందాగా ముఖ్యమంత్రి జగన్‌కి సవాల్‌ విసిరిరారు. నిజానికి పవన్‌ కల్యాన్‌ని తిట్టడం వల్ల వైఎస్సార్సీపీకి నష్టమే జరుగుతోంది. పవన్‌పై వ్యక్తిగత దూషణలకు దిగడం వల్ల కాపులు వైఎస్సార్సీపీ నాయకులందరినీ శత్రువులుగా చూస్తున్నారు. పవన్‌ని తిడితే తమను తిట్టినట్టు భావించడమే దీనికి కారణం. గతంలో జగన్‌ని తిడితే రాజశేఖర్‌ రెడ్డిని తిట్టినట్టు ప్రజలు భావించి సానుభూతి చూపించారు. అలాగే, కేసీఆర్‌ని తిడితే తెలంగాణ వాదాన్నే తిట్టినట్టు భావించి అందరూ టీఆర్‌ఎస్‌ వైపు నిలబడ్డారు. ఈ వ్యవహారం కూడా అదే కోవాలోకి వస్తుంది.

సోషల్‌ ఇంజనీరింగ్‌

ఆంధ్రలో కాపులు, బీసీలు, దళితులకు మధ్య ఉన్న గొడవలు నాలుగు దశాబ్ధాలుగా ఉన్నాయి. వారి మధ్య సయోధ్య కుదిర్చి రాష్ట్రశ్రేయస్సు దృష్ట్యా ఒక తాటిపైకి వచ్చే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత జనసేన, టీడీపీలపై ఉంది. వివిధ సామాజికవర్గాల మధ్య ఉన్న వైరుధ్యాలను తగ్గించడానికి ఉత్తరప్రదేశ్‌లో 2007 ఎన్నికలకు ముందు బిఎస్పీ పార్టీ అవలంభించిన వ్యూహాన్ని ఉభయగోదావరి జిల్లాల్లో కూడా అమలు చేయాలి. ఉత్తరప్రదేశ్‌లో బ్రాహ్మణులకు, దళితులకు పచ్చగడ్డి వేస్తే మండుతుంది. అటువంటిది వారి మధ్య సయోధ్య కుదర్చడానికి ఎన్నో వ్యయ్రప్రయాసలతో బీఎస్పీ పార్టీ వివిధ సామాజికవర్గాలతో ఆత్మీయ సమ్మేళనాలను గ్రామాలవారీగా నిర్వహించారు. ఈ సమ్మేళనాల రూపశిల్పి సతీష్‌ చంద్ర మిశ్రా.

జనసేన, టీడీపీ కలిసి ఇలాంటి సమ్మేళనాలతో సోషల్‌ ఇంజినీరింగ్‌ చేసినప్పుడే ఫలితాలు వస్తాయి. సోషల్‌ ఇంజినీరింగ్‌ జరగాలంటే, గ్రామస్థాయిలో అన్ని కులాలు వారు కలిసేలా ఒక వేదికను రూపొందించాలి. ఉత్తరప్రదేశ్‌లో జరిగినట్టుగా సోషల్‌ ఇంజినీరింగ్‌పై అధ్యయనం జరగాలి.

పొత్తులు కొత్త కాదు

‘పులిలా ఒక్కరమే వచ్చాం.. వస్తాం’ అని వైఎస్‌ఆర్‌సిపి నేతలు పదేపదే టిడిపి, జనసేనను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. పొత్తు పెట్టుకోవడం ఏదో పాపం అయినట్టు, వీళ్లే మొదటిసారి పెట్టుకున్నట్టు రాద్దాంతం కూడా చేస్తున్నారు. 2004లో అంతగా బలంలేని కమ్యూనిస్టులను దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి స్వయానా ఆహ్వానించి పొత్తుకుదుర్చుకున్నారనే విషయాన్ని వైఎస్సార్సీపీ గుర్తెరగాలి. కమ్యూనిస్టులతో పొత్తు కోసం రెండు రోజులపాటు హైదరాబాదులోని గ్రీన్‌పార్క్‌ హోటల్లో దివంగత నేత డా.వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి కమ్యూనిస్టు నేతలతో చర్చలు జరిపి వారిని కూడా కలుపుకున్నారు. 1999-2004 మధ్యకాలంలో బలమైన టీడీపీని ఎదుర్కోవడానికి వైైఎస్సార్‌ అందరినీ కలుపుకొని ఉద్యమాలు చేశారు. ఆ మహానాయకుడి స్ఫూర్తిని కూడా వైసీపీ నాయకులు కించపరుస్తారా? కాంగ్రెస్‌పార్టీ మద్దతుతోనే 2014 లో పొత్తు పెట్టుకొనే ఆమ్‌ ఆద్మీ నేత కేజ్రీవాల్‌ మొట్టమొదటిసారిగా ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇలా అనేక పార్టీలు పొత్తులతో ఎదిగాయి. ఇదేం కొత్త కాదు. ఇన్ని మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ కూడా 2014 తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎంతో పొత్తు పెట్టుకుంది.

బీజేపీతో జతకట్టాలా?

టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేస్తామని పవన్‌ ప్రకటించారు. రాష్ట్ర శ్రేయస్సు కోసమే బీజేపీతో చేతులు కలుపుతున్నామని చెప్తున్నా... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువులు ధరలు, నిరుద్యోగం వంటి ప్రధాన అంశాలతో పాటు రాష్ట్ర విభజన హామీల నెరవేర్చకపోవడం వంటి అంశాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు బీజేపీపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. బీజేపీతో పొత్తు వల్ల వారిపై ఉన్న వ్యతిరేకతను టిడిపి-జనసేన పార్టీలు కూడా మోయాల్సిందే. దీంతో పాటు బీజేపీ వ్యవహార తీరుతో ముస్లిం ఓటర్లు ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పదుల అసెంబ్లీ స్థానాల్లో ముస్లింలు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. ఈ పొత్తుల్లో భాగంగా బీజేపీతో కలిసి వెళ్లాలా? లేదా అన్నది ఇరుపార్టీలు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ప్రాథమిక అధ్యయనాల ప్రకారం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు.

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ మండల, డివిజన్ అధ్యక్షుల సమావేశంలో నాయకులకు కార్యకర్తలను హెచ్చరించారు. పార్టీ నిబంధనావళి తప్పిన, పార్టీ అగ్రనేతలపై వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టినా గట్టి చర్యలు తీసుకుంటామని, పార్టీ నుండి సస్పెండ్‌ చేయడానికి కూడా వెనుకాడమని గట్టి సందేశాన్నే పంపారు. ఈ సందేశం ద్వారా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నాయకుల జాబితా తన వద్ద ఉన్నట్లు, కోవర్టులు ఎవరో, పార్టీకి కష్టపడి పనిచేస్తున్నది ఎవరో తనకు ఎప్పటికప్పుడు సమాచారం ఉందనే హెచ్చరికను కూడా ఆయన పంపదలుచుకున్నారు.

జనసేన పార్టీ అధినేత గత సంవత్సరకాలంగా వేస్తున్న అడుగులను నిశితంగా పరిశీలిస్తే రాజకీయాల్లో ఎంతో పరిణతి చెందటంతోపాటు ప్రతీ వ్యూహానికి ఒక లెక్క ఉన్నట్లు స్పష్టమౌతోంది. ఆయన ప్రతీ అడుగు రాష్ట్ర ప్రయోజనాలతోపాటు దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్నట్లు స్పష్టమౌతోంది. ఏ ఒక్కరిపై ఆధారపడకుండా సొంత బలంతోనే అధికార పగ్గాలు చేపట్టడంలో ఉండే తృప్తి ఒకరిని దేబరించి అందలమెక్కడంలో ఉండదని ఆయన బలంగా నమ్ముతున్నారు.

- జి.మురళికృష్ణ,

రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ

(డిస్‌క్లెయిమర్: ఈ వ్యాసంలోని విశ్లేషణలు, అభిప్రాయాలు వ్యాసకర్త వ్యక్తిగతం. హెచ్‌టీ తెలుగువి కావు)

జి.మురళీకృష్ణ, రీసెర్చర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్
జి.మురళీకృష్ణ, రీసెర్చర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్
WhatsApp channel