Pawan Kalyan Comments : 'హిందీ' వద్దంటే ఎలా అంటూ పవన్ ప్రశ్నలు...! ప్రకాశ్ రాజ్ కౌంటర్-janasena chief pawan kalyan slams tamil leaders over hindi row actor prakash raj react on pawan comments ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pawan Kalyan Comments : 'హిందీ' వద్దంటే ఎలా అంటూ పవన్ ప్రశ్నలు...! ప్రకాశ్ రాజ్ కౌంటర్

Pawan Kalyan Comments : 'హిందీ' వద్దంటే ఎలా అంటూ పవన్ ప్రశ్నలు...! ప్రకాశ్ రాజ్ కౌంటర్

తమిళ సినిమాలు హిందీలో డబ్బింగ్ చేయకండి అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు. హిందీ భాషను మాపై రుద్దకండి అని చెప్పడం… ఇంకో భాషను ద్వేషించడం కాదంటూ కౌంటర్ ఇచ్చారు.

పవన్ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ రియాక్షన్

జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హిందీ భాషాపై కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం అంటే సమాజంలో అందరికీ మేలు జరగాలని కోరుకోవడమే అని చెప్పారు. దేశంలో బహు భాషలు అవసరం ఉందన్న ఆయన… ఉత్తరాది, దక్షిణాది అని పదేపదే మాట్లాడటం సబబు కాదని స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై చర్చ అవసరం ఉందని… దేశాన్ని ముక్కలు చేసే ఆలోచనలు తప్పు అన్నారు. సెక్యూలరిజం పేరుతో ఒక్కోక్కరికి ఒక్కో న్యాయం అంటే ఎలా..? అని ప్రశ్నించారు.

హిందీలో డబ్బింగ్‌ చేయెద్దు కదా…? పవన్ కల్యాణ్

ఈ సందర్భంగా తమిళనాడు నేతలను ఉద్దేశిస్తూ… పవన్ కల్యాణ్ పలు ప్రశ్నలు సంధించారు. “తమిళనాడులో సంస్కృతాన్ని తిడుతున్నారు. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటూ మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు తమిళ సినిమాలను హిందీలో డబ్బింగ్‌ చేయెద్దు కదా…? మీకు డబ్బులేమో ఉత్తరాధి రాష్ట్రాల నుంచి కావాలా…? హిందీ మాత్రం వద్దా..? ఇదేం న్యాయం….? భాషల్ని ద్వేషించాల్సిన అవసరం లేదు” అని పవన్ కామెంట్స్ చేశారు.

“ఏ రాష్ట్రంలోని ముస్లింలైనా అరబిక్‌లోనే ప్రార్థిస్తారు. కానీ ఎన్నడూ ఆ భాష తమకొద్దనేే మాటే అనరు. హిందువులు మాత్రం దేవాలయాల్లో సంస్కృత మంత్రాలు చదవొద్దంటారు. అందుకే ముస్లింలను చూసి హిందువులు నేర్చుకోవాలి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య తగ్గిపోతుందంటూ ప్రకటనలు చేస్తున్నవారు…. నిజంగా అవి తగ్గుతాయో లేదో చర్చకు పెట్టాలి” అంటూ పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రకాశ్ రాజ్ కౌంటర్…!

ప్రస్తుతం దేశంలో డిలిమిటేషన్ తో పాటు హిందీ భాషాపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయితే పవన్ వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు.

"మీ హిందీ భాషను మా మీద రుద్దకండి, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు. స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం’, అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి please.." అంటూ ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇచ్చారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం