Pawan Kalyan : జనసేన విలీనం ఉండదు .. సీఎం పదవిపై నేను, చంద్రబాబు నిర్ణయిస్తాం - పవన్ కల్యాణ్
Janasena Vizag Meeting: 2024 ఎన్నికల్లో జగన్ ఘోరంగా ఓడిపోతారని జోస్యం చెప్పారు పవన్ కల్యాణ్. మార్పు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. సీఎం ఎవరనేది టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి నిర్ణయిస్తామని పవన్ కామెంట్స్ చేశారు..
JanaSena Public Meeting At Visakhapatnam: మేం ఎవరికీ బీ పార్టీ కాదని చెప్పారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. నన్ను నేను తగ్గించుకునైనా మిమ్మల్ని పెంచడానికి సిద్ధమని ప్రకటించారు. గురువారం విశాఖలోని ఎస్.రాజా గ్రౌండ్‌లో నిర్వహించిన జనసేన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. ఏపీ అభివృద్ధికి అలయన్స్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. 2024లో ఏపీ భవిష్యత్తు బంగారు మయం చేయాలని… అదే నా లక్ష్యమని చెప్పుకొచ్చారు. జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు బలమైన ఓట్లతో గెలిపించగలిగితే మన కోరిక తీరుతుందన్నారు. జనసేన, టీడీపీని గెలిపించాలని.. మరో సారి వైసీపీ వైపు చూస్తే నష్టమే అని వ్యాఖ్యానించారు. సీఎం ఎవరు అనేది చంద్రబాబు, నేను కూర్చుని నిర్ణయం తీసుకుంటామన్నారు.
విశాఖ ఉక్కు అంశం భావోద్వేగంతో కూడిన అంశమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జీవితంలో ఎన్నో అపజయాలు ఎదుర్కొన్నా, ఏం జరిగినా జనసేనను మరో పార్టీలో విలీనం చేయనని ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు అంశం భావోద్వేగంతో కూడిన అంశమని అన్నారు. ఇదే విషయాన్ని కేంద్రంలోని పెద్దలకు సైతం చెప్పినట్లు పవన్ తెలిపారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే ఎలాంటి భావోద్వేగాలకు దారి తీస్తుందో తెలియదన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ పోరాటం.. అన్ని జిల్లాలను ఏకం చేసిన నినాదం అని.. ప్రైవేటీకరణ కాకుండా ప్రయత్నం చేయగలిగామన్నారు.
వలసలు ఆగాలి : పవన్
“అధికారం కోసం ఓట్లు అడగను. మార్పు కోసం ఓట్లు అడుగుతా. ఉత్తరాంధ్ర చైతన్యం ఉన్న నేల. అందరినీ ఆహ్వానించే నేల. ఉత్తరాంధ్ర ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగాలి. ఇక్కడే ఉపాధి అవకాశాలు ఉండాలి. కష్టం వస్తే ఆదుకుంటామని చెప్పేందుకే జాలర్లను ఆదుకున్నా. పదవుల కోసం నేను ఎప్పుడూ ఆలోచించలేదు. మీ ప్రేమ, అభిమానంతోనే పార్టీని నడపగలుగుతున్నా. ఉత్తరాంధ్రలో కాలుష్యం బాగా తగ్గాలి. ఉత్తరాంధ్రలోని 24 బీసీ కులాలను తెలంగాణలో గుర్తించడం లేదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇక్కడి వైసీపీ నేతలు ఎందుకు అడగలేదు? ఉత్తరాంధ్ర ప్రజలకు వైసీపీ నేతలు నష్టం చేస్తున్నారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ (డీసీ) లాభాలో బాటలో ఉందంటే నేను చేసిన కృషే కారణం. స్టీల్ ప్లాంట్ గురించి ఒక్కరు మాట్లాడటం లేదు. జనసేనకు అండగా నిలబడితే స్టీల్ ప్లాంట్ కోసం నేను పోరాటం చేస్తా. ఏ అధికారం లేని నేనే ఇంత చేస్తుంటే.. వైకాపా నేతలు ఎంత చేయాలి?. జనసేనకు ఒక్క ఎంపీ ఉంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనులు తెచ్చే వాడిని” అని పవన్ కల్యాణ్ వివరించారు.
“సమర్థులైన పోలీసు అధికారులను నియమించి శాంతిభద్రతలు కాపాడుతాం. బాధ్యతగా మాట్లాడేవారు ఉంటేనే వ్యవస్థలు సరిగా పనిచేస్తాయి. గెలిచిన అన్ని చోట్లా విజయం సాధిస్తేనే మనం బాగా సేవ చేయగలం. రాష్ట్రంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలి. విడిపోయిన రాష్ట్రానికి మేలు జరుగుతుందనే 2014లో భాజపాకు మద్దతిచ్చా. వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించాల్సి ఉంది. సీఎం ఎవరనేది నేను టీడీపీ అధినేత చంద్రబాబు కలిసి నిర్ణయిస్తాం” అని పవన్ వ్యాఖ్యానించారు.