Pawan Kalyan Tweets : గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌పై పవన్ వరుస ట్వీట్లు.
Pawan Kalyan Tweets విశాఖ పట్నం వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లు చేశారు. పెట్టుబడిదారుల సదస్సు విజయవంతం కావాలని అకాంక్షిస్తూనే రాష్ట్ర ప్రభుత్వానికి పరోక్షంగా చురకలు వేశారు.
Pawan Kalyan Tweets విశాఖపట్నం పెట్టుబడిదారుల సదస్సు నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చురకలు వేసేలా పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు.

దేశవిదేశాల నుంచి ప్రకృతి అందాలతో అలరారే విశాఖ నగరానికి వస్తున్న పెట్టుబడిదారులందరికీ జనసేన స్వాగతం పలుకుతోందని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. శక్తివంతమైన, అనుభవం కలిగిన ఆంధ్రప్రదేశ్ యువత మిమ్మల్ని మెప్పిస్తారని భావిస్తున్నానని పవన్ పేర్కొన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి మంచి భవిష్యత్తు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
యువతకు ఉపాధిని అందించే అవకాశాలు కల్పించడంతో పాటు ఇన్వెస్టర్లు కూడా తమ పెట్టుబడులకు తగిన ప్రతిఫలం పొందుతారని ఆశిస్తున్నారని పవన్ పేర్కొన్నారు. పవన్ ట్వీట్లలో వైసీపీ ప్రభుత్వానికి తన హృదయపూర్వక విన్నపం అంటూ మరికొన్ని ట్వీట్లు చేశారు.
ఏపీలో ఆర్థికవృద్ధికి ఉన్న అవకాశాలు, శక్తివంతమైన మానవ వనరులు, ఖనిజ సంపద, సముద్రతీరం వంటి వాటిని ఇన్వెస్టర్లకు సవివరంగా వివరించాలన్నారు. రివర్స్ టెండరింగ్, మధ్యవర్తుల కమీషన్లు వంటి అడ్డంకులు ఏవీ లేకుండా పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించాలని సూచించారు. సమ్మిట్ ఆలోచనలను కేవలం వైజాగ్‌కే పరిమితం చేయొద్దని తిరుపతి, అమరావతి, అనంతపురం, కాకినాడ, శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడప.. ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రాంతాలలో ఉన్న అభివృద్ధి అవకాశాలను కూడా ఇన్వెస్టర్లకు వివరించాలన్నారు.
పెట్టుబడులను కేవలం ఒక నగరానికే పరిమితం చేయకుండా ఏపీ మొత్తానికి నిజమైన ఇన్వెస్టర్ల సమ్మిట్ లాగా మార్చాలన్నారు. రానున్న రెండు రోజుల్లో ప్రభుత్వంపై జనసేన ఎలాంటి విమర్శలకు చోటివ్వదని పవన్ పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల సమ్మిట్ విషయంలో ప్రభుత్వం ఎటువంటి రాజకీయ విమర్శలు చేయమని చెప్పారు. పెట్టుబడుల ఆకర్షణ అంశంలో ప్రభుత్వానికి సంపూర్ధ మద్దతును అందిస్తామన్నారు. ఇన్వెస్టర్ల సమ్మిట్ సందర్భంగా ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు ట్వీట్ చేసిన పవన్ రాజకీయం కంటే రాష్ట్రం మిన్న అని పేర్కొన్నారు.