Telugu News  /  Andhra Pradesh  /  Janasena Chief Called For Backward Classes Unity In Andhra Pradesh
తూర్పు కాపుల సమావేశంలో పవన్ కళ్యాణ్
తూర్పు కాపుల సమావేశంలో పవన్ కళ్యాణ్

Pawan Kalyan : బీసీల చేతుల్లోనే ఏపీ భవిష్యత్, ఓట్లు చీలనివ్వొద్దు…పవన్ కళ్యాణ్

27 November 2022, 6:58 ISTHT Telugu Desk
27 November 2022, 6:58 IST

Pawan Kalyan బీసీలు ఐక్యంగా ఉంటే రాష్ట్ర భవిష్యత్‌ను శాసించేది వారే నని, రాజకీయ చైతన్యంతో... ఒకరిని ప్రాధేయపడే పరిస్థితిని మార్చాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ సూచించారు. కులానికో పదవి, రూ. 75 వేల జీతం ఇచ్చి నోరు మూయిస్తున్నారుని పవన్ విమర్శించారు. కులంలో కొంతమంది చెంచాలు, కుల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారన్నారు. బీసీల్లో ఐక్యత లోపిస్తే కొంతమంది వ్యక్తుల సమూహానికి లొంగాల్సి ఉంటుందని, తూర్పు కాపుల సమావేశంలో పవన్ కళ్యాణ్‌ చెప్పారు.

Pawan Kalyan రాష్ట్రంలో కులాలను వాడుకొని నాయకులు ఎదుగుతున్నారు తప్ప... కులాలు మాత్రం వెనకబడిపోతున్నాయని, ప్రతి కులంలోనూ ఈ సమస్య ఉందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సంఖ్యా బలం లేని కులాలు ఎంత ఐక్యతగా ఉంటాయో, సంఖ్యా బలం ఉన్న కులాలు కూడా అంతే ఐక్యతతో ఉంటే భవిష్యత్తులో రాష్ట్రం వారి చేతిలో ఉంటుందని అన్నారు. బీసీ కులాలకు ఒకొక్క దానికి ఒక్కో కార్పొరేషన్లు పెట్టి కులానికో పదవి, రూ. 75 వేలు జీతం పడేస్తే కులం మొత్తం మారు మాట్లాడకుండా ఉంటుందన్న భావన మారాలని, హక్కుల కోసం దేహీ అనే పరిస్థితి నుంచి హక్కులు సాధించుకునే పరిస్థితికి బీసీలు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

తూర్పు కాపు సంక్షేమ సంఘం నాయకులతో సమావేశమైన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “కులం, మతం, ప్రాంతాలను ఉద్దేశించి మాట్లాడాలంటే ఏ రాజకీయ పార్టీకైనా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని, ఒక మాట అటు ఇటు మాట్లాడితే ఇంకొకరిని బాధపెట్టినట్టు అయిపోతుందన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏ నాయకుడికైనా కులం, మతం, ప్రాంతం అనే విషయాలు భయపడకుండా మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేయను కాబట్టి సామాజిక రుగ్మతలను సోషల్ డాక్టర్ మాదిరి చూస్తానన్నారు.

*వైసీపీ నాయకులు ఏం చేశారు….

ఉత్తరాంధ్రలో అత్యధిక జనాభా ఉన్న సామాజిక వర్గాల్లో తూర్పు కాపు ఒకటని, ఉత్తరాంధ్ర వలస కూలీల్లో ఎక్కువ మంది వాళ్లే ఉంటారని చెప్పారు. ఒక ఎం.పి., ఒక మంత్రి, ఐదుగురు ఎమ్మెల్యేలు ఆ సామాజిక వర్గం నుంచి చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 46 లక్షల మంది సంఖ్యాబలం ఉండి కూడా సమస్యల తీర్చండి అని ప్రాధేయపడటం బాధాకరమన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో బీసీ జాబితాలో ఉన్న 26 కులాలను తెలంగాణలో తీసేశారని, అలా తీసేసిన రెండు నెలలకు తూర్పు కాపులు నా దగ్గరకు వచ్చారు. మాకు అన్యాయం జరిగిందని చెప్పారు. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో తీసేశారు. అధికారం చేతిలో ఉంటే ఎంతో కొంత చేయగలం. అది లేనప్పుడు కేవలం అప్పీల్ మాత్రమే చేయగలనన్నారు. వైసీపీ నాయకులకు తూర్పు కాపులు మద్దతు పలికారని, లేకపోతే అంత మెజారిటీ వచ్చేది కాదని, తూర్పు కాపులు ఒక బలమైన ఓటు శాతం వేశారని, అయినా తెలంగాణలో 26 కులాలను బీసీల్లో ఉంచమని కూడా చెప్పలేదని విమర్శించారు. ఉత్తరాంధ్రలో తూర్పు కాపులకు ఓబీసీ రిజర్వేషన్ అమలు చేయడం లేదని ఆరోపించారు.

ప్రతి కులంలో చెంచాలు ఉంటారని, స్వలాభం కోసం కుల ప్రయోజనాలను పణంగా పెడతారని విమర్శించారు. 2024 ఎన్నికల తరువాత ఇలాంటి మీటింగ్స్ మళ్లీ జరగకూడదన్నారు. ఇప్పుడు పోరాడకపోతే జీవితాంతం కొందరి మోచేతి నీళ్లు తాగుతూ బతకాల్సిన పరిస్థితి దాపురిస్తుందని, కలిసి కట్టుగా ఒక నిర్ణయం తీసుకోవాలని, కుల ప్రయోజనాలను కాపాడే నాయకులను ముందుకు నిలబెట్టాలన్నారు. వాళ్లను డబ్బు లేకపోయినా ఫర్వాలేదని, సమస్యలపై నిలబడే సత్తా ఉండే నాయకులను నిలబెట్టాలని సూచించారు. మీరు నాయకత్వం పెంచుకోకపోతే కొద్దిమంది వ్యక్తుల సమూహానికి లొంగాల్సి ఉంటుందన్నారు.

బొత్సగారి పరిస్థితే అలా ఉంటే మీ పరిస్థితి ఏంటి?

రాష్ట్రంలో ఒక మంత్రితో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలు తూర్పుకాపుల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నా ఏ ఒక్కరు కూడా మీ సమస్యను పరిష్కరించే పరిస్థితి లేదని పవన్ కళ్యాణ్‌ చెప్పారు. మంత్రి అయిన బొత్స సత్యనారాయణ కూడా సమస్యలను అధినాయకత్వానికి చెప్పడం తప్ప చేసేది ఏమీ లేదన్నారు. ఆయన పరిస్థితే అలా ఉంటే ఇక మీ పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవాలన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవాలని మీ సమస్యల పరిష్కారానికి జనసేన అండగా నిలబడుతుందని మనస్ఫూర్తిగా నమ్మితే జనసేన పార్టీకి ఓటు వేయాలన్నారు.

తాను శ్రీకాకుళంలో పర్యటించలేదని, ఉద్ధానం సమస్య గురించి తెలీదు అన్నట్లు ముఖ్యమంత్రి అజ్ఞానంతో మాట్లాడుతున్నారని, ఆయన కోడి కత్తి డ్రామాలు ఆడుతున్నప్పుడు తాను ఉద్ధానంలో తిరుగుతున్నానని చెప్పారు. తెలియకపోతే తెలుసుకొని మాట్లాడాలన్నారు. ఉద్ధానం సమస్యను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో కృషి చేశానని, నిజంగా కిడ్నీ బాధితుల పట్ల ప్రేమ ఉంటే... ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలన్నారు. తియ్యని అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మోసం చేయనని ఒక్క సినిమాను ఆపడానికి వాళ్లు యంత్రాంగాన్ని అంతా ఉపయోగించినప్పుడు, తూర్పు కాపులకు ఓబీసీ సర్టిపికేట్ ఇవ్వడానికి యంత్రాగాన్ని వాడకూడదన్నారు.

టాపిక్