ఆవిర్భావం, పోరాటం నుంచి అధికారం వరకు.. జనసేన ప్రయాణంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. 2014లో పురుడు పోసుకున్న జనసేన.. ఇవాళ ఘనంగా 12వ ఆవిర్భావ సభ నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంది. పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం ప్రజల సంక్షమంలో జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు ఈ సభకు పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. జనసేన జయకేతనం సభకు భారీగా ఏర్పాట్లు చేశారు.
250 మంది కూర్చునేలా సభా వేదిక, ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ప్రాంగణ ప్రధాన ద్వారాలకు మహనీయుల పేర్లు పెట్టారు. సభా ప్రాంగణంలో 15 ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు. సభకు 1,700 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. 70 సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో పర్యవేక్షణ చేస్తున్నారు. చిత్రాడ పరిసరాల్లో 9 చోట్ల పార్కింగ్ సదుపాయం కల్పించారు.
జనసేన సభ కారణంగా పిఠాపురంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. కాకినాడ రూరల్ అచ్చంపేట నుంచి.. శంఖవరం మండలం కత్తిపూడి వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎస్పీ బిందుమాధవ్ పర్యవేక్షణలో.. భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తూ ఏర్పాట్లు చేశారు.
రాత్రి 11 గంటల వరకు వేడుకలు ఉండడంతో.. కాకినాడ గ్రామీణం అచ్చెంపేట కూడలి-పిఠాపురం-కత్తిపూడి మార్గంలో ట్రాఫిక్‌ను మళ్లించారు. కాకినాడ వైపు ఐదు, పిఠాపురం వైపు నాలుగు పార్కింగ్ ప్రాంగణాలు సిద్ధం చేశారు. పవన్ కల్యాణ్ కాకినాడలోనే రాత్రి బస చేస్తారు. భరతనాట్యం, వేణుగానం, కలరియపట్టు ప్రదర్శన, ప్రాచీన వ్యాయామ క్రీడ మలఖంబ్ తదితరాలు ఆకర్షణగా నిలవనున్నాయి. జనసేన పోరాటాలు, అందుకున్న విజయాలను దృశ్యరూపంలో ప్రదర్శిస్తారు. ఇదే క్రమంలో నాయకుల ప్రసంగాలు సాగుతాయి.
పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి విజయం సాధించిన జనసేన.. నేడు ప్రభుత్వంలో భాగస్వామ్యమైన తర్వాత తొలి ఆవిర్భావ సభను నిర్వహిస్తోంది. పిఠాపురం నుంచి గెలిచిన పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో వస్తుండడంతో ప్రత్యేకత సంతరించుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిశానిర్దేశం, భవిష్యత్తు కార్యాచరణపై జనసైనికులు ఆసక్తిగా చూస్తున్నారు.