CM Jagan In Palnadu: ఏపీలో బీజేపీ అండ దండలు అవసరం లేదన్న సిఎం జగన్
CM Jagan In Palnadu: ప్రత్యర్థుల మాదిరి మీడియా సహకారం, దత్తపుత్రుడి సహాయసహకారాలు, బీజేపీ అండదండలు తనకు లేవన్నారు సిఎం జగన్మోహన్ రెడ్డి.. వారి అవసరం తనకు లేదని, దేవుని ఆశీస్సులు, ప్రజల చల్లని దీవెనలను మాత్రమే తాను నమ్ముకున్నానని పల్నాడు జిల్లా క్రోసూరు సభలో చెప్పారు.
CM Jagan In Palnadu: ఏపీలో నాలుగేళ్లలో విద్యారంగం మీద రూ.60,329కోట్లు ఖర్చు చేసినట్లు సిఎం జగన్ చెప్పారు. విద్యా రంగంలో సంస్కరణలు, పథకాల అమలు కోసమే ఈ డబ్బును వినియోగించినట్లు సిఎం జగన్ వివరించారు. పిల్లల భవిష్యత్తు కోసమే ఖర్చుకు వెనకాడకుండా పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. విద్యా రంగంలో వచ్చిన మార్పుల్లో తేడాలను గమనించాలని, గత ప్రభుత్వానికి, ఇప్పటికి ఉన్న మార్పును గమనించాలన్నారు.
పేదలు, పేదపిల్లలు, పేద కుటుంబాలు చదువుకుంటే బాబుకు గిట్టదని, ఇంగ్లీష్ మీడియంలో చదివితే, డిజిటల్ బోధన అందుబాటులోకి వస్తే, దానిని తట్టుకోలేని మనస్తత్వం చంద్రబాబుది అన్నారు. చంద్రబాబుది అన్ని విషయాల్లో ఇదే వ్యవహారమని ఆరోపించారు. చంద్రబాబు ఎప్పుడూ పేదలు బాగుపడకూడదనే దుర్బుద్ధితోొ ఉంటారని, పెత్తందారి మనస్తత్వంతో బాబు ఉంటారని, వారు పేదలకు వ్యతిరేకమని ఆరోపించారు.
చంద్రబాబు పేదలకు ఎప్పుడు వ్యతిరేకమనే సంగతి గుర్తుంచుకోవాలని సిఎం జగన్ సూచించారు. గతంలో చంద్రబాబు ఎన్నికల్లో వాగ్ధానాలు చేసి, ఎన్నికల తర్వాత మోసం చేయడం తప్ప ఏమి చేయలేదన్నారు. రైతుల్ని కూడా అలాగే వాగ్దానాలు చేసి, తర్వాత మోసం చేశాడన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు,ఓసీల్లో నిరుపేదలను వాగ్ధానాలిచ్చి మోసం మాత్రమే చేశాడన్నారు.
చంద్రబాబు బతుకే మోసం, అబద్దమని సిఎం జగన్ ఆరోపించారు. బాబు పేదలకు వ్యతిరేకమనే సంగతి ప్రజలు మరిచిపోరన్నారు. 14ఏళ్లు ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా, చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క సంక్షేమం గుర్తుకు రాదని, ఏ ఒక్క మంచి గుర్తుకు రాదన్నారు. చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోటు, మోసం, కుట్ర, దగా మాత్రమే గుర్తుకు వస్తాయన్నారు.
14ఏళ్లు గాడిదలు కాశారా…?
చంద్రబాబుకు గజదొంగలముఠా, దుష్ట చతుష్టయం మాత్రమే అండగా ఉన్నారని, రాష్ట్రంలో పేదలు ఎవరు ఆయనతో లేరన్నారు. టీడీపీ దుకాణం మూసేయడానికి సిద్దంగా ఉందని, పక్క రాష్ట్రంలో మ్యానిపెస్టో తెచ్చి బిసిబిళ్ల బాత్ వండుతున్నారని ఎద్దేవా చేశారు, తాము ఏపీలో అమలు చేస్తున్న పథకాలను కిచిడి చేసి పులిహార వండుతున్నాడని విమర్శించారు. ముఖ్యమంత్రి అయిన 28ఏళ్ల తర్వాత.. 14ఏళ్లు సిఎంగా పని చేసిన బాబు, రాయలసీమ డిక్లరేషన్ అని చెబుతున్నాడని, 14ఏళ్లు ఏమి గాడిదలు కాశాడన్నారు. ఇప్పుడు బిసిడిక్లరేషన్, ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్ అని మొదలు పెట్టాడని, 14ఏళ్ల తర్వాత గ్యాస్ సిలిండర్ డిక్లరేషన్ అంటున్నాడని 14ఏళ్లు ఏమి గాడిదలు కాశాడని ప్రశ్నించారు.
14ఏళ్ల తర్వాత మరోసారి అవకాశం అంటూ మోసంచేస్తున్నాడని,కొత్త డ్రామాలు ప్రజలు నమ్మొద్దని సూచించారు. ఇంటికి కేజీ బంగారం, బెంజి కారు అని కూడా చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మరోసారి మోసాలు ఆపుతారని ప్రజలు ఆశించాలని, చంద్రబాబు బతుకంతా వాగ్ధానాలు, వెన్నుపోట్లు, ఎన్నికల్లో వాగ్ధానాలు, వెన్నుపోట్లు మాత్రమే బాబు సైకిల్ చక్రాలయ్యాయన్నారు.
ఏపీలో జరుగుతున్న యుద్ధం బాబు పెత్తందారి భావజాలానికి, పేదలకు మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. దోచుకో పంచుకో తినుకో విధానానికి, రూ.2.16లక్షల కోట్లను లంచాలు వివక్ష లేకుండా పంచిన వారికి మధ్య యుద్దం జరుగుతోందన్నారు.
సామాజిక అన్యాయానికి, సామాజిక న్యాయానికి జరుగుతున్న యుద్ధం అని, గతంలో ఇదే బడ్జెట్‌లో చేసిన స్కాములకు, వైసీపీ అందిస్తున్న స్కీములకు మధ్య జరుగుతున్న యుద్ధం అన్నారు. ఎల్లో మీడియా విష ప్రచారాలకు, ఇంటింటికి కల్పించిన మంచి పనులకు మధ్య యుద్ధం అన్నారు. ఈ కురుక్షేత్ర మహా సంగ్రామం, పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతోందన్నారు.
తనకు బాబు మాదిరి దత్తపుత్రుడి అండదండలు లేవని, జగన్‌కు బీజేపీ అండగా ఉండకపోవచ్చని, జగన్ వీళ్లెవరిని నమ్ముకోలేదని దేవుని ఆశీస్సులు, ప్రజల చల్లని దీవెనలు మాత్రమే నమ్ముకున్నానని చెప్పారు. ప్రజలకు చేసిన మంచిని మాత్రమే నమ్ముకున్నానని, దుష్ప్రచారాలు నమ్మొద్దని, ఇంట్లో మంచి జరిగిందో లేదో మాత్రమే పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఇంట్లో మంచి జరిగితే మీరే సైనికుల్లా నిలవాలని కోరారు.