Ys jagan Defeat: చుట్టూ భజన బృందాన్ని పెట్టుకుని ప్రభుత్వ వ్యతిరేకత గుర్తించ లేకపోయామంటున్న వైసీపీ
Ys jagan Defeat: ఐదేళ్లు చుట్టూ భజన బృందాన్ని పెట్టుకుని, చుట్టూ ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధుల్ని కూడా కలవకుండా కళ్లకు గంతలు కట్టుకున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రజల్లో వ్యతిరేకత గుర్తించ లేకపోయామని నిట్టూరుస్తున్నారు.
Ys jagan Defeat: 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలతో రికార్డు స్థాయిలో విజయాన్ని దక్కించుకున్న వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. రాష్ట్రంలో 87శాతం జనాభా సంక్షేమాన్ని అందించామని, రూ.2.70లక్షల కోట్ల రుపాయల్ని ప్రజలకు పంచిపెటామని ప్రతి ఇంట్లో మంచి జరిగిందని భావిస్తేనే ఓటు వేయాలంటూ ఎన్నికలకు వెళ్ళారు. చేసిన మంచి పనులే తనని గెలిపిస్తాయని నమ్మకం పెట్టుకున్నారు. ఎన్నికల ఫలితాల్లో మాత్రం బొక్క బోర్లా పడ్డారు.
మరోవైపు వైసీపీ పాలనపై ప్రభుత్వ వ్యతిరేకత ఈ స్థాయిలో ఉందని గుర్తించ లేకపోయామని వైసీపీ నేతలు తీరిగ్గా విశ్లేషిస్తున్నారు. గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డికి క్షేత్ర స్థాయిలో జరుగుతున్న దానికి పూర్తి భిన్నమైన సమాచారాన్ని ఆయన చుట్టూ చేరిన వారు అందించారు. గతంలో చంద్రబాబును ఆర్టీజిఎస్ అభిప్రాయ సేకరణ పేరిట కొంప ముంచినట్టే జగన్‌ను కూడా కొందరు వ్యక్తిగత సిబ్బంది, అధికారులు పూర్తిగా తప్పుదోవ పట్టించారు.
నవరత్నాలు, పేదలందరికీ సంక్షేమం పేరుతో జగన్ ప్రభుత్వం అమలు చేసిన పథకాల ద్వారా పేదలు, గ్రామీణ ప్రజలు, మహిళలు భారీగా లబ్ది పొందారని జగన్ భావించారు. దీనికి తోడు క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు అందే నివేదికలు పూర్తి సానుకూలంగా ఉండేవి. ముఖ్యమంత్రి చుట్టూ ఉన్న అధికారులు కూడా ఆయన మనసెరిగి ప్రవర్తించేవారు. రూల్స్ గురించి మాట్లాడేవారు, నిబంధనల్ని ప్రస్తావించే వారిని పూర్తిగా పక్కన పెట్టేయడంతో అధికారులు కూడా ముఖ్యమంత్రి ప్రాపకం కోసం ఆ సంగతి మర్చిపోయారు.
కీలక పోస్టింగ్‌లు దక్కాలంటే జగన్ భజన చేయడమే ముఖ్యమనే కిటుకు పట్టేశారు. దీంతో ఒకప్పుడు చంద్రబాబును నిండా ముంచిన అధికారుల్లో కొందరు మళ్లీ జగన్ పంచన చేరి పబ్బం గడిపేశారు. అవినీతి ఆరోపణలతో జైలు పాలైన వాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటే వారికి కీలక పదవులు కట్టబెట్టేశారు. దీంతో ఎక్కడ దొరికితే అక్కడ దోచేసినా చూసి చూడనట్టు వ్యవహరించారు.
గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రి కళ్లు చెవులుగా పనిచేసిన వ్యక్తిగత సిబ్బంది కూడా జగన్ కళ్లకు గంతలు కట్టడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఐదేళ్లలో రెండు మూడు సార్లు తప్ప మీడియాతో మాట్లాడాల్సిన అవసరమే లేదనుకునేలా జగన్‌ను తీసుకెళ్లారు. మీడియా మొత్తం వైసీపీకి వ్యతిరేకం, సోషల్ మీడియా ఉంటే చాలని జగన్‌ను నమ్మించారు. ముఖ్యమంత్రిని ప్రశ్నించి సమాధానాలు రాబట్టే విధానాలకు పూర్తిగా స్వస్తి పలికారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువగా సిఎం కార్యాలయం పెత్తనం సాగించింది. ప్రభుత్వ విధానాలకు వివరణలు, సందేహ నివృత్తి అనే ప్రక్రియను పూర్తిగా పక్కన పెట్టేసింది. సోషల్ మీడియా ప్రచారం, ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు, దాడులతో నోళ్లు మూయించే ప్రయత్నాలు జరిగాయి. కోవిడ్ ఆంక్షలు తొలగిన తర్వాత తప్పుడు సర్వేలతో మళ్లీ అధికారం మనదేనంటూ ఊదరగొట్టారు. ఈ సర్వేలు వాటి శాస్త్రీయత, వాటిని నిర్వహించే వారి వ్యవహార శైలిపై విమర్శలు వచ్చినా జగన్ ఏనాడు ఖాతరు చేయలేదు.
ఇక సిఎంఓలో రెండు కులాల మధ్య చివరి వరకు వర్గ పోరు నడిచింది. ఆధిప్యతం సిఎంఓపై పట్టుకోసం రెండు సామాజిక వర్గాలకు చెందిన అధికారులు, కన్సల్టెంట్లు, వ్యక్తిగత సిబ్బంది పోటీలు పడి జగన్ ఓటమికి కారణం అయ్యారు. ఐదేళ్లలో జగన్ వన్ వే కమ్యూనికేష్ మాత్రమే అమలు చేశారు.
చివరకు ఎవరైనా పేపర్‌పై రాసిస్తే మాత్రమే మాట్లాడే స్థాయికి వెళ్లిపోయారు. వేల కిలోమీటర్ల పాదయాత్రల్లో పాల్గొన జనంతో మమేకమై గెలిచిన జగన్ చివరకు బహిరంగ సభలు మొదలుకుని అధికారులతో సమీక్షల వరకు ప్రతి సందర్భంలో తాము రాసినది మాత్రమే మాట్లాడేలా జగన్‌ను కొందరు కట్టడి చేశారు. ఆయన మాట్లాడిన మాటల్లో కూడా వంద ఎడిటింగ్‌లు చేసి కానీ విడుదల చేయని పరిస్థితికి తెచ్చారు.
జగన్ చుట్టూ దడి కట్టేసి ఆయనతో నేరుగా ఎవరు కలవకుండా, ఆయనకు నేరుగా ఎలాంటి సమాచారం తెలియకుండా జాగ్రత్త పడ్డారు. జగన్ చూసేది, వినేది మొత్తం ఆయనకు నచ్చినట్టే ఉండేలా వ్యవహరించేవారు. ఇంటెలిజెన్స్ నివేదికలు మొదలుకుని పార్టీ కోసం ఏర్పాటు చేసుకున్న పొలిటికల్ కన్సల్టెంట్ల వరకు అంతా ఇదే బాటలో సాగారు. శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకు ఒకే తరహాలో ప్రభుత్వాన్ని జనం మూకుమ్మడిగా దించేయాలనే స్థాయికి కసి పెంచేలా చేయడంలో ఆయన చుట్టూ ఉన్న కోటరీ కీలక పాత్ర పోషించింది.
ఎన్నికల్లో ఓటమి తర్వాత కారణాలను విశ్లేషించుకుంటున్న జగన్ ఇప్పటికీ తన కళ్లకు కప్పిన తెరల్ని తొలగించుకునే ప్రయత్నాలు చేయడం లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా నలుగురైదుగురికి తప్ప మంత్రులు, ప్రజా ప్రతినిధులకు కూడా పార్టీ తరపున అభిప్రాయాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ స్వతంత్రం ఉండేది కాదు. తాడేపల్లి నుంచి వచ్చిన స్క్రిప్ట్‌లో అక్షరం తేడా వచ్చినా మంత్రులకైనా చివాట్లు తప్పేవి కాదని గుర్తు చేస్తున్నారు.
తాడేపల్లి క్యాంపుల్లో గ్రూపులుగా చీలిపోయిన నాయకులు తమ వర్గం వారికి ఒక రకంగా మరో వర్గాన్ని మరోలా చూసే వారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. జగన్ మీద వ్యతిరేకతకు విస్తృత ప్రచారం లభించడానికి కూడా వీరే కారణం అయ్యారు. చివరకు జగన్ దగ్గర పనిచేసే ప్రజా సంబంధాల సిబ్బంది కూడా తమను తాము ముఖ్యమంత్రి కంటే అధికులుగా భావించే స్థాయిలో అధికారం చెలాయించారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఇంకో ఐదేళ్లు ఇదే తరహా తంతు నడుస్తుందనే భావన ప్రజల్లోకి వెళ్లడంతో జనం ఎన్నికల్లో ఆ పార్టీకి చెక్ పెట్టేశారు.
సంబంధిత కథనం