Jagan on CBN And Pawan: చంద్రబాబు నెల రోజులు రాష్ట్రంలో ఉన్నది ఇప్పుడేనన్న జగన్-jagan said that chandrababu has been in the state for a month only now ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Jagan On Cbn And Pawan: చంద్రబాబు నెల రోజులు రాష్ట్రంలో ఉన్నది ఇప్పుడేనన్న జగన్

Jagan on CBN And Pawan: చంద్రబాబు నెల రోజులు రాష్ట్రంలో ఉన్నది ఇప్పుడేనన్న జగన్

Sarath chandra.B HT Telugu
Oct 12, 2023 01:12 PM IST

Jagan on CBN And Pawan: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో 52నెలల్లో ఏకబిగిన నెలరోజుల పాటు నివాసం ఉన్నది రాజమండ్రిలో మాత్రమేనని సిఎం జగన్ ఎద్దేవా చేశారు. బాబు, పవన్‌, లోకేష‌‌, బాలకృష్ణల శాశ్వత నివాసాలు హైదరాబాద్‌లోనే అని అంతా గుర్తించాలని సామర్లకోటలో అన్నారు.

సామర్లకోటలో సిఎం జగన్
సామర్లకోటలో సిఎం జగన్

Jagan on CBN And Pawan: ఏపీలో గత 52నెలల్లో చంద్రబాబు నిరంతరంగా నెల రోజుల పాటైనా రాష్ట్రంలో కనిపించారా అని సిఎం జగన్ ప్రశ్నించారు. సామర్లకోట సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో జగన్ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఐదేళ్లలో కేవలం ఇప్పుడు మాత్రమే రాజమండ్రిలో కనిపిస్తున్నారని, గతంలో ఎప్పుడూ ఇలా కనిపించలేదని ఇప్పుడు మాత్రమే రాష్ట్రంలో ఉన్నారన్నారు.

రాష్ట్ర ప్రజలంతా దీనిపై ఆలోచించాలని, ఆంధ్ర రాష్ట్రంపై చంద్రబాబును సమర్ధించే వారిపై ప్రేమ ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబును సమర్ధించే వారు ఎవరు రాష్ట్రంలో నివాసం ఉండరని, బాబుతో పాటు అతని పార్టనర్‌ కూడా రాష్ట్రంలో ఉండరని, బాబు కొడుకు, బామ్మర్ది కూడా రాష్ట్రంలో ఉండరన్నారు.

గజ దొంగల ముఠాలో భాగస్వాములైనప రామోజీరావు, రాధాకృష్ణ, నాయుడు వంటి వారు రాష్ట్రంలో ఉండరన్నారు. వీరికి ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రా ప్రజలు దోచుకుని హైదరాబాద్‌లో పంచుకోడానికి కావాలన్నరు. అదే వారికి ఏపీ మీద ఉన్న ప్రేమ అన్నారు. ఇవన్నీ నిజాలు అవునో కాదో ప్రజలు ఆలోచించాలన్నారు.

కుప్పంలో 20వేల ఇళ్ల పట్టాలు…

పేదలకు సాయం చేయడానికి తపన పడుతుంటే, గతంలో చంద్రబాబు పాలనలో ఇలాంటివి ఎప్పుడు కనిపించ లేదన్నారు. చంద్రబాబు పాలనలో పేదలకు ఒక్క సెంటు స్థలం కూడా ఇచ్చిన పాపాన పోలేదన్నారు. ఈ విషయంలో తేడా గమనించాలని కోరారు. చంద్రబాబును చూస్తే స్కాములు మాత్రమే గుర్తుకు వస్తాయని ఆరోపించారు. జగన్ ముఖం చూస్తే స్కీములు గుర్తుకు వస్తాయన్నారు. చంద్రబాబు ముఖం చూస్తే లంచాలు, జన్మభూమి కమిటీలు, వెన్నుపోట్లు, పెత్తందారి అహంకారం గుర్తుకు వస్తుందని, జగన్ ముఖం చూస్తే చిక్కటి చిరునవ్వు కనిపిస్తుందని లంచాలు లేని డిబిటి పాలన గుర్తుకు వస్తుందన్నారు.

చంద్రబాబుకు వేల కోట్ల సంపద ఉన్నా, తాను ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో కూడా పేదలకు సెంటు కూడా స్థలం ఇవ్వలేదన్నారు. చివరకు కుప్పంలో కూడా 20వేల ఇళ్ల పట్టాలు ఇచ్చి 8వేల ఇళ్ల నిర్మాణం తమ ప్రభుత్వం చేసిందన్నారు.

14ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు 35ఏళ్లుగా కుప్పానికి ఎమ్మెల్యేగా ఉండి, మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా, అక్కడి పేదల ముఖంలో చిర్నవ్వు కనిపించడం మాత్రం.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అన్నారు.

35ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా రాష్ట్రం మీద, కుప్పం మీద అభిమానం, బాధ్యత లేదని ఎద్దేవా చేశారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రికి రాష్ట్రంలో, కుప్పంలో ఒక్క ఇల్లు కూడా కట్టుకోలేదని విమర్శించారు. చంద్రబాబు ఇల్లు పక్క రాష్ట్రం హైదరాబాద్‌లో ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో చంద్రబాబుకు ఉన్న అనుబంధం అదన్నారు.

వారి శాశ్వత నివాసాలు అక్కడే…

బాబు దత్తపుత్రుడి గురించి అందరికి తెలుసని, దత్తపుత్రుడి శాశ్వత నివాసం హైదరాబాద్‌లో ఉంటే, ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి మూడు నాలుగేళ్లకు మారిపోతుంటారని జగన్‌ ఎద్దేవా చేశారు. ఇల్లాళ్లు ఒకసారి లోకల్, మరోసారి నేషనల్, మరోసారి ఇంటర్నేషనల్ అన్నారు. ఈసారి ఎక్కడికి పోతారో అని ప్రశ్నించారు.

ఆడవాళ్లైనా, పెళ్లిళ్ల వ్యవస్థ అన్నా పెద్దమనిషికి ఉన్న గౌరవం ఏమిటో అందరికి తెలిసన్నారు. మన పెళ్లిళ్లను గౌరవించకుండా, మూడు నాలుగేళ్లకు ఇల్లాళ్లను మారుస్తుంటే, ఆడవారి మీద చులకన భావం చూపిస్తే ఎలాంటి నాయకులో ఆలోచించాలన్నారు.

ప్యాకేజీ స్టార్ మన రాష్ట్ర విషయంలో కూడా అలాగే ఉంటారని, భీమవరం, గాజువాకలో అనుబంధం లేదని ఆ నియోజక వర్గాలను తన పనిముట్లుగా చూసి వాడి పారేసేవిగా భావిస్తారన్నారు. తన అభిమానుల ఓట్లను హోల్‌సేల్‌గా అమ్ముకోడానికి అప్పడప్పుడు వచ్చి పోతుంటాన్నారు.

సరుకులు, సరంజామా అమ్ముకున్నట్లు సొంత పార్టీని, సొంత వర్గాన్ని అమ్ముకునే వ్యాపారిని ఇక్కడే చూస్తున్నామన్నారు. రెండు షూటింగ్‌ల మధ్య విరామంలో వచ్చి వ్యాపారం చేస్తుంటాడని, విలువలు లేని వ్యక్తికి రాష్ట్రమైనా, ప్రజలైనా, కాపులైనా ఏమి ప్రేమ ఉంటుందన్నారు. దీని గురించి అంతా ఆలోచించాలన్నారు.

ఏపీకి మంచి చేయాలని కాకుండా దోచుకోవడానికి, దోచుకున్న దానిని హైదరాబాద్‌లో పంచుకోడానికి మాత్రమే వారి ఆలోచనలన్నారు. రాష్ట్రం మీద ప్రేమ లేని వారు, రాష్ట్రంలో ఎక్కడా కనిపించని వారంతా అనుక్షణం ఏపీ గురించి మాట్లాడుతుంటారని, బాబు అధికారం పోయేసరికి ఫ్యూజులు పోయాయని చెప్పారు. వారి ఆదాయాలు పోవడంతో ఫ్యూజులు పోయాయన్నారు.

ఆంధ్రాతో ఉన్న సంబంధం ఏమిటి?

బాబును సమర్ధించే వారికి ఆంధ్రా ప్రజలు, మట్టితో ఏ రకమైన బంధం లేదని, వారంతా కేవలం వ్యాపారం చేస్తారని, ఎస్సీలను నా ఎస్సీలని చెప్పుకోలేరని, బీసీ, మైనార్టీలను తమ వారిగా చెప్పుకోరని, చివరకు కాపుల్ని కూడా తమ వారిగా చెప్పుకోలేరని ఆరోపించారు.

బాబు మద్దతు దారులకు పేదలను నా వాళ్లుగా చెప్పుకునే ధైర్యం లేదని, ప్రేమ, అభిమానం, బాధ్యత చూపించ లేరని, ఎస్సీ కులాల్లో ఎవరైనా చూడగలరా అని అవహేళన చేస్తారని, బీసీల తోకలు కత్తిరిస్తామంటారని, పేదలకు ఇళ్ల స్థలాలు వద్దంటారని, ఇంటి స్థలాల మధ్య కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని చెబుతారని, రైతుల గురించి, మహిళలు, అవ్వా తాతల గురించి పట్టదని ఆరోపించారు.

అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎంత మంచి చేసినా మంటలు పెట్టి చలి కాచుకోవాలని చూస్తారని, వారి మనిషి అధికారంలో ఉంటే ఎన్ని దుర్మార్గాలు చేసినా వారిని సమర్థిస్తారని ఆరోపించారు. ఈ గడ్డ మీద లేని వారందరికి, రాష్ట్రం మీద మమకారం లేని వారికి అరడజను టీవీ ఛానళ్లు, రెండు పేపర్లు, ఎల్లో సోషల్ మీడియా, దత్తపుత్రుడు అండగా ఉన్నారని ఆరోపించారు.

ఇలాంటి రాజకీయాలు సమర్ధించవచ్చా అని ప్రశ్నించారు. రాజకీయాలంటే విలువలు విశ్వసనీయత ఉండాలన్నారు. చనిపోయిన తర్వాత కూడా బతకాలనే తపన తాపత్రయంతో అడుగులు వేయాలన్నారు. చెప్పింది చేస్తాడనే నమ్మకం ఉండాలన్నారు. కష్టం వచ్చినా, నష్టం వచ్చిన నిలబడతాడనే విలువలు, విశ‌్వసనీయత వారికి ఉన్నాయా అని ప్రశ్నించారు. 52నెలల్లో ఏమి చేసిందో ఎక్కడికి వెళ్లినా స్పష్టంగా కనిపిస్తుందన్నారు.

52నెలల్లో 99శాతం వాగ్దానాలను నెరవర్చినట్టు చెప్పారు. రాష్ట్రంలో 87శాతం ఇళ్లకు సంక్షేమ పథకాలను ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా పంపుతున్నట్టు చెప్పారు. ఎక్కడా లంచాలు వివక్ష లేకుండా విప్లవాత్మక మార్పులతో అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి సంక్షేమాన్ని తమ ప్రభుత్వం అందిస్తోందని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు.

Whats_app_banner