Gottipati On Jagan: విద్యుత్ ఛార్జీల పాపం జగన్‌దే.. ట్రూ అప్ ఛార్జీలపై వైసీపీ,టీడీపీ పరస్పర విమర్శలు
Gottipati On Jagan: ఏపీలో విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీల వసూళ్లపై వైసీపీ, టీడీపీల మధ్య పరస్పర మాటల యుద్ధం నడుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నిరసనలకు పిలుపునివ్వడాన్ని టీడీపీ తప్పు పడుతోంది. విద్యుత్ సర్దుబాటు ఛార్జీలకు జగన్మోహన్ రెడ్డే కారణమని టీడీపీ ఆరోపిస్తోంది.
Gottipati On Jagan: ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుదల, ట్రూ అప్ ఛార్జీల పేరుతో వసూళ్లను నిరసిస్తూ వైసీపీ ఆందోళనలకు పిలుపునివ్వడంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదన జగన్ రెడ్డి హయాంలోనే జరిగిందని ఆరోపించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే చార్జీలను పెంచాలని డిస్కంలు ఈఆర్సీని కోరాయని, 10 సార్లు విద్యుత్ చార్జీలు పెంచిన వైసీపీకి ధర్నా చేసే నైతిక హక్కు లేదని మండిపడ్డారు.
ఏపీలో 2022-24 మధ్య కాలంలో ప్రజలు వినియోగించిన విద్యుత్ బిల్లుల సర్దుబాటు ఛార్జీల పేరుతో రూ15వేల కోట్లను ప్రజల నుంచి వసూలు చేయాలనే నిర్ణయంపై వైసీపీ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది.దీనిని టీడీపీ తప్పు పడుతోంది.
తుగ్లక్ చర్యల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో మైలురాయిని దాటారని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. జగన్ తాను పెంచిన విద్యుత్ చార్జీలపై తానే ధర్నాకు పిలుపునిచ్చారని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన షాక్ కు అయినా జగన్ రెడ్డి కోలుకుంటారు అనుకుంటే.. ఇంకా అదే పంథాలో కొనసాగుతున్నారని పేర్కొన్నారు.
2019 లో తెలుగుదేశం పార్టీ అధికారంలో కోల్పోనాటికి రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా జగన్ మోహన్ రెడ్డికి అప్పగిస్తే... ఐదేళ్లలో అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడని విమర్శించారు. ప్రజల సొమ్మును అప్పనంగా తన వారికి దోచిపెట్టేందుకు జగన్ రెడ్డి విద్యుత్ లోటును సృష్టించినట్లు చెప్పారు. పీఏలను రద్దు చేయడంతో పాటు సోలార్, విండ్ పెట్టుబడిదారులను బెదిరించి వారిని రాష్ట్రం నుంచి వెళ్లగొట్టి... 10 వేల మెగా వాట్ల పునరుత్పాదక విద్యుత్ ను రాష్ట్రం కోల్పోయేలా చేశారని స్పష్టం చేశారు.
విద్యుత్ ఉత్పత్తికి మారుపేరు అయిన ఏపీ జెన్కో ను జగన్ మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆరోపించారు. ప్రజల విద్యుత్ అవసరాలు అనే పేరు చెప్పి విచ్చల విడిగా విజయసాయి రెడ్డి అండ్ కో నుంచి అధిక రేట్లకు విద్యుత్ కొనుగోలు చేసి విద్యుత్ రంగ నాశనానికి పునాది వేశారన్నారు. యూనిట్ ధర రూ. 5కు అందుబాటులో ఉన్నా కానీ కమీషన్ల కోసం బహిరంగ మార్కెట్ లో యూనిట్ ను రూ. 8 నుంచి రూ. 14 వరకు జగన్ బ్యాచ్ కొనుగోలు చేసిందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విమర్శించారు.
విద్యుత్ చార్జీల పెంపుకు కేవలం జగన్ రెడ్డి అవినీతి, కక్ష సాధింపు, స్వార్థ రాజకీయాలే కారణమని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి చేసిన పాపాలే ప్రస్తుతం ప్రజలకు శాపాలుగా మారి ఇంధన సర్దుబాటు చార్జీల రూపంలో ప్రజలపై భారంగా మారాయని తెలిపారు.
అధికారంలో ఉన్నప్పుడు ఎడాపెడా విద్యుత్ కొనుగోళ్లు జరిపి ఆ భారాన్ని ప్రజలపై వేయాలని అధికారంలో ఉన్నప్పుడే జగన్ రెడ్డి ఈఆర్సీని కోరారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ గుర్తు చేశారు.
YCP అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా 2021-2022 కి APERC ఆమోదించిన True- Up Charges రూ. 3,082 కోట్లను జగన్ రెడ్డి హయాంలోనే వసూలు చేశారని, తరువాత 2022-2023 కి APERC ఆమోదించిన True- Up Charges రూ. 6,073 కోట్లను, 2023-2024 కి APERC ఆమోదించిన True- Up Charges రూ. 9,412 కోట్లను జగన్ రెడ్డి హయాంలోనే ప్రజలపై విధించాల్సి ఉండగా... ఎన్నికల ముందు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని వాయిదాల పర్వంతో కమిషన్ రద్దు అయ్యే వారం ముందు ఆమోదం తెలిపినట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వివరించారు.
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతిపాదించిన విద్యుత్ చార్జీల పెంపు పై ఆ పార్టీ నాయకులు ధర్నాలు చేయాలని జగన్ పిలుపునివ్వడం తుగ్లక్ చర్య కాదా అని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీల భారం తగ్గిస్తామని చెప్పిన కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని వసూలు చేయడం ఏమిటని వైసీపీ ప్రశ్నిస్తోంది.
ఏపీలో గత కొన్నేళ్లుగా విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో అసలు బిల్లుల కంటే అధికంగా వసూలు చేయడం రివాజుగా మారింది. వాస్తవ వినియోగం కంటే గతంలో చేసిన వినియోగానికి సంబంధించిన ట్రూ అప్ ఛార్జీలను ప్రజలు బిల్లుల్లో చెల్లిస్తున్నారు. కొన్ని సార్లు ప్రస్తుత బిల్లు కంటే గతంలో వినియోగించిన దానికి చెల్లించే మొత్తమే అధికంగా ఉంటోంది.