Jagan Strategy : కొత్త స్ట్రాటజీతో ముందుకెళ్తున్న జగన్.. తక్కువ అంచనా వేస్తే అంతే సంగతులు!-jagan is moving forward with a new strategy in ap politics ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Jagan Strategy : కొత్త స్ట్రాటజీతో ముందుకెళ్తున్న జగన్.. తక్కువ అంచనా వేస్తే అంతే సంగతులు!

Jagan Strategy : కొత్త స్ట్రాటజీతో ముందుకెళ్తున్న జగన్.. తక్కువ అంచనా వేస్తే అంతే సంగతులు!

Basani Shiva Kumar HT Telugu
Sep 14, 2024 12:08 AM IST

Jagan Strategy : రాజకీయాల్లో జగన్‌లా ఆలోచించడం వేరేవారికి సాధ్యం కాదు. ఇదే మాట ఆయన రాజకీయ ప్రత్యర్థులు, సొంత పార్టీ నేతలు కూడా చెబుతుంటారు. చంద్రబాబు అనేక సందర్భాల్లో ఈ మాట చెప్పారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ పనైపోయిందని అంతా అనుకున్నారు. కానీ.. జగన్ కొత్త స్ట్రాటజీతో ముందడుగు వేస్తున్నారు.

కాకినాడలో వరద బాధితులతో జగన్
కాకినాడలో వరద బాధితులతో జగన్

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ సారధ్యంలోని వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది. ఎవరూ ఊహించని ఫలితాల్ని వైసీపీ నేతలు చూశారు. 151 నుంచి 11 సీట్లకు వైసీపీ పడిపోయింది. దీంతో ఇక వైసీపీ పని అయిపోయింది.. ఆ పార్టీ మళ్లీ పైకి లేవడం కష్టం అని జగన్ రాజకీయ ప్రత్యర్థులు అనుకున్నట్టు వార్తలు వచ్చాయి. అటు వైసీపీ నేతలు, కేడర్ కూడా డీలా పడ్డారు. జగన్ కూడా డైలామాలో ఉన్నట్టు అనేక వార్తలు, విశ్లేషణలు వినిపించాయి.

వినుకొండ నుంచి ప్రారంభం..

ఈ నేపథ్యంలో.. ఏపీలో తాజాగా కొన్ని ఘటనలు జరిగాయి. వాటి వెనక కారణాలు ఏమున్నా.. జగన్ మాత్రం తన స్టైల్‌లో ముందడుగు వేశారు. ఓటమి నుంచి తేరుకొని ప్రజల్లోకి వెళ్లారు. ఈ క్రమంలోనే మళ్లీ వైసీపీ కేడర్, నాయకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎన్నికల తర్వాత కొందరు వైసీపీ నేతలపై దాడి జరిగింది. వాటిని ఖండించిన జగన్.. వినుకొండలో జరిగిన హత్యపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. మృతుడి కుటుబం సభ్యులను పరామర్శించేందుకు వినుకొండకు వెళ్లారు. అప్పుడు ప్రజల నుంచి ఊహించని స్పందన వచ్చింది.

ఎక్కడికి వెళ్లినా..

ఆ తర్వాత జగన్ కడప పర్యటనకు వెళ్లారు. అక్కడ కూడా భారీ సంఖ్యలో జనం కనిపించారు. అటు గన్నవరం ఎయిర్‌పోర్ట్, బెంగళూరు ఎయిర్‌పోర్ట్.. ఇలా ఎక్కడికి వెళ్లినా జగన్‌ను చూడటానికి జనం భారీగా తరలివస్తున్నారు. ఇటీవల విజయవాడలో వరదలు సంభవించినప్పుడు జగన్ పర్యటించిన ప్రాంతంలోనూ జనాలు ఎక్కువగానే కనిపించారు. తాజాగా కాకినాడ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోనూ జగన్ పర్యటించారు. అక్కడా ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఎన్నికల సభలకు వచ్చినట్టు ప్రజలు వస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.

వైసీపీకి మళ్లీ ఊపిరి..

జగన్ వెళ్లిన దగ్గరకు భారీ సంఖ్యలో ప్రజలు రావడంతో.. వైసీపీకి ఊపిరి పోసినట్టు అవుతోంది. వైసీపీ కేడర్‌కు ధైర్యం వస్తోంది. ఈ నేపథ్యంలో.. చాలా మంది నేతలు ఇప్పటికే వైసీపీ గోడ దూకుదామనే ప్లాన్‌లో ఉన్నారు. అలాంటి వారు ఈ క్రేజ్ చూసి ఆగిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. 'మళ్లీ మనం నిలబడతాం.. మళ్లీ గెలవగలుతాం' అనే కాన్ఫిడెన్స్ పెరుగుతోందని వైసీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే 'హిందుస్తాన్ టైమ్స్‌' ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు. జగన్‌కు ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి.. వైసీపీలో కొత్త చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో ఏదో జరిగిందనే అనుమానం కలుగుతోందని ఏలూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు చెప్పారు.

కొత్త స్ట్రాటజీతో..

ప్రజా స్పందన ఇలాగే ఉంటే.. వేరే పార్టీలోకి వెళ్లడం వేస్ట్ అనే అభిప్రాయంలో ఉన్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే.. ఎన్నికల ఫలితాలు వచ్చాక కొన్ని రోజులు జగన్ కూడా డైలమాలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ స్థాయిలో ఓటమి పాలయ్యాక జగన్‌ను వైసీపీని ప్రజలు పట్టించుకుంటారా అని నేతల్లో అనుమానం ఉండేది. కానీ.. తాజాగా ప్రజల నుంచి వస్తున్న స్పందన చూశాక ఆ అభిప్రాయం మారుతోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూశాక.. జగన్ కూడా కొత్త స్ట్రాటజీతో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా జగన్ కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.

లైట్ తీసుకుంటే అంతే సంగతులు..

2019 ఎన్నికలకు ముందు జగన్‌ను చంద్రబాబు లైట్‌గా తీసుకున్నారు. దాని ఫలితం 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది. ఇప్పుడు కూడా కూటమికి భారీ విజయం దక్కడంతో.. జగన్‌ను లైట్‌గా తీసుకుంటున్నట్టు కనిపిస్తోందని కొందరు టీడీపీ నేతలు చెబుతున్నారు. జగన్‌ను లైట్‌గా తీసుకుంటే.. ఇక తమ పార్టీ సంగతి అంతేనని ఓ టీడీపీ నేత వ్యాఖ్యానించారు.