అమరావతి నిర్మాణంలో అంతులేని అవినీతి.. విజయవాడ-గుంటూరు మధ్యలో రాజధాని భవనాలు కట్టాలన్న వైఎస్‌ జగన్‌-jagan endless corruption in amaravati construction imposing unlimited burden on public in the name of capital ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  అమరావతి నిర్మాణంలో అంతులేని అవినీతి.. విజయవాడ-గుంటూరు మధ్యలో రాజధాని భవనాలు కట్టాలన్న వైఎస్‌ జగన్‌

అమరావతి నిర్మాణంలో అంతులేని అవినీతి.. విజయవాడ-గుంటూరు మధ్యలో రాజధాని భవనాలు కట్టాలన్న వైఎస్‌ జగన్‌

Sarath Chandra.B HT Telugu

అమరావతి నిర్మాణం పేరుతో ఏపీలో భారీ అవినీతి జరుగుతోందని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ ఆరోపించారు. బినామీలకు లబ్ది చేయడానికే అమరావతి పేరుతో వేల కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారని, తెలంగాణలో 616కోట్లతో సచివాలయం నిర్మిస్తే ఏపీలో రూ.4వేల కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారని ఆరోపించారు.

అమరావతి పనులపై జగన్‌ తీవ్ర విమర్శలు

ఏపీలో అమరావతి పేరుతో భారీ కుంభకోణం జరుగుతోందని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఆరోపించారు. తెలంగాణలో సచివాలయ భవనాన్ని రూ.600కోట్లతో కేసీఆర్‌ నిర్మిస్తే.. ఏపీలో 12వేల మంది ఉద్యోగులకు అవసరమైన సచివాలయం ఇప్పటికే ఉండగా మరో భవనాన్ని రూ.4వేల కోట్లతో నిర్మించాల్సిన అవసరం ఏమిటన్నారు. రాజధానికి అవసరమైన భవనాలను 500ఎకరాల్లో విజయవాడ-గుంటూరు మధ్యలో కట్టాలని డిమాండ్ చేశారు.

అమరావతి దోపిడీ…

స్కాముల్లో పరాకాష్టగా అమరావతి పేరుతో దోపిడి జరుగుతోందని జగన్‌ ఆరోపించారు. అమరావతి కోసం 2018లో టెండర్లు పిలిచారని అప్పుడు రూ. 41,170 కోట్ల పనుల్లో 2019 నాటికి రూ. 5,587కోట్లు పనులు పూర్తి అయ్యాయని, 35,583 కోట్ల పనులు మిగిలి ఉన్నాయని, ఇప్పుడు మళ్లీ ఈ టెండర్లను రద్దు చేసి అంచనాలు పెంచేసి దోపిడీకి పాల్పడుతున్నారని చెప్పారు.

జ్యుడిషియల్ ప్రివ్యూను రద్దు చేసి మరీ అమరావతి టెండర్లను కట్టబెడుతున్నారని జగన్ ఆరోపించారు. రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని రద్దు చేసి కావాల్సిన వారికి పనులు కట్టబెట్టారని, అవినీతిని కొనసాగించడానికి మొబిలైజేషన్ అడ్వాన్స్ విధానాన్ని మళ్లీ తెచ్చారని, చంద్రబాబు స్కాములు తెచ్చారని, 10శాతం అడ్వాన్స్‌లో 8శాతం వారికి దక్కుతోందని చెప్పారు.

ఐకానిక్ టవర్ల పేరుతో ఐదు బిల్డింగ్‌ల నిర్మాణానికి రూ. 2271 కోట్లతో 2018లో టెండర్లు పిలిచారని, అవే భవనాల నిర్మాణంలో మిగిలి ఉన్న పనులకు రూ.4,648కోట్లకు ధరలు పెంచారని, 2018తో పోలిస్తే రూ.2,417 కోట్లతో 105 శాతం ధరల్ని పెంచారని ఆరోపించారు. అమరావతిలో భవనాలకు చదరపు అడుగు రూ.8931 రుపాయలు ఖర్చు చేస్తున్నారని ఇంత ఖర్చు ఎక్కడా ఉండదన్నారు.

ఇప్పటికే సచివాలయం, అసెంబ్లీ భవనాలు..

వెలగపూడిలో సచివాలయం, అసెంబ్లీ భవనాలు ఆరు భవనాల్లో 6లక్షల చదరపు అడుగుల్లో ఉన్నాయని, అవి ఉండగానే కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ , హెచ్‌ఓడి ఆఫీసులు కోసం 53,57,389 చదరపు అడుగుల విస్తీర్ణంతో టెండర్లు పిలిచారని, సచివాలయం, హెచ్‌ఓడిల్లో మొత్తం ఉద్యోగులు 12వేల మంది కూడా ఉండరని, వారంతా ఆరు లక్షల అడుగుల కార్యాలయాల్లో పనిచేస్తున్నారని, ఎక్కువ విస్తీర్ణంలో భవనాలు కట్టినా ఉద్యోగుల సంఖ్య పెద్దగా మారదని, ఆ భవనాలు ఎందుకు కడుతున్నారని ప్రశ్నించారు.

అమరావతి నిరంతరం కొనసాగాలని, నిరంతరం పనులు చేసి, నిరంతరం బిల్లులు చెల్లించి వారి నుంచి ముడుపులు తీసుకోవడమే చంద్రబాబు లక్ష్యమన్నారు.

తెలంగాణలో రూ.616 కోట్లతో నిర్మాణం

తెలంగాణలో 8.58లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.616 కోట్లతో సెక్రటేరియట్‌, హెచ్‌ఓడిలు అన్నింటిని ఒకే చోట చేర్చారని, ఏపీలో 53లక్షల చదరపు అడుగులు ఎందుకో చెప్పాలన్నారు. రూ.300కోట్లతో నిర్మించిన వెలగపూడి సచివాలయం, రూ.173 కోట్లతో కట్టిన అసెంబ్లీ, రూ.173కోట్లతో కట్టిన హైకోర్టులకు రూ.600కోట్లు వృధా అవుతాయని జగన్ ఆరోపించారు.

అప్పులు తీసుకొచ్చి ప్రజల మీద అప్పుల భారం మోపడం తప్ప ఏముందన్నారు. అమరావతిలో నిర్మాణాలకు చదరపు అడుగుకు రూ.5,900 చెల్లిస్తున్నారని, చదరపు అడుగుకు రూ.4వేలు ఖర్చు చేస్తే ఫైవ్‌ స్టార్‌ స్థాయి సదుపాయాలు వస్తాయని, ఇటాలియన్‌ మార్బుల్‌ నుంచి అత్యద్భుతమైన ఇంటీరియర్‌ కావాలంటే రూ.4వేలకే హైదరాబాద్, బెంగుళూరులో లగ్జరీ ఫ్లాట్లు వస్తాయన్నారు. రెట్టింపుకంటే ఎక్కువ ధర అమరావతిలో చెల్లిస్తున్నారన్నారు.

రోడ్ల నిర్మాణంలో అవినీతి…

అమరావతిలో నాలుగు లేన్ల రహదారుల నిర్మాణానికి కిలో మీటర్‌కు రూ.11-12కోట్ల మించదని, నాలుగు లేన్‌ అంటే 50మీటర్ల వెడల్పు రోడ్లకు రూ.50కోట్లు చొప్పున ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.

అమరావతిలో చంద్రబాబు స్కాములు చేసి లంచాలు తీసుకుంటూ చంద్రబాబుకు దొరికిపోతే ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ నోటీసులు ఇచ్చిందని అమరావతిలో అవినీతికి ఇదే నిదర్శనం అన్నారు.

అమరావతి కోసం ఏడీబీ రూ.15వేల కోట్ల అప్పు, జర్మనీ నుంచి రూ.5వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11వేల కోట్లు, సీఆర్‌డిఏ నుంచి రూ. 20వేల కోట్లు కలిపి రూ. 52వేల కోట్లు అప్పులు చేశారని, బడ్జెట్‌లో మరో రూ6వేల కోట్లను కేటాయించారని, అమరావతి కోసం చేసే ఖర్చు ఎన్ని లక్షల కోట్లు అవసరం అవుతాయని ప్రశ్నించరు. 50వేల ఎకరాలకు రూ.77వేల కోట్లు ఖర్చయితే, ఇంకో 50వేల ఎకరాల ఇంకెన్ని కోట్లు కావాలని ప్రశ్నించారు.

విజయవాడ-గుంటూరు మధ్య కట్టండి..

ఇన్ని అప్పులు తెచ్చి, ఇన్ని స్కాములు చేసే బదులు, సొంత లాభాన్ని, బినామీల ఆస్తులు పెంచుకోవడం బదులు విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని కోసం 500ఎకరాల్లో కట్టాల్సిన భవనాలు కట్టేయాలని, క్రమంగా విజయవాడ-గుంటూరు కలిసిపోతాయన్నారు. విజయవాడ-గుంటూరు మధ్య రియల్‌ ఎస్టేట్‌ ఇప్పటికే డమాల్ అందని ఆరోపించారు.

తమ హయంలో విజయవాడ - మచిలీపట్నం మధ్య రియల్ ఎస్టేట్ పడుకుందని జగన్‌ విమర్శించారు. అప్పులు తెచ్చి స్కాములు చేయడం ఏమిటని, బినామీలకు లబ్ది చేయడానికి రాష్ట్రం మీద అప్పుల భారం మోపడం ఏమిటన్నారు.

బాబు గ్రాఫిక్ పడిపోయింది…

12నెలల్లో చంద్రబాబు గ్రాఫ్‌ దారుణంగా పడిపోయిందని, ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోయిందని, నెలకో డైవర్షన్ పాలిటిక్స్‌ చేస్తున్నారని, స్కాముల్లో భాగంగా ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని ఆరోపించారు.

ఏపీలో కుంభకోణాలు యథేచ్ఛగా సాగుతున్నాయని విశాఖపట్నంలో ఉర్సా అనే సంస్థకు రూ.3వేల కోట్ల రుపాయల భూములు కట్టబెడుతున్నారని ఆరోపించారు. లులూ సంస్థకు రూ.2వేల కోట్ల రుపాయల భూములు అప్పగిస్తున్నారని ఆరోపించారు. అప్పనంగా భూముల కట్టబెడుతున్నారని జగన్‌ ఆరోపించారు.

లిక్కర్‌ మాఫియా, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, క్వార్ట్జ్‌, మైనింగ్ స్కాములు యథేచ్ఛగా సాగుతున్నాయని చెప్పారు. తాము అధికారంలో ఉండగా చివర్లో 80లక్షల టన్నుల ఇసుక స్టాక్‌ పెట్టామని, చంద్రబాబు ప్రభుత్వం రావడమే రెండు నెలల్లోనే దానిని మాయం చేసేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఇసుకపై ఏటా రూ.750కోట్ల ఆదాయం వచ్చేదని ఇప్పుడు రుపాయి కూడా రావడం లేదన్నారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం