Ys Jagan: చంద్రబాబు మోసాలను ఎండగట్టి, ప్రజలకు వివరించాలని వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
Ys Jagan: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మోసాలను ఎండగట్టి ప్రజలకు వాటిని వివరించాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ పార్టీ సీనియర్లకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో కొత్తగా మెడికల్ సీట్లు వద్దంటూ లేఖ రాయడం, కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చర్యల్ని ఫీజు పోరులో భాగం చేయాలని సూచించారు.
Ys Jagan: ఎన్నికల హామీల అమలును విస్మరించడంతో పాటు చంద్రబాబు వైఫల్యాలను ప్రజలకు బలంగా వివరించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ సీనియర్లకు సూచించారు. మంగళవారం వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో, పార్టీ సీనియర్ నేతలతో పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు.

రెండు వారాల లండన్ పర్యటన ముగించుకుని సోమవారం సాయంత్రం తాడేపల్లి చేరుకున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు, ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటనలు.. తదితర అంశాలు సమావేశంలో చర్చకు వచ్చాయి.
ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రచారం చేసిన సూపర్‌సిక్స్ అమలు విషయంలో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన, ఎన్నికల హామీల అమలుపై ఆయన వైఖరిని మరోసారి తేటతెల్లం చేశాయని జగన్ నేతలతో అన్నారు. సూపర్‌సిక్స్ హామీల అమలుపై చేతులెత్తేయడమే కాకుండా.. అందుకే ఏవేవో సాకులు చెబుతూ.. అవి ప్రజలు నమ్మేలా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అలా అవి ఇప్పుడు ఆచరణకు సాధ్యం కాదంటూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
ఒకవైపు హామీలను తుంగలో తొక్కడం, మరోవైపు విద్యుత్ ఛార్జీల మోత.. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సంపద సృష్టించడం తనకు తెలుసంటూ ప్రచారం చేసుకునే చంద్రబాబు.. కేవలం అప్పులతోనే కాలం వెళ్లదీయడం వంటి అంశాలను కూడా ప్రజల్లో ఎండగట్టాలని ఆయన నిర్దేశించారు. చంద్రబాబు దారుణ మోసాలను మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అందు కోసం రోజూ ప్రజల్లో ఉండాలని, వారితో మరింత మమేకం కావాలని జగన్ సూచించారు.
పేద విద్యార్థులకు నష్టం…
ఫీజు పోరుపై ఈసీ అనుమతి పెండింగ్‌లో ఉండడంతో వాయిదా వేసిన అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తూ, పేద విద్యార్థులను దారుణంగా దెబ్బ తీస్తున్నారని వైయస్ జగన్ అన్నారు. కేంద్రం వచ్చే అయిదేళ్లలో 75వేల మెడికల్ సీట్లు అదనంగా పెంచబోతోందని.. కానీ, చంద్రబాబు తమకు కొత్తగా మెడికల్ సీట్లు వద్దంటూ కేంద్రానికి లేఖ రాయడం అత్యంత దారుణమన్నారు.
పేద విద్యార్థుల పక్షాన ఈ అంశాన్ని ఫీజు పోరులో భాగం చేయాలని జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో మెడికల్ సీట్ల కుదింపు, కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని కూడా ఫీజు పోరులో భాగం చేసి, పేద విద్యార్థుల పట్ల చంద్రబాబుకు ఉన్న కక్షను ప్రజల్లో బట్టబయలు చేయాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల కోత, నిల్చిపోయిన పథకాలు, ఆరోగ్యశ్రీ ఆగిపోవడంపైనా సమావేశంలో చర్చకు వచ్చింది. 9 నెలల కూటమి పాలన, పేదల వ్యతిరేక పాలనలా జరిగిందని.. దీని వల్ల పేదలు, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ.. క్షేత్రస్థాయి అంశాలను సమావేశంలో నాయకులు పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లారు.
మున్సిపల్ ఉప ఎన్నికల్లో కూటమి పార్టీల దారుణాలపైనా సమావేశంలో చర్చించారు. ఇలాంటి అరాచకాలు ఎక్కడా చూడలేదని, మెజారిటీ లేని, అసలు ఒక్కోచోట సభ్యులే లేని వారు కూడా గెలవడానికి ఎన్నో దారుణాలు చేశారని సమావేశంలో చర్చించారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెప్తారని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు.
పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు, బొత్స సత్యనారాయణరాజు, బూడి ముత్యాలనాయుడు, జోగి రమేష్, కురసాల కన్నబాబు, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగు నాగార్జున, విడదల రజని, పార్టీ సీనియర్ నేతలు కోన రఘుపతి, ముదునూరు ప్రసాదరాజు, ఆలూరు ఎమ్మెల్యే బూసినె విరూపాక్షి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్‌బాబు, కోరుముట్ల శ్రీనివాసులు, అదీప్‌రాజ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సంబంధిత కథనం