Jagan On CBN: మహానాడు డ్రామా షోలో చంద్రబాబు అబద్దాలకు అంతే లేదన్న జగన్-jagan complained that babu is asking for one chance for power ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Jagan Complained That Babu Is Asking For One Chance For Power

Jagan On CBN: మహానాడు డ్రామా షోలో చంద్రబాబు అబద్దాలకు అంతే లేదన్న జగన్

B.S.Chandra HT Telugu
Jun 01, 2023 12:12 PM IST

Jagan On CBN:అధికారం ఎవరినైనా వెన్నుపోటు పొడవడానికి వెనుకాడని నైజం చంద్రబాబుదని ఏపీ సిఎం జగన్ ఆరోపించారు. ఎన్నికల ముందు ఆకర్షణీయమైన మ్యానిఫెస్టో అంటున్నాడని, ప్రజల్ని వెన్నుపోటు పొడవడమే చంద్రబాబు పొలిటికల్ ఫిలాసఫీ అని సిఎం జగన్ ఆరోపించారు. బాబు బతుకే కాపీ, మోసం అని మండిపడ్డారు.

సీఎం జగన్
సీఎం జగన్

Jagan On CBN: విపక్షాల విమర్శలు ఆరోపణలు, దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మోద్దని రైతులతో పాటు అన్ని వర్గాల మంచి చేస్తున్న ప్రభుత్వానికి శత్రువు చంద్రబాబు నాయుడు అన్నారు.

ట్రెండింగ్ వార్తలు

రైతుకు ఉచిత విద్యుత్ ఇస్తే, కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలని చంద్రబాబు గతంలో ఎద్దేవా చేశారని, తొలి సంతకంతో వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని, బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తానని చెప్పి 2014ఎన్నికల్లో జనాన్ని నిలువున ముంచారని ఆరోపించారు.

రాజమండ్రిలో చంద్రబాబు డ్రామా కంపెనీ మాదిరి మహానాడు షో చేశాడని, 27ఏళ్ల క్రితం తానే వెన్నుపోటు పొడిచి చంపేసిన మనిషికి మళ్లీ తామే యుగపురుషుడు, శకపురుషుడు, రాముడని, కృష్ణుడని కీర్తిస్తూ ఫోటోలకు దండ వేశారన్నారు. మహానాడులో జరిగిన డ్రామాకు ముందు ఓ ప్రకటన చేశారని, దానిని చూస్తే ఆశ్చర్యం కలిగిందన్నారు.

పూతన, మారీచుడు, రావణుడు కలిస్తే చంద్రబాబు…

టీడీపీ ఆకర్షణీయమైన మ్యానిఫెస్టోను ప్రకటించారని,మ్యానిఫెస్టోను ఆకర్షణీయం అని సంబోధించడం ఏమిటని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబును చూస్తే పసిపిల్లాడైన కృష్ణుడిని చంపడానికి పూతన, బాబు మాదిరే అందమైన స్త్రీ వచ్చినట్టుందన్నారు.

మాయలేడీలా సీతమ్మ దగ్గరకు వచ్చిన మారీచుడు కూడా జ్ఞప్తికి వచ్చాడని ఎద్దేవా చేశారు. వేషం మార్చుకుని సీతమ్మ వద్దకు వచ్చిన రావణుడు కూడా చంద్రబాబును చూస్తే గుర్తొచ్చాడని, మూడు క్యారెక్టర్లు కలిపి ఏపీలో ఓ మనిషిగా జన్మించాడని, నారా చంద్రబాబు రూపంలో ఉన్నాడని విమర్శించారు.

మ్యానిఫెస్టో పేరుతో చంద్రబాబు మోసం చేస్తాడన్నారు. చంద్రబాబు సత్యం పలకడని, ధర్మానికి కట్టుబడడని, విలువలు, విశ్వసనీయత అసలే లేవని, తమ పార్టీ అధ్యక్షుడు, పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌నైనా పొడుస్తాడని, ఎన్నికలు అయ్యాక ప్రజలనైనా పొడుస్తాడన్నారు.

ప్రజల నుంచి పుట్టిన వైసీపీ మ్యానిఫెస్టో….కర్ణాటకలో టీడీపీ మ్యానిఫెస్టో

మహానాడులో ఆకర్షణీయమైన మ్యానిఫెస్టో అని చెప్పడం హాస్యస్పదమన్నారు. మ్యానిఫెస్టో మీద ఎలాంటి గౌరవం బాబుకు లేదన్నారు. బాబుకు మ్యానిఫెస్టో ఎలా తయారవుతుందో అవగాహన కూడా లేదన్నారు. వైసీపీ మ్యానిఫెస్టో పాదయాత్ర వల్ల, ప్రజల కష్టాల నడుమ, ప్రజల అకాంక్షలు, అవసరాలమధ్య వారి గుండె చప్పుడుగా పుట్టిందన్నారు.

రైతులు , ప్రజల సామాజిక వర్గాలు, వారి కష్టాలు, అవసరాల నడుమ మట్టి నుంచి మ్యానిఫెస్టో పుట్టిందన్నారు. ప్రజల కష్టాల నుంచి వైసీపీ మ్యానిఫెస్టో పుడితే , చంద్రబాబు మ్యానిఫెస్టో మాత్రం ఏపీలో పుట్టలేదని, జనంలో తిరగడు కాబట్టి కర్ణాటకలో పుట్టిందన్నారు.

బాబు మ్యానిఫెస్టో కర్ణాటకలో తయారైందని, బీజేపీ-కాంగ్రెస్‌ ఎదురు పడి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కలిపేసి బిసిబెళ్ల బాత్ వండాడని ఎద్దేవా చేశారు. వాటితో పాటు అమ్మఒడి, చేయూత, రైతు భరోసా పథకాలను కలిపి మరో పులిహార వండారన్నారు.

బాబు బతుకే కాపీ, మోసం….

మ్యానిఫెస్టో అంటూ వైఎస్సార్‌సీపీ, బీజేపీ, కాంగ్రెస్‌ పథకాలు కాపీ కొట్టారని, బాబు బతుకే కాపీ, మోసం అని ఎద్దేవా చేశారు. బాబుకుఒరిజినాలిటీ, పర్సనాలిటీ రెండూ లేవన్నారు. క్యారెక్టర్, క్రెడిబిలిటీ అసలు లేనే లేవన్నారు. పోటీ చేయడానికి 175నియోజక వర్గాల్లో 175మంది అభ్యర్థులు కూడా లేరన్నారు.

రాబోయే ఎన్నికల్లో పేదలు, దోపిడిదారులకు మధ్య యుద్దం జరుగబోతుందన్నారు. డిబిటి పథకాలకు చంద్రబాబు డిపిటి విధానాలకు మధ్య పోరాటం జరుగుతుందని విమర్శించారు. చంద్రబాబు పెత్తందారి భావజాలానికి పేదల ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతోందన్నారు.

బాబు సమావేశాలు మైదానాల్లో పెడితే జనం రారని, ఇరుకైన సందులు, గొందుల్లో సమావేశాలు పెడుతున్నారని, పొత్తుల కోసం ఎంతైనా దిగజారుతున్నారని, ఏ గడ్డైనా తింటారని, విలువలు విశ్వసనీయత లేవని మండిపడ్డారు.

జనంలో లేని పార్టీకి కావాల్సింది పొత్తులు, ఎత్తులు, చిత్తులు, కుయుక్తులు మాత్రమే కావాలన్నారు. 1995లో సిఎం అయినా 30ఏళ్ల తర్వాత కూడా ఎన్నికల్లో మరో ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నాడని జగన్ ఎద్దేవా చేశారు.

మరో ఛాన్స్ ఇవ్వాలని అడగడమే తప్ప, సిఎంగా ఉన్నపుడు రాష్ట్రానికి ఏమి చేశాడో చెప్పుకోలేక పోతున్నాడన్నారు. ప్రతి ఇంటికి డిబిటి రూపంలో చేసిన మంచి ఏమిటో బాబు చెప్పుకోలేరని, గ్రామానికి, పేదలకు, రైతులకు, మహిళలకు చేసిన మంచెమిటో చెప్పుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు.

30ఏళ్ల తర్వాత 14ఏళ్లు సిఎంగా పాలించిన తర్వాత కూడా చెప్పుకోడానికి ఒక్క మంచి కూడా లేని పాలన సాగించాడన్నారు. రాష్ట్రంలో కోటిన్నర ఇళ్ల ముందు నిలబడి చేసిన మంచి చెప్పలేని బాబు, ఇచ్చిన మాటను నెరవేర్చలేని స్థితిలో ఉన్నాడన్నారు.

మోసం మాత్రమే చేశాడు…

చంద్రబాబు ప్రజలకు చేసింది మోసం మాత్రమే అని జగన్ ఆరోపించారు. అందరిని అప్పుల పాలు చేయడం, నట్టేట ముంచడం తప్ప మరేమి చేయ లేదన్నారు. ముఖ‌్యమంత్రి మొదటి సంతకానికి క్రెడిబిలిటీ, విశ్వసనీయత ఉంటాయని, మొదటి సంతకానికి మోసంగా, వంచనగా, దగాగా మార్చిన బాబు కొత్త మోసాలతో, వాగ్ధానాలతో ముందుకు వస్తున్నాడని విమర్శించారు.

చంద్రబాబు డిక్షనరీలో మంచి చేయడమే లేదన్నారు. ధర్మంగా పోరాటాలు చేయడం, విలువలు, విశ‌్వసనీయ రాజకీయాలు చేయడం, ధైర్యంగా, ఒంటరిగా పోటీ చేసే సత్తా లేవని సిఎం జగన్‌ కర్నూలు జిల్లా పత్తికొండలో మండిపడ్డారు.

WhatsApp channel