Volunteers Issue: ఏపీలో వాలంటీర్ వ్యవస్థకు అనుమతి లేకుంటే బడ్జెట్‌లో కేటాయింపులు ఎందుకున్నాయన్న జగన్
Volunteers Issue: ఆంధ్రప్రదేశ్‌లో 2023 నుంచి వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఈ ఏడాది బడ్జెట్‌లో వాలంటీర్ల జీతాలకు రూ.277కోట్ల కేటాయింపులు ఎందుకు చేశారని జగన్ ప్రశ్నించారు. వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో వాలంటీర్లకు అన్ని హెడ్‌ల కింద అనుమతులున్నాయన్నారు.
Volunteers Issue: ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల సేవలకు ఎలాంటి అనుమతులు గుర్తింపు లేకపోతే 2024-25 వార్షిక బడ్జెట్‌లో గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్ల జీతాల కోసం రూ.277కోట్లను ఎందుకు కేటాయించారని వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రశ్నించారు. మండలిలో వాలంటీర్ల వేతనాల పెంపు ప్రశ్న ఉత్పన్నం కాదని ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మండలిలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వాలంటీర్ల గౌరవ వేతనం పెంచే ప్రశ్న ఉత్పన్నం కాదన్నారని, ఎన్నికల్లో 5వేలు కాదని రూ.10వేలు ఇస్తామన్నాడని గుర్తు చేశారు. 2019 అక్టోబర్ 2 నుంచి మొదలైందని, 2019-20లో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న వాలంటీర్లకు రూ.755.65కోట్లు చెల్లించామని, 2020-21లో రూ.1546.95కోట్లు, 2021-22లో రూ.1543.11కోట్లు, 2022-23లో 1592.92కోట్లు, 2023-24లో 1614.28కోట్లు, 2024-25లో ఏప్రిల్ మే నెల వేతనాల కోసం రూ.277.20కోట్లు చెల్లించినట్టు చెప్పారు.
వాలంటీర్లకు ఎలాంటి అనుమతి లేదని చెప్పడంపై జగన్ అభ్యంతరం తెలిపారు. గ్రామ సచివాలయాల్లో వాలంటీర్ల వేతనాల చెల్లింపుకు మేజర్ హెడ్ 2515, మైనర్ హెడ్ 198, సబ్ ఆర్డినేట్ హెడ్ 52, డిటైల్డ్ హెడ్ 290, ఆబ్జెక్ట్ హెడ్ 293 ఉన్నాయని చెప్పారు.
వార్డు సచివాలయాల్లో పనిచేసే వాలంటీర్లకు మేజర్ హెడ్ 2217 అర్బన్ డెవలప్‌మెంట్ విభాగంలో ఉందని, మైనర్ హెడ్ 198, సబార్డినేట్ హెడ్ 80, డిటైల్డ్ హెడ్ 290, ఆబ్జెక్ట్ హెడ్ 293 ఉన్నాయన్నారు.
2023 ఆగస్టు నుంచి వాలంటీర్ వ్యవస్థ లేదని చెబుతున్నారని, ప్రభుత్వంలో జీతాలు ఇవ్వాలంటే బడ్జెట్ అనుమతులు ఉండాలని, ఫైనాన్స్ అనుమతులు కావాలని, హెడ్ అకౌంట్ లేకుండా వేతనాలు ఎలా ఇస్తారని,వాలంటీర్లకు హెడ్ ఆఫ్ అకౌంట్ ఉందని గుర్తుంచుకోవాలన్నారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చే వరకు వాలంటీర్లకు హెడ్ అకౌంట్ ఉందని గుర్తు చేశారు. ఐదేళ్లు జీతాలిచ్చారని, బడ్జెట్ అనుమతులతో, ఫైనాన్స్ కన్‌కరెన్స్‌తో ఇన్నేళ్లు చెల్లించారని గుర్తు చేశారన్నారు. ఇప్పుడు వాటిని ఎగ్గొట్టి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఎవరైనా హామీల గురించి ప్రశ్నిస్తే వారిని దారుణంగా వేధిస్తున్నారని పోలీసుల్ని వాడుకుంటున్నారని అన్యాయంగా ప్రవర్తిస్తన్నారని, ఎమ్మెల్యేలతో నియోజకవర్గాల్లో ప్రైవేట్ మాఫియాను తయారు చేసి కొట్టిస్తున్నారని జగన్ ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలో 3లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2.66లక్షల వాలంటీర్ల ఉద్యోగాలు పీకేసిందని, 15వేల బేవరేజీస్ ఉద్యోగులను తొలగించారని, నేడో రేపో 104,108 ఉద్యోగాలు తీసేసిందని ఆరోపించారు.
సంబంధిత కథనం