IT Raids On Devineni Avinash: దేవినేని అవినాష్ ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు
YCP Leader Devineni Avinash News: వైసీపీ యువనేత దేవినేని అవినాష్ ఇంట్లో ఐటీ సోదాలు బుధవారం ఉదయం వరకూ కొనసాగాయి. ఆయన ఇంట్లోకి ఎవరినీ రానివ్వకుండా సీఆర్పీఎఫ్ బలగాలను గేటువద్ద కాపాల ఉంచి తనిఖీలు నిర్వహించారు. బంజారాహిల్స్‌లో ఓ భూమికి సంబంధించిన వంశీరామ్ బిల్డర్స్‌తో ఒప్పందం నేపథ్యంలో సోదాలు కొనసాగినట్లు తెలుస్తోంది.
IT raids at Devineni Avinash house: మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు, విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. మంగళవారం ఉదయం 6 గంటలకు విజయవాడలోని గుణదలలో ఆయన ఇంటికి చేరుకున్న ఐటీ అధికారులు ఇవాళ ఉదయం వరకు తనిఖీలు చేపట్టారు. లోపలకు ఎవరినీ రానీయకుండా సీఆర్పీఎఫ్ బలగాలను.. ప్రధాన గేటు వద్ద కాపలా ఉంచారు.

దేవినేని అవినాష్‌కు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ స్థలం డెవలప్‌మెంట్ కోసం వంశీరామ్ బిల్డర్స్ తీసుకుంది. ఒప్పందంలో భాగంగా జరిగిన లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్టుగా తెలిసివచ్చింది. అలాగే ఈ సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లు సీజ్ చేసినట్లు సమాచారం. పలు హార్డ్ డిస్కులు తీసుకున్నట్లు తెలుస్తోంది.
అవినాష్ ఇంటి వద్ద ఆందోళన...
సోదాల విషయం తెలుసుకున్న నగర కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అవినాష్ ఇంటికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మెయిన్ గేటు, రోడ్డుపై భారీగా గుమిగూడారు. చిన్న వయసులో నేతగా ఎదుగుతున్న అవినాష్‌పై కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రాత్రంతా వారు అక్కడే బైఠాయించారు. ఇంటి వద్దే కూర్చొని అవినాష్ కు మద్దతుగా నినాదాలు చేశారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ వంశీరామ్ బిల్డర్స్ కార్యాలయం, వెంచర్లతో పాటు ఛైర్మన్, భాగస్వామి ఇళ్లలో ఐటీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. పెద్దఎత్తున పత్రాలు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో భాగంగానే విజయవాడలో అవినాశ్ ఇంట్లోనూ సోదాలు జరిగాయి. ఐటీ శాఖకు చెందిన 25 బృందాలు విడిపోయి, ఒకేసారి బంజారాహిల్స్ లోని సంస్థ ప్రధాన కార్యాలయం, అందులోని భాగస్వామిగా ఉన్న జనార్దనరెడ్డి ఇంట్లో, నందిహిల్స్‌లోని సంస్థ చైర్మన్ సుబ్బారెడ్డి ఇంట్లో తనిఖీలు చేపట్టాయి. ఇంకొన్ని బృందాలు నగర శివార్లలోని వెంచర్లకు చేరుకున్నాయి. రాత్రి వేళా సోదాలు కొనసాగాయి.
అయితే తాజా సోదాలపై ఆదాయపు శాఖ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఏమైనా డబ్బు స్వాధీనం చేసుకున్నారా..? లేక అవినాష్ తో పాటు ఇతర వ్యక్తులకు నోటీసులు ఇచ్చిందా..? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా ఐటీ, ఈడీ సోదాలు జరుగుతుండటం ఆసక్తికరంగా మారింది.