ISRO PSLV C60 : ఇస్రో పీఎస్ఎల్వీ సీ60 ప్రయోగం విజయవంతం, స్పేస్ డాకింగ్ సాంకేతికత కలిగిన నాలుగో దేశంగా భారత్-isro pslv c60 successfully launches spadex satellites 24 payloads for space docking ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Isro Pslv C60 : ఇస్రో పీఎస్ఎల్వీ సీ60 ప్రయోగం విజయవంతం, స్పేస్ డాకింగ్ సాంకేతికత కలిగిన నాలుగో దేశంగా భారత్

ISRO PSLV C60 : ఇస్రో పీఎస్ఎల్వీ సీ60 ప్రయోగం విజయవంతం, స్పేస్ డాకింగ్ సాంకేతికత కలిగిన నాలుగో దేశంగా భారత్

ISRO PSLV C60 : పీఎస్ఎల్వీ-సీ60 ప్రయోగం విజయవంతం అయినట్లు ఇస్రో ప్రకటించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సోమవారం రాత్రి 10.15 గంటలకు వాహక నౌక ప్రయోగించినట్లు వెల్లడించింది. ఈ ప్రయోగం భారత స్పేస్ డాకింగ్ సామర్థ్యాన్ని పెంచిందని పేర్కొంది.

ఇస్రో పీఎస్ఎల్వీ సీ60 ప్రయోగం విజయవంతం, స్పేస్ డాకింగ్ సాంకేతికత కలిగిన నాలుగో దేశం భారత్

ISRO PSLV C60 : పీఎస్ఎల్వీ-సీ60 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రకటించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సోమవారం రాత్రి పీఎస్ఎల్వీ-సీ60 నింగిలోకి దూసుకెళ్లింది. సోమవారం రాత్రి 10.15 గంటలకు ఇస్రో పీఎస్ఎల్వీ సీ60 ను ప్రయోగించింది. స్పేస్‌ డాకింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌ పేరిట జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేసే ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ భవిష్యత్తులో మానవ అంతరిక్ష ప్రయాణానికి, ఉపగ్రహ సేవల మిషన్లకు కీలకమైన సాంకేతికత ఆర్బిటల్ డాకింగ్‌లో భారతదేశ సామర్థ్యాన్ని పెంచింది.

అంతరిక్షంలోనే వ్యోమనౌకలను డాకింగ్‌, అన్‌ డాకింగ్‌ చేయగల సాంకేతికత అభివృద్ధి లక్ష్యంగా ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది. పీఎస్‌ఎల్వీ వాహకనౌక ద్వారా ప్రయోగించిన రెండు చిన్న వ్యోమ నౌకలను అంతరిక్షంలోనే ఒకదానితో ఒకటి డాకింక్‌ చేయడం ఈ ప్రయోగం ప్రధాన లక్ష్యం. ఈ రెండు ఉపగ్రహాల బరువు 440 కిలోలు ఉంటుందని ఇస్రో ప్రకటించింది. భూఉపరితలం నుంచి 470 కిలోమీటర్ల ఎత్తున వృత్తాకార కక్ష్యలో 2 వ్యోమ నౌకలు ఏకకాలంలో డాకింగ్‌ చేసింది.

చంద్రుడిపై వ్యోమగామిని దించడం, మట్టిని తీసుకురావడం, సొంత అంతరిక్ష కేంద్రం నిర్మించాలన్న భారత్‌ లక్ష్యాలు సాకారం కావాలంటే, వ్యోమ నౌకల డాకింగ్‌, అన్‌ డాకింగ్‌ సాంకేతికత కీలకమని ఇస్రో పేర్కొంది. ఈ ప్రయోగం విజయం కావడంతో...స్పేస్ డాకింగ్ సాంకేతికతను కలిగిన నాలుగో దేశంగా భారత్‌ అవతరించింది. ఇప్పటికే అమెరికా, రష్యా, చైనా దేశాలు ఈ టెక్నాలజీని కలిగి ఉన్నాయి.

స్పేడెక్స్ రెండు ఉపగ్రహాలతో పాటు వివిధ పరిశోధనల కోసం 24 పేలోడ్స్ ప్రయోగించారు. వీటిలో 14 పేలోడ్స్ ఇస్రోకు చెందినవి కాగా, మరో 10 దేశంలోని వివిధ ప్రైవేట్‌ స్టార్టప్‌ కంపెనీలు, యూనివర్సిటీలకు చెందినవి. వీటిలో తెనాలికి చెందిన ఎన్‌ స్పేస్‌ టెక్‌ కంపెనీ పేలోడ్ కూడా ఉంది. ఇస్రో సహకారంలో యూహెచ్ఎఫ్ కమ్యూనికేషన్‌ మాడ్యూల్‌కు సంబంధించి స్వేచ్ఛశాట్‌-V జీరోని అంతరిక్షంలోకి పంపారు. ముంబయికి చెందిన అవిటి యూనివర్సిటీ విద్యార్థులు పాలకూర కణాలను అంతరిక్షంలోకి పంపించారు. దీంతో అంతరిక్షంలోని ప్రత్యేక పరిస్థితిల్లో మొక్కలు ఎలా పెరుగతాయో అధ్యయనం చేయనున్నారు.

2035 నాటికి ఇస్రో సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఈ ప్రయోగం ఎంతో ఊతం ఇస్తుందని తెలిపింది. 44.5 మీటర్ల పొడవైన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) రెండు స్పేస్‌క్రాఫ్ట్ ను మోసుకెళ్లిందని ఇస్రో తెలిపింది. 220 కిలోల బరువున్న ఒక్కో శాటిలైట్.. స్పేస్ డాకింగ్, శాటిలైట్ సర్వీసింగ్, ఇంటర్‌ప్లానెటరీ మిషన్‌లలో సహాయపడనున్నాయని వెల్లడించింది.

ప్రయోగం సక్సెస్

పీఎస్‌ఎల్వీ-సీ60 ప్రయోగం సక్సెస్ కావడంపై ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగంలో భాగస్వాములైన శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. పీఎస్ఎల్వీ వాహక నౌక 2 శాటిలైట్స్ ను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ప్రకటించారు. స్పేడెక్స్‌ శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టడం మిషన్‌లో తొలి భాగమని, గంట 20 నిమిషాల తర్వాత రెండో దశ ఫైరింగ్‌ ఉంటుందని వెల్లడించారు.

సంబంధిత కథనం