మన బెజవాడ నగరం భద్రమేనా.. ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటి? తప్పదు భారీ మూల్యం!-is vijayawada city be safe in case of fire accidents ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  మన బెజవాడ నగరం భద్రమేనా.. ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటి? తప్పదు భారీ మూల్యం!

మన బెజవాడ నగరం భద్రమేనా.. ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటి? తప్పదు భారీ మూల్యం!

అసలే ఇరుకు వీధులు.. నిత్యం వేలాది మందితో రద్దీగా ఉండే గల్లీలు.. కనీసం ఫైర్ ఇంజన్ కూడా వెళ్లలేని కాలనీలు.. అనుకోకుండా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే.. భారీ మూల్యం తప్పదు. ఇదీ విజయవాడ నగర పరిస్థితి. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన అగ్ని ప్రమాదం, సంభవించిన ప్రాణ నష్టంతో బెజవాడ భద్రమేనా అనే చర్చ జరుగుతోంది.

విజయవాడ

హైదరాబాద్ నగరం చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ చౌరస్తాలో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి కారణాలు ఏమైనా.. కనీసం సహాయక చర్యలు చేపట్టడానికి కూడా వీలు లేకుండా పోయింది. అందుకు కారణం.. ఇరుకు మార్గం. ఒక్కటే మెట్ల మార్గం, అది కూడా ఇరుగ్గా ఉండటంతో.. ప్రాణాలు కాపాడలేకపోయారు. సరిగ్గా ఇదే అంశంపై ఇప్పుడు విజయవాడలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

నిత్యం రద్దీగా..

విజయవాడలోని వన్ టౌన్ ఏరియాలో చాలా ప్రాంతాలు నిత్యం రద్దీగా ఉంటాయి. శివాలయం వీధి, బిసెంట్ రోడ్, మెయిన్ బజార్.. ఇలా అనేక ప్రాంతాలు ప్రజలతో కిక్కిరిసిపోతాయి. ఈ ఏరియాల్లో చాలా ఇరుకు వీధులు ఉన్నాయి. ఎదురుగా ట్రాలీ ఆటో వచ్చినా.. బైక్ కూడా వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. పైగా ఈ ప్రాంతాల్లోనే రకరకాల షాపులు ఉంటాయి. ఇలాంటి ప్రాంతాల్లో ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ప్రమాదకర పరిస్థితి..

వన్ టౌన్ లోని చాలా దుకాణాల్లో ఫైర్ సేప్టీ పరికరాలు కనిపించడం లేదు. ఇక్కడ బంగారు నగల తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఏదైనా ఘటన జరిగితే.. ఇరుకు వీధుల్లోకి కనీసం ఫైర్ ఇంజన్ కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది. బాధితులను రక్షించడం కూడా చాలా కష్టం. మరోవైపు చాలా పాత భవనాలు ఉన్నాయి. అవి ఎప్పుడు కూలుతాయో కూడా తెలియని ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అన్నీ బాగానే ఉన్నా.. ఏదైనా ఘటన జరిగితే.. భారీ నష్టం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో ప్రమాదాలు..

గతంలో విజయవాడ నగరంలో చాలా అగ్నిప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. 2020 ఆగస్టులో జరిగిన అగ్నిప్రమాదంలో.. 11 మంది మృతిచెందారు. 22 మందికి గాయాలయ్యాయి. ఎయిర్ కండీషనర్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. గతేడాది బందర్ రోడ్ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు రూ.5 కోట్ల ఆస్తి నష్టం వాటిళ్లింది. ఇవే కాకుండా.. ఎగ్జిబిషన్ గ్రౌండ్, గన్నవరం హాస్టల్.. వంటి చోట్ల ప్రమాదాలు సంభవించాయి.

ప్రభుత్వం ఏం చేయాలి..

అగ్నిప్రమాదాలు జరగకుండా ప్రభుత్వాలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. భవనాలు అగ్ని నిరోధక పదార్థాలతో నిర్మించేలా చూడాలి. ప్రతి భవనంలోనూ తప్పనిసరిగా అగ్నిమాపక వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. భవనాలలో అగ్నిమాపక వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధించాలి. అగ్నిప్రమాదాల నివారణ, సంభవించినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. పాఠశాలలు, కార్యాలయాల్లో తరచూ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని సూచిస్తున్నారు.

కఠినంగా వ్యవహరించాలి..

అగ్నిమాపక దళానికి ఆధునిక పరికరాలు, వాహనాలు సమకూర్చాలి. సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలి. ప్రతి ప్రాంతానికి అందుబాటులో అగ్నిమాపక కేంద్రాలు ఉండేలా చూడాలి. విద్యుత్ సంబంధిత ప్రమాదాలు జరగకుండా.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నాణ్యమైన వైరింగ్, ఎర్తింగ్ వంటివి తప్పనిసరి చేయాలి. మండే గుణం కలిగిన పదార్థాల నిల్వ, రవాణాపై కఠినమైన నియమాలు విధించాలి. వాటిని సురక్షితంగా నిర్వహించేలా చూడాలని.. నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

సంబంధిత కథనం