Vizag Shifting: విశాఖకు రాజధాని తరలింపు ఇప్పట్లో సాధ్యమేనా?-is it possible to shift the andhra capital to visakhapatnam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Is It Possible To Shift The Andhra Capital To Visakhapatnam

Vizag Shifting: విశాఖకు రాజధాని తరలింపు ఇప్పట్లో సాధ్యమేనా?

HT Telugu Desk HT Telugu
Jul 12, 2023 06:22 AM IST

Vizag Shifting: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని వికేంద్రీకరణ, తరలింపు వ్యవహారం ఎటూ తేలకుండానే కాలం గడిచిపోతోంది. ముఖ్యమంత్రి ప్రకటన చేసిన మూడున్నరేళ్లు గడిచినా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. తాజా పరిణామాల నేపథ్యంలో రాజధాని తరలింపు ఇప్పట్లో సాధ్యమవుతుందా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి.

ఎప్పటికి తేలేను అమరావతి
ఎప్పటికి తేలేను అమరావతి (facebook)

Vizag Shifting: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని వికేంద్రీకరణ, పరిపాలనా రాజధాని విశాఖపట్నం తరలింపు వ్యవహారంలో ప్రకటనలు తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గడువు మీద గడువు పొడిగించుకుంటూ పోతున్నారు తప్ప రాజధాని వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చే ప్రయత్నాలు మాత్రం ఫలించడం లేదు.

ట్రెండింగ్ వార్తలు

రాజధాని నగరాన్ని విశాఖపట్నం తరలించాలనే ముఖ‌్యమంత్రి ఆలోచన 2019 డిసెంబర్‌లో తెరపైకి వచ్చింది.అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతమై ఉండకూడదనే తలంపుతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల మధ్య హేతుబద్ధమైన అభివృద్ధి కల్పించడానికి పరిపాలనా వ్యవహారాలను విశాఖపట్నం నుంచి నిర్వహించాలని యోచించారు.

రాజధాని తరలింపు నిర్ణయం వెనుక కారణాలు ఏమున్నా,అన్ని ప్రాంతాలకు అమోదయోగ్యమైన అభివృద్ధి తమ నినాదమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. విశాఖలో పరిపాలనా రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని, అమరావతిలో శాసన రాజధాని కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. నిజానికి ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని నిలిపి వేసింది. దాదాపు లక్ష కోట్ల రుపాయలు ఖర్చయ్యే రాజధానిని ఒక ప్రాంతానికి కేంద్రీకృతం చేయడం తగదని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది.

రాజధాని విషయంలో ప్రజల అమోదం పొందడానికి, వారిని కన్విన్స్ చేయడానికి ఎన్ని కారణాలు చెబుతున్నా ప్రధానంగా అమరావతిని వ్యతిరేకించడానికి సామాజిక, ఆర్ధిక కారణాలే ఎక్కువగా కనిపిస్తాయి. అమరావతి ప్రాంతంలో రాజధాని కొనసాగిస్తే బలమైన వర్గానికి పునాదిగా మారుతుందనే కారణంతో పాటు రాజధాని నిర్మాణాన్నితాము కొనసాగించినా అది ఎప్పటికీ చంద్రబాబు ఖాతాలోనే ఉంటుందనే భావన వైసీపీలో ఉంది.

కేంద్రం పాత్రపై సందేహాలు….

రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. తొమ్మిదేళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. రెండు రాష్ట్రాలు మనుగడలోకి వచ్చినప్పటి నుంచి కేంద్రంలో బీజేపీ పాలిస్తోంది. ఏపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏర్పడిన టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది.

మరోవైపు రాజధాని వ్యవహారంలో జరుగుతున్న తాత్సారంపై బీజేపీ పోషిస్తున్న పాత్రపై రకరకాల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా టీడీపీ హయంలో అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేసిన తర్వాత దానిని ఇప్పటికీ ఖరారు చేయకపోవడానికి బాధ్యులు ఎవరనే సందేహం వస్తుంది. సిఆర్‌డిఏ చట్టం ద్వారా అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఏపీ అసెంబ్లీ ఖరారు చేసింది. ఆ తర్వాత రైతుల నుంచి సమీకరించిన భూముల్లో నిర్మాణం చేపట్టింది. ప్రధాని స్వయంగా రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలలో బీజేపీ భాగం ఎంత అనే సందేహం కూడా ప్రజల్లో తలెత్తుతోంది.వైసీపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మిత్ర పక్షమో, భాగస్వామ్య పక్షమో కాదు. కాకపోతే నాలుగేళ్లుగా నమ్మకమైన భాగస్వామిగా ఉంది. బీజేపీకి విధేయత కొనసాగిస్తోంది. రాజకీయమైన నిర్ణయాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందుకు సాగుతుంటాయి. రాజధాని విషయంలో మాత్రం కేంద్రం ఎలాంటి జోక్యాన్ని ప్రదర్శించలేదు. అంతెందుకు అమరావతికి ఇప్పటికీ కనీసం పిన్‌ కోడ్‌ కూడా దక్కలేదు. వెలగపూడి గ్రామ పంచాయితీ పిన్‌ కోడ్‌కు అది పరిమితం అయ్యింది.

రాజకీయంగా విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లో ఏపీ రాజధానిగా అమరావతిని చూపించి చేతులు దులుపుకున్నారు. కేంద్రం మీద మాట రాకుండా ఉండటానికి మ్యాప్‌లో ఏపీ రాజధానిని ఖరారు చేశారనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు రాజధాని వ్యవహారంలో తలెత్తన వివాదాలు ఇప్పట్లో పరిష్కారం అయ్యేలా కనిపించడం లేదు. సుప్రీం కోర్టులో దాఖలైన కేసుల విచారణ డిసెంబర్‌కు వాయిదా పడింది. ఆ వెంటనే విచారణ జరుగుతుందనే నమ్మకం కూడా లేదు. మరోవైపు సెప్టెంబర్‌లో విశాఖపట్నం వెళ్లాలని జగన్ ముహుర్తం ఫిక్స్ చేసుకున్నారు. కొద్ది నెలలుగా సెప్టెంబర్ జపం చేస్తున్నారు.

రాజధాని కేసులు ఎటూ తేలకుండా విశాఖపట్నం వెళితే పెద్దగా ఒరిగేది కూడా ఏమి ఉండదు. ముఖ‌్యమంత్రి ఎక్కడి నుంచైనా పనిచేసే వెసులుబాటు ఉన్నందున సిఎం విశాఖ వెళితే ఆయన వ్యక్తిగతంగా వెళ్లినట్టే అవుతుంది. పరిపాలనా యంత్రాంగాన్ని మొత్తం తనతో ఎప్పుడు తీసుకెళ్తారనేదే అసలు ప్రశ్న. కోర్టు కేసులు కొలిక్కి రావడానికి ముందే ఎన్నికలు ముంచుకు రావొచ్చు. అప్పుడు ప్రజా తీర్పును కోరడం తప్ప వైసీపీకి మరో ప్రత్యామ్నయం ఉండదు.

IPL_Entry_Point