Chiranjeevi Re Entry : బీజేపీ వ్యూహాత్మక ఎత్తుగడ.. మళ్లీ రాజ్యసభకు అన్నయ్య! కారణం ఇదేనా?
Chiranjeevi Re Entry : మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు. 2009కి ముందు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన చిరు.. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. కొన్నాళ్లు కేంద్రమంత్రిగా పనిచేశారు. మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టారు. తాజాగా ఆయనను రాజ్యసభకు పంపిస్తారనే చర్చ నడుస్తోంది.
రాజకీయ వ్యూహాలు రచించడంలో నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం దిట్ట. ఏ నిర్ణయం తీసుకున్నా దానివల్ల బీజేపీకి ఎంత లబ్ధి జరుగుతుందనే ఈ ఇద్దరు నేతలు ఆలోచిస్తారు. ప్రస్తుత రాజకీయాల్లో ఇది చాలా అవసరం. గతంలో వీరిద్దరు తీసుకున్న నిర్ణయాలు బీజేపీకి ఎంతో లాభం చేశాయి. అయితే.. అవి నార్త్ ఇండియా వరకే పరిమితం అయ్యాయి. సౌత్‌పై పట్టు కోసం వీరు ఎంత ప్రయత్నించినా.. అనుకున్న స్థాయిలో ఫలితాలు రావడం లేదు. దీంతో ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సి వస్తోంది.
గట్టి ప్లాన్..
ఈ నేపథ్యంలో బీజేపీ మరో గట్టి ప్లాన్ వేసినట్టు పొలిటికల్ సర్కిల్‌లో టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ పెట్టిందని తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో పవన్‌కు రూట్ మ్యాప్ ఇచ్చిన బీజేపీ.. ఇప్పుడు తెలంగాణపైనా నజర్ పెట్టింది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవిని తమవైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. చిరంజీవిని మళ్లీ రాజ్యసభకు పంపాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.
చిరుతో మోదీ..
ఇటీవల ఢిల్లీలోని కిషన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ప్రధాని మోదీ వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. మోదీ, చిరంజీవికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. ఈ పరిణామాలే చిరంజీవిని రాజ్యసభకు పంపిస్తారనే ఊహాగాణాలకు బలం చేకూరుస్తున్నాయి. అయితే.. మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం చిరుకు ఇష్టం లేదనే టాక్ వినిపిస్తోంది.
రాష్ట్రపతి కోటాలో..
దీనికి బీజేపీ మరో ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. బీజేపీలో చేరకున్నా.. రాష్ట్రపతి కోటాలో అన్నయ్యను పెద్దల సభకు పంపాలని ప్లాన్ చేస్తున్నట్టు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే సుధామూర్తి లాంటివారిని అలాగే రాజ్యసభకు పంపారు. చిరంజీవిని కూడా ఇదే తరహాలో పంపాలని బీజేపీ ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే పవన్ మరో సోదరుడు నాగబాబును రాజ్యసభకు పంపకుండా ఆపారనే చర్చ జరుగుతోంది.
కర్ణాటక మినహా..
దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క కర్ణాటకలో మినహా.. వేరే ఎక్కడా బీజేపీకి చెప్పుకోదగ్గ స్థాయిలో బలం లేదు. సొంతంగా పోటీ చేసే దమ్మున్నా.. ఫలితాలు ఆశించిన స్థాయిలో వస్తాయనే నమ్మకం లేదు. అయితే.. మెగా ఫ్యామిలీకి ఏపీ, తెలంగాణలో భారీ స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉంది. దీన్ని ఉపయోగించుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 2029 అసెంబ్లీ ఎన్నికల వరకైనా.. పవన్, చిరు ద్వారా బలపడాలని బీజేపీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
పవన్‌కు సపోర్ట్‌గా..
బీజేపీ ఇప్పటికే పవన్‌కు బాగా సపోర్ట్ ఇస్తోంది. అటు ఏపీలో పవన్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. పవన్ ద్వారా ఏపీలో బలమైన సామాజికవర్గాన్ని తమవైపునకు తిప్పుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు ఆ మధ్య చర్చ జరిగింది. అటు పవన్ కళ్యాణ్ కూడా సనాతన హిందూధర్మం పేరుతో సంచలన వ్యాఖ్యలు చేశారు. వాటికి బీజేపీ సహా.. సంఘ్ పరివార్ నుంచి మద్దతు లభించింది. ఏపీలో ప్రస్తుతం పవన్‌తో రాజకీయం నడుస్తోంది. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదు.
తెలంగాణపై నజర్..
అందుకే.. చిరంజీవిని రాజ్యసభకు పంపి, తెలంగాణలో బలపడాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. పవన్‌ను ఏపీలో.. అన్నయ్యను తెలంగాణలో ఉపయోగించుకోవాలని కమలం లీడర్లు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. బీజేపీ ప్రతిపాదనలకు చిరంజీవి ఒప్పుకుంటారా అన్నది అసలు సమస్య. అందుకే ఇటు పవన్ ద్వారా, అటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ద్వారా అన్నయ్యను ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.