AP Landgrabbing Act 2024: భూకబ్జాలపై ఉక్కుపాదం,కబ్జాదారులకు 10-14ఏళ్ల జైలు, మార్కెట్ విలువకు సమాన జరిమానాతో కొత్త చట్టం
AP Landgrabbing Act 2024: ఆంధ్రప్రదేశ్‌లో భూకబ్జాలపై ఉక్కు పాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.1982 చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో కఠిన చట్టాలను అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది.చట్టం అమల్లోకి వస్తే భూకబ్జాదారులకు గరిష్టంగా 14ఏళ్ల జైలుతోపాటు భూమి విలువకు సమానంగా జరిమానా ఉంటుంది.
AP Landgrabbing Act 2024: పల్లె పట్టణం అనే తేడా లేకుండా ఏపీలో పెట్రేగిపోతున్న భూకబ్జా ముఠాలను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 1982 నాటి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్‌ను రద్దు చేసి దాని స్థానంలో కొత్త శిక్షలతో మరో చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అన్ని రాష్ట్రాల్లో అధ్యయయనం చేసిన తర్వాత అందుబాటులో ఉన్న శిక్షల్ని పరిశీలించిన తర్వాత కొత్త చట్టానికి రూపకల్పన చేస్తున్నట్టు ఏపీ రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా వివరించారు.
ఆంధ్రప్రదేశ్ భూ కబ్జాల నిరోధక చట్టం 1982 రద్దుకు ఏపీ క్యాబినెట్ అమోద ముద్ర వేసింది. దాని స్థానంలో ఏపి ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్ 2024కు రూపకల్పన చేస్తున్నారుు. పాత చట్టం స్థానంలో కొత్త చట్టం ముసాయిదాను ప్రవేశపెడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో భూకబ్జాలు తీవ్రమైన సమస్యగా మారింది. ఎంతోమంది భూ యజమానులకు కబ్జాలు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ప్రజల ఆస్తుల్ని కాపాడుకోడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. భూములు, విలువైన ఆస్తుల్ని యథేచ్ఛగా కబ్జా చేస్తున్నా వాటిని కట్టడి చేయడంలో అందుబాటులో ఉన్న చట్టాలు సమర్థవంతంగా పనిచేయడం లేదనే అభిప్రాయాలు ఉండటంతో ప్రభుత్వం చట్టాలను పటిష్టం చేసే ప్రయత్నాలు ప్రారంభించింది.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంపై ఏపీ ప్రభుత్వం రెవిన్యూ చట్టాల పరిశీలనపై అధ్యయనం చేయాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న చట్టాలను పరిశీలించింది. గుజరాత్‌లో తీసుకువచ్చిన భూకబ్జాల నిరోధక చట్టం 2020, కర్ణాటకలో 2011లో తీసుకు వచ్చిన భూకబ్జాల నిరోధక చట్టం, అస్సాం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్‌ల అమలు తీరును అధికారులు క్షుణ్ణంగా అధ్యాయనం చేశారు.
భూకబ్జాలకు పాల్పడే వారిపై కఠిన శిక్షలు, జరిమానాలు విధించాలని కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ అంశంపై సీసీఎల్‌ఏ ఆధ్వర్యంలో వర్క్‌షాప్ నిర్వహించి చట్టం రూపకల్పనపై అభ్యంతరాలు, అభిప్రాయాలను సేకరించారు. ముసాయిదా బిల్లు రూపకల్పనపై అడ్వకేట్ జనరల్ అభిప్రాయాలు తీసుకున్నారు.
పట్టణ ప్రాంతాల భూములకే పాతచట్టంలో రక్షణ
భూకబ్జాల నిరోధక చట్టం 1982లో ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఉండే భూములకు మాత్రమే రక్షణ లభిస్తున్నట్టు కమిటీ గుర్తించింది. పెరుగుతున్న పట్టణీకరణ, మార్కెట్ విలువల ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా భూకబ్జా సమస్య తీవ్రంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. గ్రామీణ ప్రజలు ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఆస్తులను పోగొట్టుకుంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. గతంలో భూకబ్జాలకు పాల్పడే వారికి ఆరు నెలల నుంచి 5ఏళ్ల వరకు మాత్రమే జైలు శిక్షలు ఉండేవి. జరిమానా గరిష్టంగా రూ.5వేలు మాత్రమే ఉండేది.దీంతో ఈ చట్టాన్ని ఎవరు ఖాతరు చేయడం లేదని గుర్తించారు.
ముసాయిదా చట్టంలో భూకబ్జాలకు పాల్పడే వారిని ఉక్కుపాదంతో అణిచివేసేలా శిక్షలు ప్రతిపాదించారు. కనీస జైలు శిక్షను 10ఏళ్లకు ఖరారు చేశారు. గరిష్టంగా 14ఏళ్ల జైలు శిక్షను చట్టంలో ప్రతిపాదించారు. భూకబ్జా ఘటనల్లో విధించే జరిమానాను బాధితులు కోల్పయే ఆస్తి మార్కెట్ విలువకు సమానం చేశారు. ఈ మేరకు కోర్టు ఉత్తర్వుల ద్వారా బాధితులకు న్యాయం చేస్తారు. కబ్జాకు గురైన ఆస్తికి సమానమైన విలువను నిందితుల నుంచి జప్తు చేసి బాధితులకు చెల్లిస్తారు.
11. 1982 చట్టం, జిల్లా న్యాయమూర్తులు మరియు రెవెన్యూ సభ్యులతో సహా ఒక ఛైర్మన్ మరియు నలుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక న్యాయస్థానాన్ని ఊహించింది మరియు 2024 చట్టంలో, సెషన్స్ మరియు జిల్లా న్యాయమూర్తిగా అనుభవం ఉన్న న్యాయమూర్తిచే క్రమబద్ధమైన నిర్మాణం ఊహించబడింది మరియు అధ్యక్షత వహించబడుతుంది. అదనపు న్యాయమూర్తులు కూడా కావ
జిల్లా స్థాయి కోర్టుల ఏర్పాటు…
1982 నాటి చట్టంలో భూ కబ్జా కేసుల విచారణను ప్రత్యేక కోర్టుల్లో విచారించేవారు. అందులో ఛైర్మన్‌తో పాటు నలుగురు సభ్యులు ఉండేవారు. కొత్త చట్టంలో జిల్లా స్థాయి సెషన్స్ జడ్జి స్థాయి అనుభవం ఉన్న న్యాయమూర్తి కేసుల్ని విచారిస్తారు. అదనపు న్యాయమూర్తుల్ని కూడా నియమిస్తారు. అవసరమైతే కోర్టుల్ని రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యస్థీకరిస్తుంది. ప్రత్యేక కోర్టులకు సివిల్, క్రిమినల్ అధికారాలను కట్టబెడతారు.
1982 నాటి చట్టంలో పరిమితమైన అధికారాలు మాత్రమే ఉండేవి. కొత్త చట్టంలో జిల్లా కలెక్టర్ స్థాయిలో సీనియర్ అధికారులతో విచారణ జరిపేలా ఆదేశించేలా నిబంధనలు పొందుపరుస్తున్నారు. 1982 చట్ట ప్రకారం విచారణలో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదరవుతున్నాయి. కొత్త చట్టంలో తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపైనే ఉంటుంది. సంబంధిత ఆస్తుల్ని సమకూర్చుకోడానికి ఉన్న ఆదాయ వనరులు, అవి ఎలా సంక్రమించాయనే దానిని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే నిరూపించుకోవాల్సి ఉంటుంది.
కొత్త చట్టంలో ప్రతి ల్యాండ్ గ్రాబింగ్ కోర్టుకు విధిగా ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమిస్తారు. బాధితులకు నష్టపరిహారాన్ని కూడా కోర్టులే నిర్ణయిస్తాయి. సుమోటొగా కేసుల్ని చేపట్టే అధికారం కూడా ప్రత్యేక కోర్టులకు సంక్రమిస్తుంది. ప్రైవేట్ వ్యక్తులు దాఖలు చేసే కేసుల్ని కూడా విచారిస్తారు. జిల్లా కలెక్టర్ల ద్వారా వచ్చే ఫిర్యాదుల విచారణను కూడా ప్రత్యేక కోర్టులు చేపడతాయి. తద్వారా ఎక్కువ మంది ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. అన్ని జిల్లాలకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటవుతాయి.