విశాఖపట్నం తీరాన ప్రధాని మోదీ యోగా..-international yoga day pm modi chandra babu naidu pavan kalyan attends grand event in visakhapatnam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  విశాఖపట్నం తీరాన ప్రధాని మోదీ యోగా..

విశాఖపట్నం తీరాన ప్రధాని మోదీ యోగా..

Sharath Chitturi HT Telugu

అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో విశాఖపట్నం తీరాన నిర్వహించిన భారీ ఈవెంట్​లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రజలకు యోగా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు.

విశాఖపట్నంలో మోదీ యోగా..

అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో విశాఖపట్నం తీరాన ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారీ ఈవెంట్​లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్​ కళ్యాన్​ ఈ వేడుకకు హాజరయ్యారు.

విశాఖపట్నంలోని ఆర్​కే బీచ్​ నుంచి భోగాపురం వరకు సుమారు 26 కిలోమీటర్ల కారిడర్​లో ఈ యోగా ఈవెంట్​ని ఏపీ ప్రభుత్వం నిర్వహించింది. ఇందులో 3లక్షలకుపైగా మంది ఏకకాలంలో యోగా చేస్తారని అంచనాలు ఉన్నాయి.

విశాఖపట్నంలో ప్రధాని మోదీ యోగా..

యోగాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడంలో ప్రధాని మోదీ చేసిన కృషి గురించి తెలిసిందే. ప్రతియేటా అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున వివిధ ప్రాంతాల్లో, లక్షలాది మంది ప్రజలతో కలిసి ఆయన యోగా చేస్తుంటారు. ఇందులో భాగంగానే ఈసారి విశాఖపట్నంలోని తీరం వెంబడి నిర్వహించిన ఈవెంట్​లో ఆయన పాల్గొన్నారు.

“దశాబ్దకాలంలో యోగా సాధించిన ప్రస్తానం చూస్తే నాకు చాలా విషయాలు గుర్తొస్తాయి. జూన్​ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించాలని యూఎన్​జీఏలో భారత్​ తీర్మానం పెట్టినప్పడు, అతి తక్కువ కాలంలోనే 175 దేశాలు మనతో నిలబడ్డాయి. నేటి ప్రపంచంలో ఈస్థాయిలో ఐకమత్యం కనిపిస్తుండటం మామూలు విషయం కాదు. అంతర్జాతీయ యోగా దినోత్సవం వేళ ప్రపంచ ప్రజలందరికి నా శుభాకాంక్షలు. నేడు, ప్రపంచం మొత్తం యోగా చేస్తోంది. యోగా కోసం ప్రపంచం మొత్తాన్ని ఒక్కటవ్వడం చాలా సంతోషంగా ఉంది,” అని మోదీ అన్నారు.

“దురదృష్టవశాత్తు ప్రపంచంలో నేడు ఉద్రిక్తతలు, అనిశ్చితి పెరిగిపోయింది. ఈ సమయంలో యోగా శాంతికి మార్గంగా నిలుస్తుంది. మానవత్వం ఊపిరిపీల్చుకునేందుకు, ప్రజలందరు ఒక్కటయ్యేందుకు యోగా ఒక పాస్​ బటన్​గా పనిచేస్తుంది,” అని మోదీ అభిప్రాయపడ్డారు.

అనంతరం ప్రజలతో కలిసి మోదీ యోగా చేశారు.

అంతకముందు.. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్​ కళ్యాన్​లు ప్రధాని మోదీని సత్కరించారు.

ఈ యోగా ఈవెంట్​ని ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించింది. గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డులో చోటు దక్కించుకునే విధంగా వేడుకను ప్లాన్​ చేసింది.

ఈ ఈవెంట్​లో మాట్లాడుతూ.. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, జూన్​ 20న 22,122వేల మంది గిరిజన విద్యార్థులు 108 నిమిషాల పాటు సూర్య నమస్కారాలు చేశారని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

“ఏకకాలంలో అత్యధిక మంది సూర్య నమస్కారాలు చేస్తున్న రికార్డును సృష్టించాలనుకున్నాము,” అని చంద్రబాబు పేర్కొన్నారు.

విశాఖపట్నంలో జరిగిన యోగా ఈవెంట్​లో రాష్ట్రంలోని 8లక్షల ప్రాంతాలతో పాటు దేశ, విదేశాల నుంచి ప్రజలు హాజరవుతారని అంచనా వేశారు. ఇందుకోసం 2కోట్ల రిజిస్ట్రేషన్లు అంచనా వేయగా.. మొత్తం మీద 2.39కోట్ల మంది ఆసక్తి చూపించినట్టు చంద్రబాబు నాయుడు వివరించారు.

యోగా ఈవెంట్​ సజావుగా సాగేందుకు ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం పటిష్ఠ భద్రతో పాటు అన్ని ఏర్పాట్లు చేసింది. 1000మంది ప్రజలు యోగా చేసే విధంగా మొత్తం మీద 326 కంపార్ట్​మెంట్లను రూపొందించింది. 3.32 లక్షల టీషర్టులు, 5లక్షల యోగా మ్యాట్​లను సిద్ధం చేసింది.

రాష్ట్రం నలుమూలల నుంచి 3వేలకుపైగా బస్సులు ఈవెంట్​కు చేరుకుంటున్నాయి.

“26 కిలోమీటర్ల మేర జరిగే ఈవెంట్​ని పర్యవేక్షించేందుకు 1200 సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లను ఉపయోగిస్తున్నాము. 10వేలకుపైగా మంది పోలీసు సిబ్బంది డ్యూటీలో ఉంది,” అని డీజీపీ హరీశ్​ కుమార్​ గుప్తా తెలిపారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం