Georgia University: ఉత్తరాంధ్రకు ఇంటర్నేషనల్ యూనివర్శిటీ.. జార్జియా నేషనల్ వర్శిటీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం-international university for uttarandhra ap government signs agreement with georgia national university ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Georgia University: ఉత్తరాంధ్రకు ఇంటర్నేషనల్ యూనివర్శిటీ.. జార్జియా నేషనల్ వర్శిటీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

Georgia University: ఉత్తరాంధ్రకు ఇంటర్నేషనల్ యూనివర్శిటీ.. జార్జియా నేషనల్ వర్శిటీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

Sarath Chandra.B HT Telugu

Georgia University: ఏపీలోని ఉత్తరాంధ్ర కు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ రానుంది. జార్జియా నేషనల్ యూనివర్సిటీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.క్యాంపస్‌ ఏర్పాటుకు రూ.1,300 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు జార్జియా నేషనల్ యూనివర్శిటీ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎంఓయూ కుదర్చుకుంది.

ఉత్తరాంధ్రలో ఇంటర్నేషనల్ యూనివర్శిటీ ఏర్పాటుకు జార్జియా నేషనల్ యూనివర్శిటీతో ఏపీ ప్రభుత్వ ఒప్పందం

Georgia University: రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో ఉత్తరాంధ్ర లో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏర్పాటుకు జార్జియా నేషనల్ యూనివర్సిటీ (GNU) ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ SEU (GNU)తో అవగాహన ఒప్పందం కుదిరింది.

ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో జిఎన్ యు, ఎపి ప్రభుత్వ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం ఉత్తరాంధ్రలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ స్థాపించడానికి GNU సుమారు రూ.1,300 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఈ ఒప్పందంతో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చెందడంతోపాటు 500మందికి ఉపాధి లభిస్తుంది.

అంతర్జాతీయ విశ్వవిద్యాలయ స్థాపనకు మద్దతుగా పెట్టుబడి, సాంకేతికత, ప్రణాళిక రూపకల్పన, ఎక్విప్ మెంట్ లలో GNU బలాలను ఉపయోగించుకోవడం ఈ సహకారం లక్ష్యమని ఏపీప్రభుత్వం వివరించింది. జార్జియన్ నేషనల్ యూనివర్సిటీతో ఒప్పందం మన విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యను అందించడంతోపాటు ఏపీ విద్యారంగాన్ని ప్రపంచపటంలో నిలిపేందుకు దోహదపడుతుందని మంత్రి నారా లోకేష్ అన్నారు.

ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో విద్యా ప్రమాణాలను పెంచడమే కాకుండా ప్రపంచ ఉద్యోగ మార్కెట్‌లో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలు అందుతాయని తెలిపారు. ఏపీ విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దాలన్న మా ప్రభుత్వ చిత్తశుద్ధి, నిబద్ధతకు ఈ ఒప్పందం నిదర్శనమని వివరించారు.

రాష్ట్రంలో ఉన్నత విద్య ప్రమాణాలను మెరుగుపర్చడం, గ్లోబల్ ఎక్స్ పోజర్, పాఠ్యాంశాలను మెరుగుపర్చడం, అధునాతన విద్య, సాంకేతికలను అందించడం, పరిశోధన, నవీన ఆవిష్కరణలను ప్రోత్సహంచడం ఒప్పందం ప్రధాన లక్ష్యమని అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రోగ్రామ్ లలో ముఖ్యంగా టెక్నాలజీ, బిజినెస్, ఆరోగ్య హెల్త్ కేర్ లలో జిఎన్‌యు నైపుణ్యాలను అందిస్తుంది.

నాలెడ్జి షేరింగ్‌ లక్ష్యం..

అధ్యాపకులు, విద్యార్థుల నడుమ నాలెడ్జి షేరింగ్ ను సులభతరం చేయడం, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ప్రపంచ విద్యా వ్యవస్థల అభ్యసన విధానాలపై అవగాహన కల్పిస్తుంది. అంతర్జాతీయంగా ప్రస్తుత ట్రెండ్ కు అనుగుణంగా పాఠ్యాంశాలను ఆధునీకరించడం, మెరుగుపర్చడంతోపాటు ఏఐ వంటి రంగాల్లో ఉత్తమ పద్ధతులపై విద్యార్థులకు జిఎన్ యు శిక్షణ ఇస్తుంది. ఉమ్మడి పరిశోధన కార్యక్రమాలు, ఆవిష్కరణల ఆధారిత ప్రాజెక్టులకు అవకాశాలను కల్పిస్తుంది.

రాష్ట్రంలో సాంకేతిక విద్య, పారిశ్రామిక పురోగతికి దోహదం పడుతుంది. MIT వంటి ప్రపంచస్థాయి సంస్థలతో GNU సంబంధాలు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పరిశ్రమ డిమాండ్లకు అనుగుణంగా నైపుణ్యాలు, అర్హతలతో కూడిన విద్యార్థులను సన్నద్ధం చేసి... జాతీయ, అంతర్జాతీయస్థాయి ఉపాధి అవకాశాలకు ఊతమిస్తుంది.

జార్జియాలో అతిపెద్ద యూనివర్శిటీ..

2002లో స్థాపించబడిన జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ జార్జియాలో అతిపెద్ద యూనివర్సిటీగా అవతరించడమేగాక, అంతర్జాతీయంగా పేరెన్నికగన్న డైనమిక్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా ఉంది. 1,100 మందికి నైపుణ్యం కలిగిన అధ్యాపక సిబ్బందిని కలిగి ఉన్న ఈ యూనివర్సిటీలో విద్యనభ్యసించిన సుమారు 52,500 మంది పూర్వవిద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో స్థిరపడ్డారు.

జిఎన్ యు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన 4 ఇంటర్నేషనల్ అక్రిడిటేడెట్ ఫ్యాకల్టీ ప్రోగ్రామ్స్ తోపాటు పలు అగ్రశ్రేణి గ్లోబల్ కంపెనీల కొలాబరేషన్ కలిగి ఉంది. ఫండింగ్ తో కూడిన ఇంటర్నేషనల్ ఎక్స్చేంజి ప్రోగ్రామ్ లను కూడా నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో జిఎన్ యు వ్యవస్థాపకుడు, రెక్టార్ డాక్టర్ గియా కావ్టెలిష్విలి, విద్యావ్యవహారాల వైస్ రెక్టార్ ప్రొఫెసర్ జార్జ్ గవ్తాడ్జే, ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు సీఈవో సాయికాంత్ వర్మ, ఏపీ కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ భరత్ గుప్త, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తదితరులు పాల్గొన్నారు.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం