ఏపీ వాసులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విజయవాడ నుంచి నేరుగా సింగపూర్ వెళ్లేందుకు ఫ్లైట్ సర్వీసులను అందుబాటులోకి రానున్నాయి. ఇండిగో సంస్థ ఈ సేవలను ఆపరేట్ చేయనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ సర్వీస్ అందుబాటులోకి వస్తే కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు.
“విజయవాడ మరియు సింగపూర్ చాంగి విమానాశ్రయం మధ్య నూతన అంతర్జాతీయ విమాన సర్వీసును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయికి అనుసంధానం చేయడానికి మరింతగా ఉపయోగపడుతుంది . నవంబర్ 15వ తేదీ నుండి ఇండిగో విమాన సంస్థ వారానికి మూడు రోజులు (మంగళవారం, గురువారం, శనివారం) పాటు ఈ విమాన సర్వీసులను అందించనుంది” అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వివరించారు.
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలో భాగమైన ‘కనెక్టెడ్ ఆంధ్రప్రదేశ్’ అనుగుణంగా ఈ సేవలను ఏర్పాటు చేస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ప్రవాస ఆంధ్రులు, అంతర్జాతీయ విద్యార్థులు, వ్యాపార ప్రయాణికులు మరియు పర్యాటకులకు అందరికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు.
“విజయవాడ మరియు పరిసర ప్రాంతాల ప్రజల చిరకాల కోరికను నెరవేర్చే విధంగా ఈ సింగపూర్ సర్వీసును ప్రారంభిస్తున్నాం. ప్రయాణ సౌలభ్యం పెరగడమే కాకుండా, ఇది వాణిజ్యం, విద్య, పర్యాటకం మరియు ఆసియన్ దేశాలతో సహా అంతర్జాతీయ సంబంధాలకు కొత్త మార్గాలను తెరుస్తుంది” అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
“ఇది ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతికి గణనీయమైన ప్రోత్సాహాన్ని అందించనుంది. మెరుగైన అంతర్జాతీయ కనెక్టివిటీ వల్ల విదేశీ పెట్టుబడులు ఆకర్షించబడతాయి. ప్రపంచ దేశాలతో భాగస్వామ్యాలు మరింత బలపడతాయి. అమరావతిని ఒక ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా తీర్చిదిద్దేందుకు ఇది మరింత గా సహాయపడుతుంది. ఈ అభివృద్ధితో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సన్ రైజ్ స్టేట్ గా, ప్రపంచానికి మరింత దగ్గరగా ప్రయాణిస్తుంది” అని కేంద్రమంత్రి తన ప్రకటనలో ప్రస్తావించారు.
సంబంధిత కథనం